కొరియన్ డ్రామాల కిక్కే వేరప్ప!

by  |
కొరియన్ డ్రామాల కిక్కే వేరప్ప!
X

దిశ, వెబ్‌డెస్క్: మొదటిసారి కొరియన్ టీవీ సిరీస్‌లు (ముద్దుగా కే-డ్రామా అని పిలుస్తారు) చూసేవారికి అందులో హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు అనేది అర్థం కాదు. ఇక భాష, లిపి, వాళ్ల కల్చర్ అయితే అస్సలే అర్థం కావు. కానీ, వాటిలో ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది. చూస్తున్నంతసేపు చూడాలనిపించే ఫీల్ ఉంటుంది. ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్ సాయంతో ఒక కన్నుతో వీడియోను, మరో కన్నుతో సబ్‌టైటిల్‌ను చదువుతూ చూస్తున్నా పెద్దగా కష్టం అనిపించదు. పైగా ఒక్కసారి ప్రారంభించామంటే ఇక అన్ని ఎపిసోడ్‌లు చూడకుండా ఉండలేనంతగా ఈ కే-డ్రామాలు ఉంటాయి. అందుకేనేమో మెయిన్ స్ట్రీమ్ సిరీస్‌లతో పాటు ఇవి కూడా భారతీయ మార్కెట్‌లో గుర్తింపును సంపాదించుకుంటున్నాయి. ఎంతలా అంటే… ఇప్పుడు కే-డ్రామాలను కూడా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో డబ్ చేసి మరీ స్ట్రీమింగ్ సర్వీస్‌ల్లో విడుదల చేస్తున్నారు. మరి ఈ కే-డ్రామాల వివరం ఏంటనేది ఇవాళ్టి ఫిల్మీ ఫ్రైడేలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఎక్కడి కొరియా, ఎక్కడి భారతదేశం..రంగులు వేరు, భౌగోళిక స్థానం వేరు..సంస్కృతి సంప్రదాయాలు కూడా పూర్తిగా విభిన్నం. అయినప్పటికీ లీ మిన్ హో, కిమ్ సూ హ్యూన్, హ్యూన్ బిన్, సొంగ్ జూంగ్ కీ పేర్లు చెబితే వెంటనే గుర్తుపట్టడమే కాకుండా వారిని మన హీరోల మాదిరిగానే అక్కున చేర్చుకునే అభిమానులు ఎందరో భారతదేశంలో ఉన్నారు. ముఖ్యంగా 20 నుంచి 30ల వయస్సులో ఉన్న వాళ్లు, మెట్రో నగరాల్లో నివసించే వారు ఈ కే-డ్రామాలంటే పడిచచ్చిపోతున్నారు. భౌగోళికంగా చూస్తే ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మిజోరాంలలోనూ, అలాగే తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో ఈ కే-డ్రామాలు బాగా పాపులర్. ఇక కోల్‌కతా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాల్లో ఇప్పుడిప్పుడే కే-డ్రామాలు చూస్తున్నారు. అయితే ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా పాకిస్థానీ, మధ్యప్రాచ్య దేశాల సిరీస్‌లు, ప్రోగ్రామ్‌లు డామినేట్ చేస్తుండటంతో అక్కడ ఈ కే-డ్రామాల హవా ఇంకా మొదలుకాలేదు.

కొరియన్ వేవ్‌లో భాగంగా కే-డ్రామా, కే-పాప్‌ల పుణ్యమాని వారి కల్చర్‌ను ఆసియా దేశాలు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కే-డ్రామాలు ఎక్కువగా పాపులర్ అవుతున్నాయి. ముఖ్యంగా అక్కడి కే-డ్రామాలను ఇంగ్లిష్ టైటిల్ పేర్లతో విడుదల చేయడం మంచి ప్లస్ పాయింట్‌ అయింది. అందుకే బాయ్స్ ఓవర్ ఫ్లవర్స్, క్రాష్ ల్యాండింగ్ ఆన్ యూ, సీక్రెట్ గార్డెన్, మూన్ ఎంబ్రేసింగ్ సన్, హెయిర్స్, మై లవ్ ఫ్రమ్ అనదర్ స్టార్, కాఫీ ప్రిన్స్, ఫుల్ హౌస్, డిసెండెంట్స్ ఆఫ్ ద సన్ లాంటి సిరీస్‌లు మంచి ఆదరణ పొందాయి. కొరియన్ సిరీస్‌లలో ఉండే ఒక అమాయకత్వపు రొమాన్స్‌కు మనవాళ్లు విపరీతంగా ఫిదా అయిపోయారు. పాలరాతి బొమ్మల్లాగ కనిపించే హీరోయిన్‌లను చూసి అబ్బాయిలు, క్యూట్‌గా కనిపించే హీరోలను చూసి అమ్మాయిలు ఈ కే-డ్రామాలు చూడటానికే పెద్దపీట వేస్తున్నారు. అంతేకాకుండా వీరి కథాకథనాలు కూడా ఆలోచింపజేసే విధంగా ఉండటం, స్క్రీన్‌ప్లే, ప్రొడక్షన్ విలువలు కూడా హాలీవుడ్ స్థాయిలో ఉండటంతో అటు ఆహ్లాదం, ఇటు ఎంటర్‌టైన్‌మెంట్ రెండూ లభిస్తున్నాయని యువత అంటున్నారు. ఒకప్పుడూ అందరూ ఒకేలా కనిపిస్తుంటారని కామెంట్ చేసే వాళ్లందరూ ఇప్పుడు ఆయా సిరీస్‌లలో కనిపించే వారి పాత్రల పేర్లతో పాటు, నిజజీవితంలో పేర్లను కూడా గుర్తుపెట్టుకుని చెప్పగలుగుతున్నారు.

ముఖ్యంగా లీ మిన్ హో అనే కొరియన్ డ్రామా నటుడికైతే దాదాపు మహేశ్ బాబుకు ఉన్నంత ఫాలోయింగ్ ఉంది. ఈయన పేరు మీద ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాంలలో ఎన్నో ఇండియన్ ఫ్యాన్ గ్రూప్‌లు ఉన్నాయి. వీళ్ల అభిమానం ఎలా ఉందంటే..ఎలాగోలా లీ మిన్ హోను ఒకసారి భారతదేశ పర్యటనకు ఆహ్వానించాలని ఎప్పటినుంచో ఈ ఫ్యాన్ గ్రూప్‌లు లీ మిన్ హూ ఏజెన్సీని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇక కొరియన్ డ్రామాల పుణ్యమాని వారి కల్చర్ ఛాయలు ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి. కొరియన్ ఫుడ్ రెస్టారెంట్‌లు, కొరియన్‌లు ధరించే దుస్తులు, ఉపకరణాలను అమ్మే షాపులు ఎన్నో పుట్టుకొచ్చాయి. ఒక్కసారి ఈశాన్య రాష్ట్రాల్లో చూస్తే ఇలాంటి షాపులు, రెస్టారెంట్‌లు కోకొల్లలుగా కనిపిస్తాయి. అందుకే ఈశాన్య రాష్ట్రాలను ఈ మధ్య మినీ కొరియా ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తున్నారు.

మన తెలుగులో వచ్చిన పిల్లజమీందారు, ఓ బేబీ సినిమాలకు మాతృక కొరియన్ సినిమాలే. గతేడాది ఆస్కార్ అవార్డులు పొందిన పారసైట్ సినిమాతో కొరియన్ సినిమాలతో పాటుగా కొరియన్ డ్రామాలకు కూడా డిమాండ్ దారుణంగా పెరిగింది. కానీ, అందరికీ సబ్‌టైటిల్స్ చదువుతూ సిరీస్ చూడటం ఇష్టం ఉండదు కదా..అందుకే ఇప్పుడు చాలామటుకు కొరియన్ సిరీస్‌లు తెలుగులో కూడా డబ్ అవుతున్నాయి. ఎంఎక్స్ ప్లేయర్, వియూలలో ఇప్పటికే ఇలాంటి తెలుగులో డబ్ చేసిన కొరియన్ డ్రామాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కొన్ని కొరియన్ సిరీస్‌లకు తెలుగు సబ్‌టైటిల్స్ కూడా ఆన్‌లైన్‌లో లభిస్తున్నాయి. మరి రొమాంటిక్ కథనాలు ఇష్టపడే యువకులు ఒక్కసారి ఈ కొరియన్ రుచి కూడా చూసి, ఆ మాధుర్యాన్ని ఆస్వాదించండి.

Next Story

Most Viewed