ఏడు నెలలుగా అన్నీ బంద్..

by  |

దిశ, తెలంగాణ బ్యూరో : కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తున్నాం.. ఈ క్రమంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. రానున్న కొత్త రెవెన్యూ చట్టం ప్రకారమే అన్నీ పరిష్కరించాలి. అప్పటి వరకు ఎలాంటి భూ సంబంధ అంశాలపై ఆర్డర్లు జారీ చేయొద్దు.. అంటూ గతేడాది సెప్టెంబరు 7న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, భూ పరిపాలన ప్రధాన కార్యదర్శి సీసీఎల్ఏ రెఫరెన్స్ నం.ఏఎస్ఎస్.1(1)/463/2020, తేదీ.7.9.2020 ఆదేశించారు. దీని ప్రకారం మళ్లీ ఆదేశాలు జారీ చేసే వరకు ల్యాండ్ మ్యాటర్స్ ముట్టుకోవద్దు. ఒకవేళ ఏదైనా ఆర్డర్ జారీ చేసినా చెల్లదు.

ఈ ఆదేశాలను రెవెన్యూ శాఖలోని అధికారులందరికీ వర్తింపజేయాలని కలెక్టర్లకు సూచించారు. ఏదైనా ఈ ఉత్తర్వును ఉల్లంఘిస్తే సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనదంటూ చీఫ్ సెక్రటరీ, సీసీఎల్ఏ(ఎఫ్ఏసీ) సోమేష్ కుమార్ పేర్కొన్నారు. ఏడు నెలలైంది. జారీ చేసిన ఉత్తర్వులను ఇప్పటి వరకు పున:సమీక్షించలేదు. దీని పర్యావసనం వేలాది మందిని ఇక్కట్లకు గురి చేస్తోంది. అప్పటి నుంచి ఆర్వోఆర్ మినహా అన్ని సమస్యలు పెండింగులో పడ్డాయి. ఆర్డీఓలు, జాయింట్ కలెక్టర్లు(ప్రస్తుత అదనపు కలెక్టర్లు) చేయదగ్గ, పరిష్కరించాల్సిన కేసులన్నీ మూలకు వేశారు.

ఏడు నెలలుగా ఒక్క సమస్యా పరిష్కరించలేదు. కనీసం ఆ ఫైలు ముట్టుకోవడం లేదు. దీంతో వేలాది మంది తమ దరఖాస్తులను పరిష్కరించాలని అధికారులకు మొర పెట్టుకుంటున్నారు. ఎన్నో ఏండ్లుగా మా సమస్యను అపరిష్కృతంగా ఉంచారు. ఇకనైనా న్యాయం చేయండంటూ వేడుకుంటున్నారు. ఐనా అధికారుల చేతిలో ఏమీ లేకపోవడంతో ఉత్తర్వుల గురించి చెప్పి పంపిస్తున్నారు. ప్రతి రోజూ పదుల సంఖ్యలో కార్యాలయానికి వచ్చి పదేపదే గోడు వెళ్లబోసుకోవడం, తామేం చేయలేమని చెప్పలేక ఆర్డీఓలు, అదనపు కలెక్టర్లు సతమతమవుతున్నారు.

ఇంకొందరు అసహనానికి గురవుతున్నారు. తమ సమస్యల గురించి ఉన్నతాధికారులకు ఎందుకు లేఖలు రాయరంటూ అధికారులను కొందరు దరఖాస్తుదారులు నిలదీస్తున్నారు. ఐతే అనవసరంగా లేఖలు రాసి, సిఫారసు చేసి, నివేదికలు పంపే కార్యక్రమాలకు పూనుకుంటే ఉన్నతాధికారులు తీసుకునే క్రమశిక్షణా చర్యలకు బలి కావాల్సి వస్తుందని భయపడుతున్నారు. డిసెంబరు 31న సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్‌పై సమీక్షించారు. ఈ సందర్భంగా 60 రోజుల్లో సమస్యలన్నీ పరిష్కరించాలని సూచించారు. అందులో ఇనాం, టెనెన్సీ, జాగీర్​భూములపై ఓఆర్సీలు జారీ చేసే ప్రక్రియను ప్రస్తావించారు. 60 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశించినా వీటిపై ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలాగే కొనసాగితే భూ వివాదాలు క్షేత్ర స్థాయిలో జటిలమవుతాయని దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధం లేని సర్క్యులర్

కొత్త రెవెన్యూ చట్టం అమలు చేస్తున్నామనే నెపంతో ఈ సర్క్యులర్ జారీ చేశారు. చట్టం అమలుకు లోపే అధికారులు అవినీతి, అక్రమాలకు పాల్పడి దరఖాస్తుదారులను పరిశీలించకుండానే ఏకపక్షంగా ఆర్డర్లు జారీ చేస్తారని ప్రభుత్వం భావించింది. అందుకే చట్టం వచ్చేంత వరకు అన్నింటినీ ఆపేయాలని ఆదేశించారు. కానీ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది కొత్త రెవెన్యూ చట్టం కాదు. కేవలం కొత్త ఆర్వోఆర్ చట్టం మాత్రమే. దాన్ని ‘తెలంగాణ భూముల హక్కులు, పట్టాదారు పాసు పుస్తకాల చట్టం 2020’ అమల్లోకి తీసుకొచ్చింది. ఆర్డీఓలు, అదనపు కలెక్టర్ల పరిధిలోని అంశాలకు, ఈ చట్టానికి ఎలాంటి సంబంధం లేదు. దాంతో వివాదాలన్నీ సుడిగుండంలో భూ హక్కులు చిక్కుకున్నాయి. పరిష్కార మార్గాలకు రెవెన్యూ యంత్రాంగం వెసులుబాటు కల్పించడం లేదు. సత్వర న్యాయం దొరికే అవకాశాలు దూరమయ్యాయి. తహశీల్దార్లు, ఆర్డీఓలు, జాయింట్ కలెక్టర్ల ద్వారా పొందే న్యాయ ప్రక్రియ రద్దయ్యింది. దాంతో ఇనాం, జాగీర్, పీఓటీ, టెనెన్సీ వంటి కేసుల్లో నిరభ్యంతర దృవీకరణ పత్రాలు, ఓఆర్సీలు ఇచ్చే ప్రక్రియకు బ్రేకులు వేశారు. అంతకు ముందు ఓ కొలిక్కి వచ్చిన కేసులన్నీ మళ్లీ మొదటికొచ్చాయి. ఇంకొన్ని కోర్టు ఆదేశాలను అమలు చేసే దశలో ఉన్నాయి. అవి కూడా కొత్త ఆర్వోఆర్ చట్టం పేరిట పెండింగులో పెట్టారు. ఏడు నెలలుగా ఒక్క ఫైలుకు మోక్షం లభించలేదు. వీటిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా జాప్యం చేస్తోంది.

కేసులెవరు చూడాలి?

గతంలో ఆర్డీఓలు, అదనపు కలెక్టర్లు పరిష్కరించాల్సిన అంశాలపై ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. ఏడు నెలల క్రితం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయడం లేదు. దాన్ని ఉల్లంఘించి ఏ అధికారైనా నిర్ణయం తీసుకున్నా, ఆర్డర్లు చేసినా చెల్లవని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇంకెన్నాళ్లు దరఖాస్తుదారులు ఆగాలో అర్ధం కావడం లేదు. అధికారులు తామేం చేయాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. కనీసం వీటిని తాము పరిష్కరించం.. కోర్టులోనే తేల్చుకోవాలని చెప్పినా ఎవరి దారి వాళ్లు చూసుకునే వారని ఓ రిటైర్డ్ పోలీసు ఉన్నతాధికాధికారి(దరఖాస్తుదారుడు) అభిప్రాయపడ్డారు. వాళ్లు తేల్చరు. క్లారిటీ ఇవ్వరు. దీని వల్ల సమస్య ఎంత క్లిష్టంగా మారుతుందో గుర్తించడం లేదని వాపోయారు. సర్క్యులర్ జారీ చేసిన అధికారులకు మళ్లీ సమీక్షించాల్సిన అవసరాన్ని గుర్తించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ విషయంపై లేఖలు రాసినా, అర్జీలు పెట్టుకున్నా, ట్విట్టర్ లో ఉన్నతాధికారులకు వివరించినా పట్టించుకోవడం లేదన్నారు. కోర్టు డైరెక్షన్లు అమలు చేసేందుకు కూడా ప్రభుత్వ ఉత్తర్వులు అడ్డంకిగా మారాయి. ఎవరైనా కోర్టు డిగ్రీలను చూడమని అడిగినా అధికారులు మాత్రం మౌనం వహిస్తున్నారు. కోర్టు ఉత్తర్వులను అమలు చేయడం లేదంటూ తమపైనే కేసులు వేయండంటూ సూచిస్తుండడం గమనార్హం. అలాగైనా అమల్లో ఉన్న సర్క్యులర్ ను రద్దు చేస్తారని కొందరు ఆర్డీఓలు వ్యాఖ్యానిస్తున్నారు.

చిన్న పనులకే పరిమితం

పెద్ద పెద్ద భూ సమస్యలు పరిష్కరించిన ఆర్డీఓలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ప్రస్తుతం చిన్న చిన్న పనులకే పరిమితమయ్యారు. ప్రస్తుతం కల్యాణలక్ష్మీ, షాదీముబారక్.. ఇతర సర్టిఫికేట్లు జారీ చేయడానికే పరిమితమయ్యారు. కలెక్టర్ల నుంచి వచ్చే ఆదేశాలతో విచారణ చేయడం, రిపోర్టులు పంపడం వంటివి చేస్తున్నారు. తీరిక లేకుండా గడిపిన రెవెన్యూ అధికారులకు హోదాకు తగ్గ పనుల్లేక ఇబ్బంది పడుతున్నారు. జటిలమైన టెనెన్సీ, ఇనాం, జాగీర్, పీఓటీ వంటి సమస్యలను పరిష్కరించే అధికారులకు పని లేకుండా చేసిన ఆ సర్క్యులర్‌పై ఇకనైనా సమీక్షించి తదుపరి ఉత్తర్వులను జారీ చేయాలని అధికారులు, దరఖాస్తుదారులు కోరుతున్నారు.

రెవెన్యూ డివిజన్లతో ఏం లాభం?

ఆర్డీఓలకు రెవెన్యూ పాలనలో పాత్రను తగ్గించేశారు. తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 2018 నుంచి కొత్తగా ఆరు రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేశారు. వాటి ద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనం ఏముందని ఓ ఆర్డీఓ ప్రశ్నించారు. ఇప్పుడేమో రెవెన్యూ కోర్టులే రద్దయిన నేపధ్యంలో చేసే పనులు సంక్షేమ పథకాలు అమలు తీరుతెన్నులను పర్యవేక్షించడం మినహా మరొకటి కనిపించడం లేదన్నారు. ఏడు నెలలుగా సరైన పని లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నెన్నో కేసులు..

– రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్ పేటలో సర్వే నం.45, 46 ల్లోని ఇనాం భూమిపై కోర్టు తీర్పునిచ్చింది. దాన్ని అమలు చేయాలని దరఖాస్తుదారులు మూడేండ్లుగా ఆర్డీఓ చుట్టూ తిరుగుతున్నారు. ఇక రేపో మాపో అమలు చేస్తారని భావించిన దరఖాస్తుదారులకు ఈ సర్క్యులర్ ద్వారా కథ మళ్లీ మొదటికొచ్చింది.
– నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఓ రిటైర్డ్ పోలీసు ఉన్నతాధికారి భూమిని ప్రభుత్వం సేకరించింది. ఆ భూమికి ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం పొందేందుకు ఇనాం ఓఆర్సీ అవసరం. దరఖాస్తు చేసుకొని ఏండ్లు గడుస్తోంది. కానీ అధికారులు పెండింగుతోనే కాలం వెళ్లదీశారు. తీరా మోక్షం లభిస్తుందనుకున్న క్రమంలో ఏ ఆర్డర్లు ఇవ్వొద్దన్న చీఫ్ సెక్రటరీ ఆదేశాలు బ్రేకులు వేశాయి.
– ఇలా ఒకటీ రెండు కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ డివిజనల్ పరిధిలో ఉన్నాయి. ఎప్పుడెప్పుడు మళ్లీ వాదనలు విని పరిష్కరిస్తారోనని ఎదురుచూస్తున్నారు.


Next Story

Most Viewed