ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతున్న స్వచ్ఛంద సంస్థ..!

by  |
ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతున్న స్వచ్ఛంద సంస్థ..!
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : చారిత్రక ఓరుగ‌ల్లు సెంట్రల్ జైలు త‌ర‌లింపును అడ్డుకునేందుకు న్యాయ‌పోరాటానికి స‌మాయ‌త్తాలు జ‌రుగుతున్నాయి. సెంట్రల్ జైలు త‌ర‌లింపును స‌వాల్ చేస్తూ హైద‌రాబాద్ కేంద్రంగా పేద‌ల సంక్షేమం కోసం పోరాడుతున్న ఓ స్వచ్ఛంద సంస్థ హైకోర్టులో పిటిష‌న్ వేయ‌నుంద‌ని ఆ సంస్థకు చెందిన బాధ్యులు దిశ‌కు వెల్లడించారు. జైలు స్థలంలో మ‌ల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేప‌ట్టడమ‌న్నది హ‌ర్షించ‌ద‌గిన విష‌య‌మే అయిన‌ప్పటికీ… ఖైదీల సంక్షేమాన్ని ప‌ట్టించుకోకుండా జైలు త‌ర‌లింపు కార్యక్రమం చేప‌ట్టడం స‌రైన విధానం కాద‌ని త‌ప్పుబ‌ట్టారు. జైలు త‌ర‌లింపు విష‌యంలో పాటించాల్సిన క‌నీస నిబంధ‌న‌లు ప‌ట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవ‌హ‌రిస్తోంద‌ని పేర్కొన్నారు. ఈ అంశాల‌న్నింటిపై న్యాయ‌పోరాటం చేస్తామ‌న్నారు. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్స్‌ను సిద్ధం చేసుకునే ప‌నిలో ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ఉండ‌టం గ‌మ‌నార్హం.

నిబంధ‌న‌ల‌కు విరుద్ధం..!

వ‌రంగ‌ల్ సెంట్రల్ జైల్ త‌ర‌లింపు విష‌యంలో రాష్ట్ర ప్రభుత్వం నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వ్యవ‌హ‌రిస్తోంద‌ని రాష్ట్ర జైళ్ల శాఖ‌లో ఉన్నతాధికారిగా ప‌నిచేసిన పేరు చెప్పడానికి ఇష్టప‌డ‌ని అధికారి దిశ‌తో అభిప్రాయం పంచుకున్నారు. వ‌రంగ‌ల్ జైల్‌కు ఎంతో చరిత్ర ఉంద‌ని, జైలు త‌ర‌లింపును చేప‌ట్టడం నిజంగా బాధాక‌ర‌మ‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు. జైలు నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు, స‌మ‌గ్రమైన ప్లానింగ్ లేకుండానే ఖైదీల‌ను త‌ర‌లిస్తున్నార‌ని అన్నారు. వ‌రంగ‌ల్ సెంట్రల్ జైలులోని ఖైదీల‌ను చ‌ర్లప‌ల్లి, చంచ‌ల్‌గూడ జైళ్లకు ఎక్కువ‌గా త‌ర‌లిస్తున్నారు. వాస్తవానికి వాటిపైన‌ ఇప్పటికీ ఒత్తిడి ఉంది. ఈ ఖైదీల‌ను అక్కడికి త‌ర‌లించ‌డం వ‌ల‌న కొత్త స‌మ‌స్యలు, ఖైదీల‌కు, అధికారుల‌కు పాట్లు త‌ప్పవు. ఆస్పత్రి నిర్మాణానికి జైలును ఖాళీ చేయించాల్సి వ‌చ్చిన‌ప్పుడు ముందుగా సెంట్రల్ జైల్ నిర్మాణం పూర్తయ్యాక‌.. ఖైదీల‌ను అక్కడికి పంపి.. స్వాధీనం చేసుకుంటే ఇబ్బంది ఉండేది కాదు..

కానీ రాష్ట్ర ప్రభుత్వం అలా చేయ‌క‌పోవ‌డం బాధాక‌రం. ఇప్పుడు ములాఖ‌త్‌ల‌ను ఏర్పాటు చేయ‌డం కూడా ఇబ్బందిగా మారుతుంది. వ‌రంగ‌ల్ చుట్టు ప‌క్కలా ఉన్న ఖైదీల కుటుంబాలు ములాఖ‌త్‌కు చ‌ర్లప‌ల్లి, చంచ‌ల్‌గూడ‌, ఇత‌ర జిల్లాల‌కు వెళ్లి ములాఖ‌త్‌కు హాజ‌రుకావాల్సి ఉంటుంది. ఈ ప‌రిణామం అటు దూర‌భారమే కాకుండా ఆర్థికంగా భారంగా ప‌రిణ‌మిస్తుంది. దూరం స‌మ‌యాన్ని హ‌రిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మ‌రింత స‌ముచితంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంద‌ని దిశ‌తో అభిప్రాయాన్ని పంచుకున్నారు.

వేగంగా త‌ర‌లింపు ప్రక్రియ‌..

వ‌రంగ‌ల్ సెంట్రల్ జైల్ స్థలంలో మ‌ల్టీ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించాల‌ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విష‌యం తెలిసిందే. కొద్దిరోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా జైలులో ప‌ర్యటించి అనంత‌రం ప్రక‌ట‌న చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సూచ‌న‌ల మేర‌కు రాష్ట్ర జైళ్లశాఖ డీజీ రాజీవ్ త్రివేది ప‌ర్యవేక్షణ‌లో సెంట్రల్ జైలులోని ఖైదీల‌ను ద‌ఫ‌ల వారీగా రాష్ట్రంలోని వివిధ జైళ్లకు త‌ర‌లిస్తున్నారు. మొత్తం జైలులో 964మంది ఖైదీల‌కు గాను ఇప్పటికే త‌ర‌లింపు ప్రక్రియ దాదాపు పూర్తికావ‌స్తుండ‌టం గ‌మ‌నార్హం. జైలులోని వ‌స్తు సామ‌గ్రి, ఖైదీల ఉపాధి నిమిత్తం జైలులో ఏర్పాటు చేసిన వివిధ ర‌కాల వ‌స్తు ఉత్పత్తికి సంబంధించిన సామ‌గ్రిని కూడా పొరుగు జిల్లాల్లోని జైళ్లకు తాత్కాలికంగా త‌ర‌లించేందుకు ప్రణాళిక రూపొందించారు. సిబ్బందిని కూడా వారి అభిప్రాయాల‌కు అనుగుణంగా వివిధ జిల్లాల్లో పోస్టింగ్‌లు ఇచ్చేందుకు జైళ్లశాఖ ఉన్నతాధికారులు చ‌ర్యలు ఆరంభించారు.

ఓరుగ‌ల్లులో అదే చర్చ..

దాదాపు శతాబ్దన్నర చారిత్రక నేప‌థ్యం క‌లిగిన వ‌రంగ‌ల్ సెంట్రల్ జైలు త‌ర‌లింపును వ‌రంగ‌ల్ ప్రజానీకం, ముఖ్యంగా మేధావి వ‌ర్గం జీర్ణించుకోలేక‌పోతోంది. ఇప్పటికే కొన్ని వ‌ర్గాల ప్రజా స‌ముహాలు జైలు త‌ర‌లింపుపై నిర‌స‌న వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా హైద‌రాబాద్ కేంద్రంగా సేవ‌లందిస్తున్న ప్రముఖ స్వచ్ఛంద సంస్థ పిటిష‌న్ వేసేందుకు సిద్ధమ‌వుతుండ‌టంతో ఆస‌క్తిరేకెత్తుతోంది. స‌ద‌రు సంస్థ న్యాయ‌పోరాటం ఫ‌లిస్తుందా..? సెంట్రల్ జైల్ త‌ర‌లింపును అడ్డుకునేందుకు వ‌రంగ‌ల్ కేంద్రంగా మ‌రిన్ని ఉద్యమాలు పుట్టుకు వ‌స్తాయా..? అన్నది తెలియాలంటే మ‌రికొద్దిరోజులు వేచి చూడాలి


Next Story

Most Viewed