సర్కారుకు భారీ హెచ్చరిక.. త్వరలోనే..

by  |
సర్కారుకు భారీ హెచ్చరిక.. త్వరలోనే..
X

దిశ ప్రతినిధి, ఖ‌మ్మం : ఉమ్మడి ఖ‌మ్మం జిల్లాలో ఏళ్లుగా పోడు యుద్ధం కొన‌సాగుతూనే ఉంది. పోడును ఆప‌డానికి అధికారులు.. సాగు చేయ‌డానికి గిరిజ‌న‌, ఆదివాసీ, గొత్తికోయ‌లు ప్రయ‌త్నిస్తునే ఉన్నారు. దీంతో ఏటా భ‌ద్రాద్రి, కొత్తగూడెం రెవెన్యూ డివిజ‌న్లలోని పోడు భూముల్లో ఘ‌ర్షణ‌లు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా ములకలపల్లికి చెందిన 130 మంది ఆదివాసీ రైతులు పోడు భూముల్లో సాగును అడ్డుకుంటున్న అట‌వీ అధికారుల‌పై దాడుల‌కు దిగారు. సుమారు 300 ఎకరాల భూమికి సంబంధించి గ‌త కొన్నాళ్లుగా వివాదం న‌డుస్తూనే ఉంది. కొత్తగా పోడు చేస్తున్నట్లుగా గుర్తించిన అధికారులు సాగును అడ్డుకుని హ‌రిత‌హారం మొక్కల‌ను నాటేందుకు య‌త్నించారు. ఈ క్రమంలో ఘ‌ర్షణ చోటు చేసుకుంది. అటవీ అధికారులు విధులకు ఆటంకం కలిగించార‌ని పేర్కొంటూ కొంత మందిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఇలాంటి సంఘ‌ట‌న‌లు భ‌ద్రాద్రి జిల్లాలో నిత్యకృత్యంగా మారాయి. రోజూ ఏదో చోట అట‌వీ అధికారుల‌కు ఆదివాసీ, గిరిజ‌నుల‌కు మ‌ధ్య జ‌గ‌డం జ‌రుగుతూనే ఉంది. స‌మ‌స్యను ప‌రిష్కరించాల్సిన ప్రభుత్వం హామీలిచ్చి ప‌ట్టించుకోవ‌డం లేద‌ని బాధితులు విమ‌ర్శిస్తున్నారు.

ఉమ్మడి జిల్లా పోడు లెక్కలు..

2005 ముందు నుంచి పోడు చేసుకుంటున్న గిరిజ‌నుల‌కు హ‌క్కు ప‌త్రాల‌ను అంద‌జేయాల‌ని అప్పటి వైఎస్సార్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించ‌డంతో రెవెన్యూ, అట‌వీశాఖ అధికారులు సంయుక్తంగా స‌ర్వే నిర్వహించారు. అర్హులైన‌ పోడు సాగుదారుల‌ను గుర్తించి వారికి ప‌ట్టాలిచ్చారు. అధికారులు వెల్లడించిన దాని ప్రకారం.. భ‌ద్రాచ‌లం కొత్తగూడెం జిల్లాలో 2008 నుంచి ఇప్పటి వ‌ర‌కు పోడు భూముల‌కు సంబంధించిన పట్టాలు జారీ ఈ విధంగా ఉన్నాయి. 2008 నుంచి ఇప్పటి వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారు 49,305 మంది గిరిజ‌న రైతులు 2,03,311 ఎక‌రాల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. అయితే 22,530 మంది రైతుల‌కు 81,161 ఎక‌రాల‌ను పంపిణీ చేశారు. 1,04,951 ఎక‌రాల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న 21952 మంది విన్నపాల‌ను తిర‌స్కరించింది. 17,198 ఎక‌రాల‌కు సంబంధించిన 4815 మంది రైతుల ద‌ర‌ఖాస్తుల‌ను ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచింది.

ఇందులో భ‌ద్రాచ‌లం రెవెన్యూ డివిజ‌న్ ప‌రిధిలోని 7 మండ‌లాల‌కు చెందిన‌ 4764 మంది రైతుల‌కు 14075 ఎక‌రాల‌కు హ‌క్కు ప‌త్రాల‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. కొత్తగూడెం రెవెన్యూ డివిజ‌న్ ప‌రిధిలో 67,785 ఎక‌రాలపై 17774 మంది పోడు రైతుల‌కు హ‌క్కులు క‌ల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఖ‌మ్మం జిల్లాలో 35,766 ఎక‌రాల‌కు సంబంధించి 13,276 మంది రైతులు ద‌ర‌ఖాస్తు చేసుకోగా 17,773 ఎక‌రాల‌పై 6109 మందికి హ‌క్కు ప‌త్రాలను అంద‌జేసింది. 17,820 ఎక‌రాల‌కు సంబంధించి 7131మంది ద‌ర‌ఖాస్తుల‌ను తిర‌స్కరించింది. 176 ఎక‌రాల‌కు సంబంధించి 16 మంది ద‌ర‌ఖాస్తుల‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్ పెట్టారు.

ప్రభుత్వం నిర్లక్ష్య ధోర‌ణి..

ఎన్నిక‌ల‌కు ముందు సీఎం కేసీఆర్ పోడు భూముల స‌మ‌స్యను ప‌రిష్కరించి అర్హులైన వారంద‌రికీ ప‌ట్టాలు అంద‌జేస్తామని హామీ ఇచ్చారు. ఇదే విష‌యాన్ని ఆదివాసీ, గిరిజ‌నులు గుర్తు చేస్తున్నారు. ప‌ట్టాలు ఇవ్వక‌పోగా హ‌రిత‌హారం పేరుతో ప్రభుత్వం త‌మ‌పై అట‌వీశాఖ అధికారుల‌ను ఉసిగొల్పుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప్రభుత్వ పరంగా పోడు భూములపై స్పష్టమైన విధాన పరమైన నిర్ణయం వెలువడినప్పుడే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. పోడు రైతుల‌పై ప్రభుత్వం మొస‌లి క‌న్నీరు కార్చడం ఆపి వెంట‌నే ప‌ట్టాల‌ను మంజూరు చేయాల‌ని విప‌క్షాలు, ఆదివాసీ, గిరిజ‌న సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం త‌మ‌కు అన్యాయం చేయాల‌ని చూస్తోంద‌ని, త్వర‌లోనే ఆదివాసీ, లంబాడ సంఘాల ఆధ్వర్యంలో పోడు భూముల ప‌రిర‌క్షణ‌కు ఉద్యమిస్తామ‌ని ఆయా సంఘాల నాయ‌కులు హెచ్చరిస్తున్నారు.

Next Story