స్వేచ్ఛా వేదిక.. శృంగారంపైనే చర్చ!

by  |
Kerala-Womens
X

దిశ, ఫీచర్స్: మహిళలకు సమాన హక్కులు, స్వేచ్ఛా స్వాతంత్రాల టాపిక్‌పై ఎవరైనా లెక్చర్ ఇస్తే.. ఆసక్తిగానే వింటారు. కానీ ఆచరణ విషయంలో ఆమడదూరం ఉంటారు. ఇక సెక్స్ లైఫ్ గురించి మాట్లాడాల్సి వస్తే.. మొదట తోటి మహిళల నుంచే ప్రతిఘటన ఎదురవుతుంది. తాము ధైర్యంగా చేయలేకపోతున్న పనులపై లోపల ఎన్ని అసంతృప్తులున్నా, మరో అమ్మాయి చేస్తే మాత్రం.. ‘అలా ఎలా చేసింది? ఇప్పుడు నలుగురిలో ఎలా తలెత్తుకుని తిరుగుతుంది? అనే మాటల తూటాలు పేల్చేది వాళ్లే. నిజానికి పక్కింటి వదినగారింట్లో కూరలనుంచి అంతరిక్షంలో ఆస్ట్రోనాట్ల అవసరాల వరకు అన్ని విషయాలపై గంటలకొద్ది చర్చ జరిపే మహిళలకు.. శృంగారంపై చర్చించుకునే ఫ్రీడమ్ అరుదనే చెప్పాలి. ఎవరితోనైనా డిస్కస్ చేస్తే పరువు పోతుందనే ఫీలింగ్స్‌కు తోడు సొసైటీ పర్సెప్షన్స్, ఫ్యామిలీ డిగ్నిటీ వంటి అంశాలు ఇందుకు బలం చేకూరుస్తాయి. ఓపెన్ డిబేట్‌కు నోచుకోలేని ఈ అంశం కొందరి శృంగార జీవితాన్ని నరకంగా మారుస్తుండగా.. పలువురు కేరళ మహిళలు ఈ నిషేధాలను సవాల్ చేస్తూ సరికొత్త అధ్యాయానికి తెరతీశారు. ప్రముఖ ఆడియో చాటింగ్ యాప్ ‘క్లబ్ హౌస్’లో ‘సెక్స్ డిబేట్స్’తో కొత్త ఒరవడికి నాంది పలికారు.

జూన్ 20.. ఉదయం 2 గంటల సమయం.. దేశంలోని మెజారిటీ జనాభా నిద్రపోతుండగా, కొందరు మలయాళీ మహిళలు మాత్రం‘క్లబ్ హౌస్‌’ యాప్‌లో డీప్ డిస్కషన్‌లో మునిగిపోయారు. వాయిస్ కన్వర్జేషన్స్‌ను అనుమతించే ఈ పాపులర్ సోషల్ మీడియా యాప్‌లో జరిగిన చర్చకు దాదాపు 4000 మంది హాజరయ్యారు. అంతకుముందు సోషల్ మీడియాలోనే పరిచయమైన ‘కఫీలా పర్వీన్, షహీబా వీకే, వాఫా హుస్సేన్, మహఫూసా’ అనే నలుగురు ముస్లిం మహిళల ఆధ్వర్యంలో ‘హెల్తీ సెక్స్ లైఫ్, ఉమెన్ శాటిస్‌ఫాక్షన్’ కేంద్రంగా ఈ చర్చ కొనసాగింది. స్త్రీ లైంగికత, హస్త ప్రయోగం, వివాహం, వరకట్నం, ఉన్నత విద్య వంటి అంశాలపై వారు అద్భుతంగా ప్రసంగించారు. కాగా ఉమెన్ పర్స్‌పెక్టివ్స్‌‌ను క్లబ్ హౌస్‌లో వినిపించేందుకు ఒక్కటైన మహిళలుగా తమను గుర్తించేందుకు ఇష్టపడతామని ఈ నలుగురు వెల్లడించారు. ఫలితంగా తమ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కమ్యూనిటీలో వ్యక్తమైన వ్యతిరేకతను ఎదిరించి.. స్టీరియోటైప్స్ బ్రేక్ చేసేందుకు సిద్ధమయ్యారు.

సైబర్ స్పేస్‌లో సెక్సువల్ కంటెంట్‌ రిప్రజెంటేషన్..

మలయాళీ మహిళలు తమ సెక్సువల్ నీడ్స్, లిబరేషన్ అండ్ రైట్స్ గురించి యాప్‌లో బహిరంగంగా మాట్లాడటం ప్రారంభించినప్పుడు సదరు స్క్రీన్ రికార్డింగ్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో విస్తృతంగా షేర్ చేయబడ్డాయి. ఇది మలయాళీల్లో హాట్ టాపిక్‌గా మారడంతో పాటు యాప్ యూజర్లు ‘సైబర్ స్పేస్‌లో సెక్సువల్ కంటెంట్‌ను అధికంగా రిప్రజెంట్ చేయడం’ పట్ల విమర్శలు ఎక్కువయ్యాయి. నిషిద్ధ అంశాలపై మహిళలు బహిరంగంగా మాట్లాడటాన్ని విమర్శించేందుకు అనేక గ్రూప్స్ పుట్టుకొచ్చాయి. అయితే ఇప్పటిదాకా పర్టిక్యులర్ విషయాల్లో పురుషులే ఎక్స్‌పర్ట్స్‌గా ఉంటారన్న టాపిక్స్‌పై మహిళలు క్లబ్‌హౌస్‌లో తమ వాయిస్ వినిపించినప్పుడు.. మారుతున్న పరిస్థితులను చాలామంది గ్రహించారు. ఈ మార్పు అసౌకర్యం, ఆందోళనతో పాటు కొంత గందరగోళాన్ని సృష్టించగా.. ఇది క్లబ్‌హౌస్‌లో మాత్రమే కాక ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో మాట్లాడేవారి ఇన్‌బాక్స్‌ల్లోనూ కనిపిస్తూనే ఉంటుంది.

సాంకేతికతలేని కాలంలో సమాచారం..

అభివృద్ధి క్రమంలో.. ఇప్పటిదాకా చర్చకు తావివ్వని అంశాలపై బహిరంగ చర్చకు వేదికలు పుట్టుకొస్తున్నాయి. కానీ సాంకేతికత, వైద్య సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్న కాలంలోనూ ఇలాంటి విషయాల్లో ఒకరికొకరు సాయం చేసుకునే సంస్కృతి ఉంది. వ్యవసాయ పనులు లేనప్పుడు నలుగురు మహిళలు ఒక్కదగ్గర చేరితే చర్చకు రాని టాపిక్ ఉండదంటే అతిశయోక్తి కాదు. అయితే అందరి సమక్షంలో వీటి ప్రస్తావన రాకపోయినా వరుసయ్యే వ్యక్తుల మధ్య, చనువుండే వారితో షేర్ చేసుకునేవారు. లేదంటే మాటకారులుగా ఉండే ముసలమ్మలతో చెప్పాల్సిన విషయాన్ని ఇండైరెక్ట్‌గా చెప్పించేవారు. ఇక టీనేజ్ అమ్మాయిలకు కలిగే సందేహాలు, శారీరక మార్పుల గురించి విప్పి చెప్పేందుకు అమ్మమ్మలు, బామ్మల పాత్రను విస్మరించలేం. అంతేకాదు దేవాలయాలపై శృంగార చిత్రాలు, సెక్స్ బుక్స్, నవలలు కూడా సెక్స్ ఎడ్యుకేషన్, జెనెటికల్ హెల్త్ గురించిన సమాచారాన్ని అందించేందుకు తోడ్పడ్డాయి.

మహిళలూ భయపడుతున్నారు..

సమాజంలో ఓపెన్ డిబేట్‌కు నోచుకోని విషయాలపై మాట్లాడితే కేవలం పురుషులు మాత్రమే కోపం తెచ్చుకోరు. తమ చర్చలు విన్న మహిళలు కూడా భయపడతారు. ఎందుకంటే వారి దృష్టిలో ఫిమేల్ సెక్సువాలిటీ అనేది చాలా పవిత్రమైనది. అందుకే విమర్శలు చాలా రకాలుగా ఉంటాయి. వక్తలుగా చేరినవాళ్లు కొందరు మేము మాట్లాడుతుంటే కేకలు వేస్తే, ఇంకొంత మంది కోపాన్ని వ్యక్తం చేస్తారు. ఈ క్రమంలో మారువేషంలో స్పీకర్స్‌గా చేరే పురుషుల గ్రూప్ కూడా ఉంది. వారు ‘ఫేక్ రేప్ కేసులు’, ‘మై మాస్ట్రుబేషన్, మై చాయిస్’ వంటి ప్రకటనలు చేస్తూ తరచూ ప్రొఫైల్ చిత్రాలను మారుస్తుంటారు. విపరీతంగా మెసేజెస్, కాల్స్ చేస్తుండటంతో క్లబ్‌హౌస్ నుంచి నా ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సమాచారాన్ని తొలగించాను. – కుంజిల మసిల్లమణి, ఫిల్మ్ మేకర్, ఫెమినిస్ట్

భావప్రాప్తి గురించిన సమాచారం లేదు..

ఇది చారిత్రాత్మకమైనది. నిజానికి స్త్రీ లైంగికతపై వక్రీకరించిన ఆలోచనలే కలిగి ఉన్నాం. మహిళల భావప్రాప్తి గురించి సమాచారం లేదు. మా లైంగిక ప్రశ్నలకు పరిష్కారం చూపే ప్రయత్నాలు ఎప్పుడూ జరగలేదు. లోకల్ మార్కెట్స్‌లో లభించే సాఫ్ట్ పోర్న్ బుక్స్.. సెక్స్ గురించి ఆటవిక, అనాగరిక ఆలోచనలనే ప్రతిబింబిస్తున్నాయి తప్ప, మహిళల కోరికల కోణం నుంచి ఏ విధమైన ఇన్‌ఫర్మేషన్ ఉండటం లేదు. తరతరాలుగా అమలవుతున్న జెండర్ స్టీరియోటైప్స్‌కు ఉపకరించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. – గార్గి హరితకం, రచయిత

40+ తర్వాత శృంగార కోరికలపై డిస్కషన్..

సొసైటీలో ‘సెక్స్’ అనే పదాన్ని ఉచ్చరించడం కూడా ఒకరకంగా నిషేధమే. ఈ నేపథ్యంలో దీనిపై విపులంగా చర్చించేందుకు ‘క్లబ్‌హౌస్‌’ కంఫర్టబుల్ ప్లేస్‌గా కనిపిస్తోంది. ఈ ప్లాట్‌ఫామ్‌పై నేను చాలా రకాల ప్రశ్నలు ఎదుర్కొన్నా, కొందరు బూతులు తిట్టారు. అయితే చాలా మంది మహిళలు తమ లైంగిక సమస్యల గురించి స్వేచ్ఛగా ఇక్కడ చెప్పగలమని గ్రహించారు. అంతేకాదు 40+ తర్వాత శృంగార కోరికల గురించి మాట్లాడే ఏజ్ గ్రూప్స్ కూడా నేను చూశాను. వాస్తవంగా వీరిని సెక్స్, లవ్ పట్ల ఆసక్తిలేని వర్గంగా పరిగణిస్తారు. అంటే కొత్తగా ఫెమినైనిటీస్ పెరుగుతున్న విషయం అర్థమవుతోంది. – నళిని జమీలా, యాక్టివిస్ట్ అండ్ ఫార్మర్ సెక్స్ వర్కర్

ఎడ్యుకేషనల్ ప్లాట్‌ఫామ్‌గా క్లబ్‌హౌస్..

పబ్లిక్ రంగాల్లో మహిళలు తమ గొంతును వినిపించడం చాలా కష్టమయ్యేది. ఇప్పుడు క్లబ్‌హౌస్ వంటి ప్రదేశాల్లో యువతులు తమ అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడించ గలుగుతున్నారు. ఇది సాంకేతిక పరిజ్ఞానం ద్వారానే సాధ్యమైంది. క్లబ్‌హౌస్ వంటి ప్లాట్‌ఫామ్‌ను ఒక విద్యా స్థలంగానే చూస్తాను. ఇక్కడ యువతీ యువకులు హానెస్ట్‌గా అభిప్రాయాలను షేర్ చేసుకునే అవకాశం ఉంది. గతంలో లైంగికత, డిజైర్స్ వంటి విషయాలను ఒకరు చర్చించుకునే సాహసం చేయలేదు. ప్రస్తుతం ఈ విషయాలపై అవగాహన మరింత ప్రజాస్వామ్య సంబంధాలకు దారి తీస్తుందని నేను ఆశిస్తున్నాను. ఈ సమాజంలో ఏ జెండర్‌ అయినా సెక్స్ సంబంధిత విషయాల్లో మౌనాన్ని పాటిస్తే అది తీరని సమస్యగానే మిగిలిపోతుంది. – బిందు, జెండర్ స్టడీస్ రీసెర్చర్, అంబేద్కర్ యూనివర్సిటీ, ఢిల్లీ

Next Story

Most Viewed