లెస్బియ‌న్ పేరెంట్స్ ఉన్నార‌ని పాప‌ను స్కూల్లో ఇలా.. దారుణం..?!

by Disha Web Desk 20 |
లెస్బియ‌న్ పేరెంట్స్ ఉన్నార‌ని పాప‌ను స్కూల్లో ఇలా.. దారుణం..?!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః స్వ‌లింగ సంప‌ర్కం, లింగ‌మార్పిడి విష‌యంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా దేశాలు సానుకూలంగా స్పందిస్తున్నాయి. ప్ర‌భుత్వాలు ఇలాంటి ప్ర‌త్యేక ఆస‌క్తుల్ని సాధార‌ణం చేసే క్ర‌మంలో ముంద‌డుగేస్తున్నాయి. అయితే, మ‌త‌వాదులు మాత్రం త‌మ ఛాంద‌స భావాల‌తో ఈ ల‌క్ష‌ణాలు అస‌హ‌జ‌మైన‌వ‌ని, వారిపై తీవ్ర‌మైన వివ‌క్ష‌ను చూపుతున్నారు. ఇలాంటి ఘ‌ట‌న ఏదో మ‌త‌వాద దేశంలో అయితే ఒక ర‌కం గానీ, స్వేచ్ఛ‌కు మారుపేరు అని చెప్పుకునే యుఎస్‌లో జ‌ర‌గ‌డం గ‌మ‌నించాల్సిన విష‌యం. అందులోనూ ఇలాంటి వివ‌క్ష ముక్కుప‌చ్చలార‌ని ప‌సిపిల్ల‌ల‌పై చూపించ‌డం మ‌రింత దారుణమ‌ని అంత‌ర్జాతీయ స‌మాజం పేర్కొంటుంది. వివ‌రాల్లోకి వెళితే, తల్లిదండ్రులు లెస్బియ‌న్‌ జంట అనే కార‌ణంతో లూసియానాలో కిండర్ గార్టెన్ క్లాస్‌లో చదువుతున్న ఐదేళ్ల బాలికను ఓ మతపరమైన పాఠశాల తొలగించిన ఘ‌ట‌న విమ‌ర్శ‌లు ఎదుర్కుంటుంది.

ఎన్‌బిసి న్యూస్ ప్రకారం, ఎమిలీ, జెన్నీ పార్కర్‌ల వివాహం డిక్విన్సీలోని బైబిల్ బాప్టిస్ట్ అకాడమీ బోధనలను అనుసరించి జ‌ర‌గ‌లేదు కాబట్టి, వాళ్లు త‌మ పాప‌ను మరొక పాఠశాలలో చేర్పించాల్సిందిగా చెప్పారు. 5 ఏళ్ల వ‌య‌సున్న ఎమిలీ జోయ్ తండ్రి సెప్టెంబరు 2020లో ఉద్యోగంలో జరిగిన ప్రమాదంలో మ‌ర‌ణించాడు. ఆ త‌ర్వాత పాప‌ను ఎమిలీ, ఆమె భాగ‌స్వామి క‌లిసి ఆగస్టు 3న దత్తత తీసుకున్నారు. అయితే, మ‌తం చెప్పే మాన‌వ‌త్వాన్ని మ‌రిచిన స్కూలు యాజ‌మాన్యం పాప‌ను స్కూల్ నుండి పంపించేయ‌డంపై లెస్బియ‌న్ జంట ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. "ఆమె తన తండ్రిని కోల్పోయింది. తల్లిని కోల్పోయింది. ఇప్పుడు ఆమె చాలా ఇష్టపడే తన పాఠశాలను కోల్పోతోంది" అని జెన్నీ స్థానిక సంస్థ KPLC కి చెప్పారు.

ఒక ప్రకటనలో, పాఠశాల యాజ‌మాన్యం జోయిని బహిష్కరించే నిర్ణయాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నించింది. "క్రైస్తవ విలువలను సమర్థించడంలో మన నిబద్ధత ఇతర వ్యక్తుల విలువలకు అనుగుణంగా లేక‌పోవ‌చ్చు. అయితే, దాని అర్థం వారి పట్ల మనకు ద్వేషం ఉంద‌ని కాదు" అన్నారు. అయితే, ఎమిలీ, జెన్నీ పార్కర్‌లకు సంఘం నుండి భారీ మద్దతు లభిస్తోంది. జోయి కిండర్ గార్టెన్ మ‌ర‌లా ప్రారంభించడానికి ఇతర స్థానిక క్రైస్తవ పాఠశాలల నుండి అనేక ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి.


Next Story

Most Viewed