పట్టణ రూపు మార్చుతామన్న నాయకులు.. పట్టనట్టే ఉంటున్నారా..?

by  |
పట్టణ రూపు మార్చుతామన్న నాయకులు.. పట్టనట్టే ఉంటున్నారా..?
X

దిశ, పరకాల: పరకాల పట్టణాన్ని ఆదర్శ పట్టణం‌గా తీర్చిదిద్దుతా.. మన నేతల మాటలు ఆచరణలో నీరుగారి పోతున్నాయి. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శక్తివంచన లేకుండా కోట్లాది రూపాయలను ప్రభుత్వం నుంచి మంజూరు చేయించి అభివృద్ధి కోసం పాటు పడుతున్న అన్నమాటలు డొల్లతనాన్ని సూచిస్తున్నాయి. అందుకు కారణం అధికారుల నిర్లక్ష్యమా..? కౌన్సిలర్ల సమన్వయ లోపమా..? అనే ప్రశ్నలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. పట్టణ అభివృద్ధి కోసం గత మార్చి నెలలో 2021-2022 ఆర్థిక ప్రణాళికలో భాగంగా 45 కోట్ల 34 లక్షల 44 వేలతో ప్రణాళికలు రూపొందించారు. డ్రైనేజీ, సీసీ రోడ్లు, తాగునీరు, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం రూపొందించిన ఈ ప్రణాళికలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం మూలంగా కొన్ని సమస్యల పరిష్కారమే చూపించక పోగా, సీసీ రోడ్లు తదితర పనుల్లో కాంట్రాక్టర్లు ఇష్టా రీతిలో వ్యవహరిస్తూ పనుల్లో జాప్యం చేస్తున్నారు. దీంతో పట్టణ ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన దుస్థితి నెలకొంది.

పట్టణంలోని వాణి బుక్ సెంటర్ నుంచి సివిల్ ఆసుపత్రి వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనుల్లో జాప్యం మూలంగా ఆసుపత్రికి వెళ్లాల్సిన వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకొని రోగుల అత్యవసర సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. అంతేకాకుండా సౌందర్య ఆసుపత్రి నుంచి ఎంఆర్ రెడ్డి కళాశాల వరకు సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం జరగాల్సి ఉన్నప్పటికీ కౌన్సిలర్ల సమన్వయ లోపం మూలంగా ఈ పనులు ఎలాంటి పురోగతి లేకుండానే ఆగిపోయాయి. దళిత కాలనీలో ఎస్సీ, ఎస్టీకి నిధులు కేటాయించి సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మించాల్సి ఉన్నప్పటికీ ఇంతవరకు టెండర్లు నిర్వహించకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.

బస్టాండ్, అంబేద్కర్ జంక్షన్, కూరగాయల మార్కెట్ రోడ్డు తదితర ప్రాంతాల్లో తరచూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. వీటికి సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలు రూపొందించిన దాఖలాలు కనబడటం లేదు. కొంతమంది అక్రమ కబ్జాల మూలంగా నగరంలో వర్షాలు కురిసినప్పుడు పారిశుధ్య సమస్య తలెత్తి పట్టణ వాసులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఇప్పటికైనా అధికారులు మున్సిపల్ పాలకవర్గం స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధిపై సమగ్ర ప్రణాళికను రూపొందించి అమలు చేయాల్సిన అవసరం ఉందని పట్టణ వాసులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Next Story