ఇక డీసీసీపై నేతల కన్ను.. అప్పుడే మంతనాలు మొదలెట్టిన ఆశావహులు

by  |
ఇక డీసీసీపై నేతల కన్ను.. అప్పుడే మంతనాలు మొదలెట్టిన ఆశావహులు
X

దిశ, భద్రాచలం : టీపీసీసీ అధ్యక్షునిగా రేవంత్‌రెడ్డి నియామకంతో కొత్త కమిటీ ఏర్పాటైంది. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం డీసీసీ అధ్యక్షునిగా కొనసాగుతున్న భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యకి టీపీసీసీ కమిటీలో సీనియర్ ఉపాధ్యక్ష పదవి దక్కింది. జంట పదవుల విధానం ఇపుడు కాంగ్రెస్‌లో లేదు. ఈ నేపథ్యంలో డీసీసీ పదవి నుంచి పొదెం వీరయ్య తప్పుకోక తప్పదు. ఈ నేపథ్యంలో డీసీసీపై పలువురు నేతల కన్ను పడింది. టీపీసీసీ కమిటీ ఏర్పాటు‌లో రేవంత్‌రెడ్డి సపోర్టర్స్‌కి ఎక్కువ పదవులు లభించాయి.
అదే క్రమంలో రాష్ట్రంలో డీసీసీ, మండల కమిటీల ఏర్పాటులో రేవంత్‌రెడ్డి మార్క్ కనిపించేలా మార్పులు జరగుతాయని అందరు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం గతంలో ప్రయత్నాలు చేసిన వారంతా తిరిగి మళ్ళీ ప్రయత్నాలు పునఃప్రారంభించే చాన్స్ ఉంది. జూలై 7న రేవంత్‌రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.

అనతికాలంలోనే కమిటీల్లో మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదు అసెంబ్లీ స్థానాలకు నాలుగు స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ తరపున గెలిచిన పినపాక, కొత్తగూడెం, ఇల్లందు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కి గుడ్ బై చెప్పి కారు ఎక్కారు. ప్రజాప్రతినిథులు పార్టీ మారినా పెద్దగా క్యాడర్ వారి వెంట వెళ్ళలేదు. కనుక జిల్లాలో కాంగ్రెస్ బలం చెక్కుచెదరలేదనేది పార్టీ శ్రేణుల అభిప్రాయం. రేవంత్‌రెడ్డికి పీసీసీ పీఠం దక్కడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని, కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వారిలో కొందరు వెనక్కి తిరిగివచ్చే అవకాశాలు ఉన్నాయని, టిడిపి, టీఆర్ఎస్ అసమ్మతి నేతలు కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయమని భావిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే అంచనాలతో వచ్చే ఎన్నికలను ఎదుర్కొనేందుకు ధీటైన కొత్త కమిటీలను నియమించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆశావహులు డీసీసీ కోసం ముందుచూపుతో ప్రయత్నాలు ప్రారంభించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీలో సరికొత్త సమీకరణాలు చోటుచేసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. జిల్లా కాంగ్రెస్‌లో ఇప్పుడు కాబోయే డీసీసీ అధ్యక్షుడు ఎవరనేది ప్రధాన చర్చనీయాంశమైంది.



Next Story