రైతులను ఇబ్బంది పెడితే లైసెన్సులు రద్దు : మంత్రి నిరంజన్ రెడ్డి

by Shyam |
Minister Niranjan Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురించేస్తే లైసెన్స్‌లు రద్దు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. మిల్లులు దగ్గరకు వచ్చిన ధాన్యంలో తరుగు తీయవద్దని ఆదేశించారు. దేశంలో ధాన్యం కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణయని చెప్పుకొచ్చారు. కరోనా నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు కొనుగోళ్ల విషయంలో చేతులెత్తేశాయని అలాంటి పరిస్థితి రాష్ట్రంలో లేదని తెలిపారు. శనివారం మంత్రుల నివాస సముదాయం నుంచి వనపర్తి జిల్లా అధికారులతో టెలీకాన్ఫరెన్సులో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతులకు మేలు చేయాలని రిస్క్ తీసుకొని కొనుగోలు చేపక్డుతున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా వస్తున్న దిగుబడిలో సగానికి పైగా ధాన్యం తెలంగాణ నుండి వస్తుందన్నారు. మిల్లర్లు చెప్పినట్టుగా అధికారులు ఎట్టిపరిస్థితుల్లోనూ వినకూడదని స్పష్టం చేశారు. రైతు కల్లంకాడికి వస్తే ఇంత ప్రేమతో ధాన్యం పెడతాడుకానీ తూకం వేసిన తర్వాత అన్యాయంగా కట్ చేస్తే ఏ మాత్రం ఒప్పుకోడని తెలిపారు.

అందుబాటులో ఉన్న అన్ని రైతువేదికలు, ఇతర గోదాంలను వినియోగించుకొని వర్షాల నుంచి పంటలను కాపాడాలని సూచించారు. మూడు రోజుల పాటు భారీ వర్షం సూచనలున్నాయని ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లు, తరలింపులో జాప్యం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం దిగుబడి ఎక్కువచ్చినప్పుడు దానికి తగినట్లుగా ఏర్పాట్లు చేసి రైతులకు సహకరించాలని తెలిపారు. రవాణా సరఫరా కోసం కాంట్రాక్టు తీసుకున్న ఏజెన్సీలు దానికి తగినట్లు వాహనాలు ఏర్పాటు చేయాలని జాప్యం చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందుబాటులో ఉన్న వాహనాలతో రవాణా చేసి దాని బిల్లులు ఏజెన్సీల నుండి చెల్లించాలని చెప్పారు. రైతులు కూడా ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. కరోనా విపత్తులోనూ ప్రభుత్వం కొంటున్న విషయం దృష్టిలో పెట్టుకోవాలని తెలిపారు.

క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి పంటకూ రూ.7 వేల కోట్ల పై చిలుకు రైతుబంధు, 24 గంటల ఉచిత కరంటు , రైతుభీమా వంటి పథకాలతో రైతులను వ్యవసాయం వైపు ప్రోత్సహిస్తున్నామన్నారు. ఆరు గాలం కష్టపడి రైతు పండించిన పంట అమ్ముకునే విషయంలో ఇబ్బందిపెట్టటం మంచిపద్దతి కాదన్నారు. మిల్లర్ల విషయంలో ఎట్టి పరిస్థితులలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరించవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ , జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి , పౌరసరఫరాలు శాఖ డీఎఓ, డీసీఓ, ఇతర జిల్లా ఉన్నతాధికారులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, పీఎసీఎస్ అధ్యక్షులు, రైతుసమన్వయ సమితి అధ్యక్షులు, మిల్లర్లు, ట్రాన్స్ పోర్ట్ ఏజెన్సీలు పాల్గొన్నారు.

Advertisement

Next Story