సచివాలయ పనులకు లేబర్ దొరుకతలేరంట

by  |
సచివాలయ పనులకు లేబర్ దొరుకతలేరంట
X

దిశ, న్యూస్ బ్యూరో: కొత్త సచివాలయ నిర్మాణానికి కార్మికుల అంశంలో ప్రభుత్వానికి చిక్కులు ఎదురుకానున్నాయి. డిజైన్ ఖరారైనందున నిర్మాణానికి ఎంత మంది కూలీలు అవసరమవుతారు, ఎక్కడి నుంచి సమకూర్చుకోవాలి, వారికి జారీ చేయాల్సిన గుర్తింపు కార్డులు తదితర అంశాలు రోడ్లు భవనాల శాఖకు సవాలుగా మారాయి. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా కార్మికుల మధ్య సోషల్ డిస్టెన్స్ పాటించడం నిర్మాణం చేసే క్రమంలో కత్తిమీద సాములాంటిదేనని, ప్లానింగ్ కోసం తగిన సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుందని ఆ శాఖాధికారి అభిప్రాయపడ్డారు. ఒకేచోట ఎక్కువమంది పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి కొవిడ్​ నిబంధనలు తీసుకుంటామన్నారు. కేవలం సోషల్ డిస్టెన్స్ నిబంధనకే పరిమితం కాకుండా కార్మికుల పూర్తి రక్షణ బాధ్యతలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మాగ్జిమమ్​ యంత్రాలు వాడుతూ కార్మికుల అవసరాన్ని తగ్గించుకునేందుకే ప్రాధాన్యమిచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు.

రెండు మూడు రోజుల్లో టెండర్ నోటిపికేషన్?

సచివాలయం నిర్మాణానికి సంబంధించి రెండు మూడు రోజుల్లోనే టెండర్లను ఆహ్వానించే నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు రోడ్లు భవనాల శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే వ్యయ అంచనాలకు సంబంధించిన నోట్‌ను సీఎంకు అందించగా కొన్ని మార్పులు సూచించినట్లు తెలిసింది. సవరణల అనంతరం నోటిఫికేషన్ వస్తుందని ఆయన చెప్పారు. సచివాలయం నిర్మాణానికి, ఇంటీరియర్ డిజైన్‌కు వేర్వేరు టెండర్లు ఉండనున్నాయి. ప్రధాన భవనం నిర్మాణం ఒక స్థాయికి చేరుకున్న తర్వాత ఇంటీరియర్ పనులు కూడా ప్రారంభమవుతాయని, వచ్చే ఏడాది జూన్ 2న ఆవిర్భావ దినోత్సవం నాటికి అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు.

నెలాఖరులో సీఎం సందర్శన..

ప్రస్తుతం సచివాలయ ప్రాంగణంలోని భవనాలన్నింటినీ కూల్చివేసినందున చదునుచేసే ప్రక్రియ కొలిక్కి వచ్చింది. వారం రోజుల్లో అదీ పూర్తయిన తర్వాత సీఎం ఆ ప్రాంతాన్ని సందర్శిస్తారని సమాచారం. సెప్టెంబరు 1వ తేదీ తర్వాత పితృపక్షం వస్తున్నందున అప్పటి వరకు కొత్త సచివాలయం పనులు లాంఛనంగా ప్రారంభమయ్యేలా ఆలోచిస్తున్నట్లు తెలిసింది. గతేడాది జూన్‌లో సీఎం స్వయంగా శంకుస్థాపన చేసినందువల్ల మళ్లీ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం వంటి కార్యక్రమాన్ని ఇప్పటివరకు ప్లాన్ చేయలేదని, అవసరమైతే అది కూడా ఉండొచ్చనేది సమాచారం.

Next Story