కేసీఆర్‌కు షాక్ ట్రీట్మెంట్‌ ఇవ్వాలి.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by  |
కేసీఆర్‌కు షాక్ ట్రీట్మెంట్‌ ఇవ్వాలి.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, కోదాడ: తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితం అయ్యారని.. రాష్ట్రాన్ని దివాలా తీస్తున్న ఆయనకు షాక్ టీట్మెంట్ ఇవ్వాల్సిందే అంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం కోదాడ పట్టణంలోని జన ఆశీర్వాద యాత్రను ప్రారంభించిన ఆయన.. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

దేశంలో సుస్థిర పాలన అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బీజేపీయే అన్నారు. కరోనా కట్టడిలో ప్రపంచ దేశాలు దిమ్మతిరిగే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ కృషి చేశారు అని కొనియాడారు. ప్రపంచం మొత్తంలో 45 వ్యాక్సిన్లు తయారు చేయగా అందులో రెండు వ్యాక్సిన్లు మనదేశంలోనే తయారు చేసిన ఘనత భారతీయ శాస్త్రవేత్తలదని అన్నారు. అందులో 1 తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థదేనని గర్వంగా చెప్పారు.

కరోనా నివారణ కోసం ఓ వైపు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే.. వ్యాక్సిన్ గురించి రాహుల్ గాంధీ విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఆయనకు తోడు హైదరాబాద్‌లో మరో ట్విట్టర్ నాయకుడు కూడా విమర్శలు చేయడం ఏంటని కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ సెటైర్లు వేశారు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో కేసీఆర్ తన కుటుంబం, కుమారుడి కోసం ఎంతకైనా దిగజారుతారు అని విమర్శించారు. తెలంగాణ కోసం ఎంతో మంది బలిదానాలు చేసుకుంటే.. చివరకు రాష్ట్రం కేసీఆర్‌ కుటుంబం చేతికి వెళ్లిందన్నారు. ఇది ఇలా ఉంటే ఉద్యమంలో పోరాటం చేసిన వారికి విలువలేకుండా పోయిందన్నారు. ఈ నేపథ్యంలోనే ఈటల రాజేందర్‌ను పార్టీ నుంచి బహిష్కరించిందే గాక, అక్రమంగా ఆయనపై గెలవాలని కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ కుట్రలను బీజేపీ నాయకులు ఆపాలని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed