సన్‌బర్న్ కార్యక్రమంలో శివుడి ఫోటో.. నిర్వాహకులపై ఫిర్యాదు

by Dishanational1 |
సన్‌బర్న్ కార్యక్రమంలో శివుడి ఫోటో.. నిర్వాహకులపై ఫిర్యాదు
X

పనాజి: గోవాలో నిర్వహించిన సన్‌బర్న్ కార్యక్రమంలో డిజిటల్ స్క్రీన్‌పై శివుడి ఫోటో ప్రదర్శించడం వివాదం రేపుతోంది. దీనిపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై కార్యక్రమ నిర్వహాకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే, డిసెంబర్ 28న మొదలైన సన్‌బర్న్ ఎలక్ట్రానిక్ డీజే షో శనివారం ముగిసింది. ఇందులో భాగంగా డిజిటల్ స్క్రీన్‌పై శివుడి ఫోటోను ప్రదర్శించారు. ఈ ఘటనను కాంగ్రెస్ నేత విజయ్ బైకె తీవ్రంగా వ్యతిరేకించారు. గోవాలోని మాపూసా పీఎస్‌లో ఫిర్యాదు చేస్తూ, కార్యక్రమ నిర్వాహకులపై మండిపడ్డారు. ఇదే ఘటనపై స్పందించిన గోవా ఆప్ అధ్యక్షుడు అమిత్ పాలెకర్, సనాతన ధర్మాన్ని కార్యక్రమ నిర్వాహకులు అవమానించారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్దేశపూర్వకంగానే షో నిర్వాహకులు తాగుతూ, డ్యాన్స్ చేస్తున్న సమయంలో శివుడి ఫోటోను స్రీన్‌పై ప్రదర్శించారని విజయ్ బైకె అన్నారు. ఇలాంటి చర్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని, దీనిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ను కోరినట్టు ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ నుంచి ఫిర్యాదు అందిందని, దాన్ని పరిశీలిస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.



Next Story

Most Viewed