నాలుగు రోజులుగా జలదిగ్బంధంలో ఆ గ్రామం.. డ్రోన్‌ల‌తో సాయం

85

దిశ, పిట్లం: భారీ వర్షాలు, వరదలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ ఇదే తంతు కొనసాగుతోంది. దీనికితోడు గత నాలుగు రోజులుగా నిజాంసాగర్ గేట్ల ఎత్తివేతతో ముంపు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిజాంసాగర్ నుంచి వచ్చిన వరద ఉధృతికి కుర్తి గ్రామం జలదిగ్బంధం అయింది. గత నాలుగు రోజులుగా రాకపోకలు నిలిచిపోవడంతో గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు.

ఇదే సమయంలో గ్రామంలోని ఓ బాలుడికి తీవ్రంగా కడుపు నొప్పి, మూత్ర విసర్జన కాకపోవడంతో సర్పంచ్ మహేందర్ రెడ్డి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అధికారులు అప్రమత్తమై డ్రోన్ సాయంతో సదరు బాలుడికి టాబ్లెట్లు అందజేయడంతో.. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇతర సమస్యలపై సమాచారం అందిస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని అధికారులు సర్పంచ్, గ్రామ ప్రజలకు భరోసా ఇచ్చారు. స్థానిక ఎంపీపీ కవిత భర్త విజయ్, వైస్ ఎంపీపీ లక్ష్మారెడ్డి, రాంపూర్ సర్పంచ్ నారాయణ రెడ్డి, మండల స్థాయి అధికారులు తహసీల్దార్ రామ్మోహన్‌ రావు, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఎస్ఐ రంజిత్ కుమార్‌లు.. నిజాం సాగర్ నుంచి వస్తున్న వరద హెచ్చుతగ్గులను పరిశీలిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మార్గంలో హై లెవెల్ బ్రిడ్జిను నిర్మిస్తే ఈ కష్టాలు ఉండవని.. త్వరగా నిర్మించాలని ప్రజలు వేడుకుంటున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..