డ్రగ్స్ కేసు: నా రక్తం, వెంట్రుకలు ఇస్తా.. KTR సంచలన ప్రకటన

by  |
KTR twitter
X

దిశ, తెలంగాణ బ్యూరో : “రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధమూ లేదు. నేను ఎలాంటి పరీక్షలకైనా సిద్దం. అవసరమైతే నా రక్తం, వెంట్రుకలను కూడా ఇస్తాను. ఏ పరీక్షలు కావాలంటే అవి చేసుకోవచ్చు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా నాలాగనే శాంపిల్స్ ఇస్తారా?” అని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. “నాకు డ్రగ్స్ తో సంబంధం ఉన్నట్లు ఈడీకి ఎవరో ఏదో ఫిర్యాదు చేస్తే నాకేం సంబంధం? ఈడీకి లెటర్ ఇచ్చినవాడు ఒక బఫూన్” అని వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్‌లో శనివారం మధ్యాహ్నం మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా కేటీఆర్ పై వ్యాఖ్యలు చేశారు.

డ్రగ్స్ వ్యవహారంలో సెలెబ్రిటీలు ఉన్నారని, కొద్దిమందిపై ఛార్జిషీట్లు కూడా నమోదయ్యాయని, సినీ నటులతో కేటీఆర్‌కు కూడా సంబంధాలు ఉన్నాయని, దర్యాప్తును లోతుగా చేయాలని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ శుక్రవారం ఈడీ జాయింట్ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేసిన తర్వాత కేటీఆర్ పై విధంగా స్పందించడం గమనార్హం. గజ్వేల్ సభలో రేవంత్ రెడ్డి సైతం “మద్యానికి కేసీఆర్, డ్రగ్స్ కు కేటీఆర్ బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు” అంటూ చేసిన వ్యాఖ్యలు కూడా కేటీఆర్ పై విధంగా కౌంటర్ ఇవ్వడానికి కారణమయ్యాయి.

రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాను కూడా గౌరవించకుండా ‘తాగుబోతు’ అని వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదని, ఇక నుంచి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని, వారిపైన కేసులు పెడుతామని కేటీఆర్ హెచ్చరించారు. అవసరమైతే రాజద్రోహం కేసులు కూడా పెడుతామన్నారు. అడ్రస్ లేని వ్యక్తులు కేసీఆర్‌ని తిడితే ఉరుకోబమని హెచ్చరించారు.

సీఎం కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో పడుకున్నారంటూ కొద్దిమంది పిచ్చి కూతలు కూస్తున్నారని, అదే నిజమైతే దేశంలోనే ఎక్కడా లేని సంక్షేమ పథకాలు ఎలా అమలు అవుతున్నాయని కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌లో పడుకుంటే తెలంగాణకు పెట్టుబడులు, తెలంగాణ అభివృద్ధి ఆగిపోతుందా అన్నారు. ప్రతిపక్షాలు చిల్లర మాటలు మాట్లాడుతున్నాయని, ఎవ్వరినీ వదిలిపెట్టబోమని, గుడ్డలు ఊడదీస్తామని హెచ్చరించారు. పెయింటింగ్ వేసుకునే వ్యక్తికి జూబ్లీహిల్స్ ప్రాంతంలో నాలుగు ఇండ్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. అందరి భాగోతాలు తమ దగ్గర ఉన్నాయని, సమయం వచ్చినప్పుడు వాటన్నింటినీ బయట పెడుతామన్నారు.

Read More: టాలీవుడ్ డ్రగ్స్ బాగోతం బయటపెట్టిన రవితేజ డ్రైవర్.. కెల్విన్ ముందే విచారణ..?


Next Story