వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలో ఆ ముగ్గురు..!

by  |
Padayatra
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో ప్రతిపక్షాలు పాదయాత్రనే అస్త్రంగా చేసుకుంటున్నాయి. పాదయాత్రల సీజన్ తొందరలోనే మొదలుకానుంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా క్యాడర్ ను సమాయత్తం చేసేలా నేతలు గ్రౌండ్ ను సిద్ధం చేసుకుంటున్నారు. అధికారంలో ఉన్నవారు పాదయాత్ర చేయడం సాధ్యం కాదు కాబట్టి విపక్షనేతలే ఎక్కువగా పాదయాత్రలు చేస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పాదయాత్రలకు విడదీయలేని అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో నేతలు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు చూస్తున్నారు.

2004 లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అధికారంలోకి రావడంలో పాదయాత్రే కీలకమైంది. 2014 లో చంద్రబాబును అధికారంలోకి రావడానికి గల కారణాల్లో ఒకటి పాదయాత్రే. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడంటే అందుకు ప్రధాన కారణం కూడా తాను చేపట్టిన సుదీర్ఘ పాదయాత్రే. అంతటి ఘనచరిత్ర పాదయాత్ర సొంతం. ఇప్పుడు ఇదే అస్త్రాన్ని తెలంగాణ నేతలు అందుకోబోతున్నారు. ఎన్నికలకు ఇంకా మూడేళ్లు మాత్రమే ఉండటంతో కీలక నేతలంతా పాదయాత్రలకు సై అంటున్నారు.

ప్రజలకు చేరవ కావడమే లక్ష్యం

సీఎం కేసీఆర్ మొదలు ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రమే కాక తెలంగాణలో కొత్తగా పార్టీ పెడుతున్న వైఎస్ షర్మిల సైతం ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే సీఎం జిల్లాలవారీగా బస్సు యాత్రలు చేపట్టాలని చూస్తుండగా.., బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జూలైలో పాదయాత్ర చేయాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు పాదయాత్ర చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు. వైఎస్ షర్మిల సైతం తన తండ్రి జయంతి రోజున జెండా, ఎజెండా ప్రకటించి నేరుగా ప్రజల్లోకి వెళ్లేలా రాష్ట్రమంతా పాదయాత్ర చేసే యోచనలో ఆలోచన చేస్తున్నారు. ఆమె చేపట్టబోయే పాదయాత్ర ఈనెల 21వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు లోటస్ పాండ్ వర్గాలు చెబుతున్నాయి.

రేవంత్ రెడ్డి.. అలంపూర్ టు ఆదిలాబాద్

ఇక కాంగ్రెస్ కొత్త సారథి అడుగులు సైతం పాదయాత్ర వైపే ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన వెంటనే పాదయాత్ర చేయాలని చూసినా అంతర్గత విభేదాల కారణంగా చేయలేకపోయారు. సహజంగానే రేవంత్ రెడ్డికి దూకుడు ఎక్కువ. ఆ దూకుడు కారణంగానే అధిష్టానం ఆయన పార్టీ పగ్గాలు అప్పగించింది. పార్టీకి పూర్వ వైభవం తెస్తాడని అధిష్టానం ప్రగాఢంగా విశ్వసించింది. గతంలో ఒకసారి రాజీవ్ రైతు భరోసా యాత్ర పేరుతో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసిన అనుభవం కూడా ఉంది. అప్పుడు రేవంత్ పాదయాత్రపై అధిష్టానికి ఫిర్యాదులు వెళ్లినా వారు లైట్ తీసుకోవడంతో రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్‌గా భావించి కొనసాగించాడు. ఇక ఇప్పుడు అధ్యక్షుడిగా పగ్గాలు తనదగ్గరే ఉండటంతో పార్టీ సమష్టి నిర్ణయం పేరుతో ఎలాంటి అడ్డంకులు లేకుండా అలంపూర్ టు ఆదిలాబాద్ వరకు పాదయాత్ర చేసే అవకాశముంది. అయితే ఎప్పుడు యాత్ర ఉంటుందనే విషయమై ప్రస్తుతానికి స్పష్టత లేకపోయినా పాదయాత్ర మాత్రం కచ్చితంగా ఉంటుందని రేవంత్ రెడ్డి చెబుతున్నారు.

ఈనెల 21 నుంచి వైఎస్ షర్మిల?

తెలంగాణలో వైఎస్ షర్మిల తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుతోనే వైఎస్సార్ టీపీగా జూలై 8వ తేదీన పార్టీని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ ఆవిర్భావం అనంతరం ఇక ప్రత్యక్ష కార్యాచరణలో దిగే విధంగా జూలై 21వ తేదీ నుంచి పాదయాత్రకు షర్మిల సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. వైఎస్సార్ పాదయాత్ర చేసిన చేవేళ్ల నియోజకవర్గం నుంచే తన తొలి అడుగు వేయాలని, రాష్ట్రంలో ప్రతి మండలాన్ని మేజర్ గ్రామపంచాయతీలను టచ్ చేసే విధంగా ప్రతి గడపకు వెళ్లేలా రూట్ మ్యాప్ సైతం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. పాదయాత్ర చేస్తూనే జిల్లాల వారీగా కార్యకర్తలకు తమ పార్టీ జెండా కప్పే విధంగా కేడర్ ను సైతం బలోపేతం చేసే విధంగా తొలివిడుత పాదయాత్ర చేయాలని వైఎస్ షర్మిల ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

ఈ నెల చివరికల్లా ‘బండి’ యాత్ర!

రాష్ట్రవ్యాప్తంగా ఇక పాదయాత్రల సీజన్ ప్రారంభమైయ్యే అవకాశాలు దగ్గర్లోనే ఉన్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా క్షేత్రంలోకి వెళ్లాలని చూస్తున్నారు. ఇప్పటికే జులై 1 నుంచి 8 వరకు బస్సు యాత్ర చేపట్టి జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేయాలని చూస్తున్న బండి సంజయ్, బస్సు యాత్ర ముగిసిన అనంతరం హుజురాబాద్ ఉపఎన్నికకు పార్టీ కేడర్ లో ఉత్సాహం నింపేలా హైదరాబాద్ టు హుజురాబాద్ వరకు పాదయాత్ర సాగేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. జూలై చివరి వారంలో పాదయాత్ర ప్రారంభించాలని, బీజేపీ ముఖ్యనేతలతో బండి సంజయ్ సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. బస్సు యాత్రకు ప్రజల నుంచి వచ్చే స్పందన ను బట్టి పాదయాత్ర ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పరిశీలనలో భాగంగా ఇప్పటికే సీఎం కేసీఆర్ సిద్ధిపేట, వరంగల్, కామారెడ్డి, భువనగిరి జిల్లాల్లో పర్యటించి సమీకృత కలెక్టర్ కార్యాలయాలను ప్రారంభించారు. అంతేకాకుండా పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేశారు. ఇక ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న జిల్లాల్లో తన పర్యటనలు కొనసాగిస్తూనే, పోడు భూముల సమస్యలు ఉన్నఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో పర్యటించి వాటిని పరిష్కరించేలా సీఎం రంగంలోకి దిగనున్నారు. మాజీ మంత్రి ఈటల విమర్శల ఫలితమో, లేక హుజురాబాద్ ఉపఎన్నికల వ్యూహమో తెలియదు కానీ ఎప్పుడు ప్రగతి భవన్, ఫాం హౌస్ కే పరిమితమయ్యే సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనలతో జనంలోకి వస్తున్నారు.



Next Story

Most Viewed