సెప్టెంబరు 30న 'అంతర్జాతీయ అనువాద దినోత్సవం'

by Disha Web Desk 16 |
సెప్టెంబరు 30న అంతర్జాతీయ అనువాద దినోత్సవం
X

దిశ, ఫీచర్స్ : 'అంతర్జాతీయ అనువాద దినోత్సవం' ప్రతి సంవత్సరం సెప్టెంబరు 30న నిర్వహించబడుతుంది. బైబిల్ అనువాదకుడు సెయింట్ జెరోమ్ పుట్టిన రోజుకు గుర్తుగా ఈ దినోత్సవం జరుపుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న మనుషులకు ఇతరుల సంస్కృతి, సంప్రదాయం, జీవన విధానం, భాషను అర్థం చేసుకునేందుకు సహకరించే ముఖ్యమైన ప్రక్రియ అనువాదం. అందుకే ప్రతీ సంవత్సరం దీనికోసం ప్రత్యేక రోజును కేటాయించాలని అంతర్జాతీయ అనువాదకుల సమాఖ్య (ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ట్రాన్స్‌లేటర్స్) 1953లో ప్రతిపాదించింది.

దీని ఫలితంగా 2017 మే 24న జరిగిన యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో సెప్టెంబరు 30న అంతర్జాతీయ అనువాద దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించబడింది. ఇక అజర్‌బైజాన్, బంగ్లాదేశ్, బెలారస్, కోస్టారీకా, క్యూబా, ఈక్వడార్, పరాగ్వే, ఖతార్, టర్కీ, తుర్క్‌మెనిస్తాన్, వియత్నాం వంటి పదకొండు దేశాలు 'డ్రాఫ్ట్ రిజల్యూషన్ ఏ/71/ఎల్ 68'కు అనుకూలంగా సంతకాలు చేశాయి.

ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ట్రాన్స్‌లేటర్స్ సంస్థతోపాటు ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ కాన్ఫరెన్స్ ఇంటర్‌ప్రెటర్స్, క్రిటికల్ లింక్ ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ప్రొఫెషనల్ ట్రాన్స్‌లేటర్స్ అండ్ ఇంటర్‌ప్రెటర్స్, రెడ్ టి, వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ సైన్ లాంగ్వేజ్ ఇంటర్‌ప్రెటర్స్ వంటి అనేక ఇతర సంస్థలు ఈ తీర్మానాన్ని ఆమోదించాలని సూచించాయి. 2018వ సంవత్సరం నుంచి అమెరికన్ ట్రాన్స్‌లేటర్స్ అసోసియేషన్ సెప్టెంబరు 30న అంతర్జాతీయ అనువాద దినోత్సవాన్ని జరుపుకోవడంతోపాటు సమాచారాన్ని వ్యాప్తికి, ప్రొఫెషనల్ అనువాదకుల పాత్ర గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తుంది.



Next Story

Most Viewed