గేమింగ్ ‘యాత్ర’ను ఆరంభించిన జియో

by  |
గేమింగ్ ‘యాత్ర’ను ఆరంభించిన జియో
X

దిశ, వెబ్‌డెస్క్: టెలికాం దిగ్గజం జియో నెట్‌వర్క్ గేమింగ్‌లోనూ సత్తా చాటేందుకు రెడీ అయ్యింది. మొబైల్ గేమింగ్ కంపెనీ క్రికీ సంస్థ ‘యాత్ర’ అనే న్యూ ఆగ్మెంటెడ్ రియాలిటీ గేమ్‌ను రూపొందించగా, జియో ఆ సంస్థతో కలిసి తమ వినియోగదారులకు అందించేందుకు సిద్ధమైంది.

మొబైల్ ఫోన్ కెమెరాతో ప్లేయర్స్ ‘యాత్ర’ యాక్షన్-అడ్వెంచర్ గేమింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టొచ్చు. రాక్షస గుంపును సంహారం చేయడమే ఈ గేమ్ లక్ష్యం. ఆ రాక్షసులను ఎదుర్కొనేందుకు ధనస్సు, బాణం, చక్రం, లైట్‌నింగ్, ఫైర్ బోల్ట్స్ తదితర ఆయుధాలను వాడాలి. యూజర్లు గేమ్ ప్లే పూర్తి చేసిన తర్వాత, తమ పర్సనలైజ్డ్ వీడియోను స్నేహితులతో పంచుకోవచ్చు. ఇతర వినియోగదారులు పోస్ట్ చేసిన గేమ్‌ప్లే వీడియోలను చూసేందుకు వీడియో ఫీడ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. విల్లు ఎలా ఎక్కుపెట్టాలి, బాణాలను ఎలా సంధించాలి, వాటిలో నైపుణ్యం ఎలా సాధించాలనే విషయాలను నేర్చుకోవడానికి యూజర్లు డిజిటల్ ప్లేయింగ్ గ్రౌండ్‌ను ఉపయోగించుకోవచ్చు. జియో వినియోగదారులు ఇందులో 3డీ అవతార్ ఫీచర్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా పొందొచ్చు. ఎక్స్‌ట్రా వెపన్స్, పవర్స్ కావాలనుకుంటే, గేమ్ ప్లే టోకెన్స్ సాధించడంతో పాటు లెవెల్స్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఈ గేమ్ ప్రస్తుతం ఐవోఎస్‌, గూగుల్ ప్లే స్టోర్స్‌‌‌లో అందుబాటులో ఉంది.

‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న బెస్ట్ గేమింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను భారతదేశానికి తీసుకురావడంలో తొలి అడుగుగా ‘యాత్ర’ వీడియో గేమ్ నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఆగ్మెంటెడ్ రియాలిటీ గేమింగ్ వినియోగదారుడిని మరో కొత్త లోకంలోకి తీసుకెళ్తుంది. ఏఆర్ గేమ్ ఎక్స్‌పీరియెన్స్ చేయడానికి మేము జియోతో పాటు ఇతర వినియోగదారులను కూడా ఆహ్వానిస్తున్నాం’ అని ఆకాశ్ అంబాని తెలిపారు. ‘ఏఆర్ గేమ్స్‌తో ఫాంటసీ ప్రపంచాన్ని మొబైల్స్ ద్వారా వారి కళ్ల ముందుకే తీసుకురాగలుగుతున్నాం’ అని క్రికీ వ్యవస్థాపకులు జాన్వి, కేతకి శ్రీరామ్ పేర్కొన్నారు.

Next Story