ప్రధాని మోదీ, సీఎం జగన్‌లకు కేవీపీ లేఖలు

by  |
ప్రధాని మోదీ, సీఎం జగన్‌లకు కేవీపీ లేఖలు
X

ప్రధాని నరేంద్ర మోదీ, వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ సీనియర్ నేత, కేవీపీ రామచంద్రరావు లేఖలు రాశారు. ఈ లేఖల్లో ఆంధ్రప్రదేశ్‌కు చేకూరాల్సిన ప్రయోజనాలపై ప్రస్తావించారు. ప్రధానికి రాసిన లేఖలో ఏపీకి ప్రత్యేకహోదా కల్పించాలని, పారిశ్రామిక పన్నురాయతీలు కల్పించాలని కోరారు. రాష్ట్రానికి బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీని ఇవ్వాలని డిమాండ్ చేశారు.

తిరుమల వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన సూచించారు. ఏపీకి న్యాయం చేస్తానని చెప్పి మోదీ అధికారంలోకి వచ్చారని ఆయన గుర్తుచేశారు. గత ఆరేళ్లుగా కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఇస్తున్న 60 శాతం నిధులకు మరో 30 శాతం కలిపి లెక్కగట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని ఆయన లేఖలో డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాలకు సమానంగా ఏపీ నిలిచే వరకు రాష్ట్రానికి సాయమందించాలని ఆయన సూచించారు.

జగన్‌కు రాసిన లేఖలో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలు అమలయ్యేలా చూడాలని సూచించారు. రాజ్యాంగపరంగా ఏపీకి రావాల్సిన నిధులు రావడం లేదని, అందుకు కృషి చెయ్యాలని సూచించారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేవలం కాంట్రాక్టర్ల కోసం ఢిల్లీకి వచ్చేవారన్న కేవీపీ, దుగరాజపట్నం, పెట్రోకెమికల్ ప్రాజెక్టు, బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఎందుకివ్వడం లేదంటూ అందుకోసం ఒత్తిడి చేయాలని సూచించారు.

ఏపీకి ప్రస్తుతం కేటాయించిన రైల్వే జోన్ వల్ల వచ్చిన ప్రయోజనమేమీ లేదన్న ఆయన, రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన 27,571 కోట్ల రూపాయలు వసూలు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని అభిప్రాయపడ్డారు. పోలవరం నిర్మాణ బాధ్యతలు పూర్తిగా కేంద్రానికే అప్పగించాలని ఆయన సూచించారు.

tags:kvp ramachandra rao, kvp, congress, ysrcp, pm modi, cm jagan, letters

Next Story