బ్లాక్‌ఫంగస్ రోగులతో కోఠి ENT ఫుల్ …?

by  |
బ్లాక్‌ఫంగస్ రోగులతో కోఠి ENT ఫుల్ …?
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న తరుణంలో బ్లాక్ ఫంగస్ తీవ్ర ప్రభావం చూపుతోంది. దీని బారిన పడుతున్న వారి సంఖ్య ప్రతి నిత్యం పెరిగిపోతోంది. దీంతో ప్రజలలో భయాందోళనలు మొదలయ్యాయి. బ్లాక్ ఫంగస్ గత ఏడాది కొవిడ్ ఆరంభంలో మొదలైన కరోనా కేసులను తలపిస్తున్నాయి. రాష్ట్రంలో ఈ నెల 20వ తేదీ వరకు 5,44,263 మంది కొవిడ్ బారినపడి 4,95,446 మంది కోలుకున్నారు. ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 45,757 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇలా కొవిడ్ బారినపడి కోలుకున్న వారిలో మధుమేహం, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న వారు బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారు. కరోనా ఫస్ట్ వేవ్‌లో ఈ కేసులు అంతగా నమోదు కాలేదు. అయితే సెకండ్ వేవ్‌లో అనూహ్యంగా బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోతూ ప్రతి ఒక్కరిని కలవర పరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కోఠి లోని ఈఎన్‌టీ ఆస్పత్రిని నోడల్ ఆసుపత్రిగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కేవలం తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా బ్లాక్ ఫంగస్ రోగులు చికిత్సల కోసం వస్తుండగా వారికి వైద్యం అందించడం హాస్పిటల్ వైద్యులకు, సిబ్బందికి తలకు మించిన భారంగా మారుతోంది.

పొంతన లేని అధికారుల లెక్కలు…

కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రికి 200 పడకల సామర్ధ్యం ఉంది. మొత్తం ఐదు టేబుళ్లపై శస్ర్త చికిత్సలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా గురు, శుక్రవారాలలో ఆస్పత్రికి బ్లాక్ ఫంగస్ రోగులు పోటెత్తారు. దీంతో వారందరికీ పరీక్షలు నిర్వహించి అవసరమున్న వారిని ఇన్ పేషంట్లుగా చేర్చుకున్నారు. అయితే అధికారులు ప్రకటిస్తున్న గణాంకాలకు, వాస్తవ పరిస్థితులకు చాలా తేడా కనబడుతోంది. ఈ నెల 20వ తేదీన ఆస్పత్రిలో 284 ఓపీ నమోదు కాగా వీరిని పరీక్షించిన వైద్యులు 39 మందిని ఇన్ పేషంట్లుగా చేర్చుకున్నారు. ఆస్పత్రిలో మొత్తం 90 మంది రోగులు ఉన్నట్లు తెలిపారు. శుక్రవారం మొత్తం 305 మంది ఓపీ విభాగానికి రాగా 22 మందిని ఇన్ పేషంట్లుగా చేర్చుకున్నామని, ఇప్పటి వరకు 112 మంది మాత్రమే బ్లాక్ ఫంగస్ రోగులు ఉన్నారని హాస్పిటల్ అధికారులు ప్రకటించారు . అయితే వాస్తవానికి ఆస్పత్రిలో ఉన్న 200 బెడ్లు బ్లాక్ ఫంగస్ రోగులతో నిండిపోయాయి.

ఇతర రాష్ట్రాల రోగులు సైతం….

కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రికి ఇతర రాష్ట్రాల నుండి కూడా ప్రతినిత్యం రోగులు అధికంగా వస్తున్నారు. అయితే వీరిని చేర్చుకోవడం లేదనేవి కేవలం వదంతులు మాత్రమేనని ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ మనీష్ తెలిపారు. ఏపీ తో పాటు ఇతర పొరుగు రాష్ట్రాలకు చెందిన బ్లాక్ ఫంగస్ రోగులు వస్తున్నారని, వారిలో ఎవరిని తిప్పి పంపడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆస్పత్రిలో ఇప్పటికే 8 మంది ఇతర రాష్ట్రాల రోగులు ఉన్నట్లు ఆయన తెలిపారు.

బెడ్ల కెపాసిటీ పెంచక పోతే కష్టమే…

కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రికి బ్లాక్ ఫంగస్ బారినపడి వస్తున్న వారి సంఖ్య ఊహించని విధంగా ఉంది. నోడల్ హాస్పిటల్ గా ప్రకటించిన రోజుల వ్యవధిలోనే హాస్పిటల్ లో బెడ్స్ పూర్తిగా నిండిపోయాయంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో ఊహించవచ్చు. రాబోయే రోజులలో వ్యాధితో వచ్చే రోగులను పడకలు లేకుండా ఎలా చేర్చుకుంటారు ? వారికి ఎలా వైద్యం అందిస్తారనేది ప్రశ్నార్ధకంగా మారింది. నిత్యం వందల సంఖ్యలో వస్తున్న రోగుల తాకిడికి తగ్గట్లుగా బెడ్స్ , ఇతర సౌకర్యాలు కూడా పెంచవలసి ఉంది.

అన్ని విభాగాలు ఒక్క చోట ఉంటేనే…

బ్లాక్ ఫంగస్ వ్యాధి బారినపడిన వారిని సకాలంలో గుర్తించకపోతే అది ఎన్నో సమస్యలకు దారి తీస్తుందని వైద్యులే చెబుతున్నారు. కంటి చూపు పోవడం, మొదడుపై ప్రభావం చూపడం, దంత సమస్యలు ఇలా అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వీరికి ఈ లక్షణాలు ఏ స్థాయిలో ఉన్నాయో గుర్తించాలంటే ఎంఆర్ఐ, సీటీ స్కాన్ పరీక్షలు, కొవిడ్ నెగిటివ్ టెస్ట్ తప్పనిసరి. ఈ సౌకర్యాలు ఈఎన్‌టీలో లేవు. దీంతో ఉస్మానియా హాస్పిటల్ తో పాటు బయటి ల్యాబ్ లకు పంపుతున్నారు. కంటి సంబంధ సమస్యలకు సరోజినీ హాస్పిటల్ వైద్యులను సంప్రదిస్తున్నారు.

దీంతో రోగికి వైద్యం అందడంలో తీవ్ర జాప్యం ఏర్పడుతోంది. ఉదయం హాస్పిటల్ కు వచ్చిన రోగి ఈ పరీక్షలు చేయించుకుని తిరిగి వచ్చే సరికి రోజు గడిచిపోతోంది. ఈ లోగా వారి పరిస్థితి మరింత క్షీణిస్తోంది. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం బ్లాక్ ఫంగస్ రోగులకు అన్ని పరీక్షలు ఈఎన్టీలోనే చేయడంతో పాటు ప్రత్యామ్నాయంగా మరో హాస్పిటల్ ను ఈ రోగుల కోసం సిద్ధం చేయవలసి ఉంది. లేని పక్షంలో రానున్న రోజులలో పరిస్థితి ఊహించలేని విధంగా మారే అవకాశాలు ఉన్నాయి.

Next Story

Most Viewed