కేసీఆర్‌కు లేఖ రాసిన కిషన్ రెడ్డి.. విషయం ఏంటంటే.?

by  |
కేసీఆర్‌కు లేఖ రాసిన కిషన్ రెడ్డి.. విషయం ఏంటంటే.?
X

దిశ, తెలంగాణ బ్యూరో : రైల్వే ఉద్యోగులను ఫ్రంట్ లైన్ సిబ్బందిగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు బుధవారం ఆయన లేఖ రాశారు. కరోనా నేపథ్యంలో దేశంలో వైద్య, పారిశుద్ధ్య, పోలీసు, పారామెడికల్ తదితర విభాగాల సిబ్బంది‌తో పాటు రైల్వే శాఖ కూడా కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి తెలిపారు.

భారతీయ రైల్వేలు నిరంతరం పని చేస్తూ ప్రజల సౌకర్యార్థం అనేక సేవలు అందజేస్తున్నాయని, ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే కాకుండా ఆహార ధాన్యాలు, పాలు, వ్యవసాయ ఉత్పత్తులతో పాటు ఎరువులు, మందులు, బొగ్గు, సిమెంటు, పరిశ్రమలకు కావలసిన ముడిపదార్థాలను సరఫరా చేస్తున్నాయన్నారు. అత్యవసర సామగ్రి పరికరాల సరఫరాలో కూడా రైల్వేశాఖ ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఆక్సిజన్, వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రజల కోసం ప్రత్యేకంగా శ్రామిక్ రైళ్లను నడిపిందని, అదే విధంగా కోవిడ్ కష్టకాలంలో రైల్వే శాఖ ఉద్యోగులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా పని చేస్తున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా రైల్వే ఉద్యోగులు కోవిడ్ బారిన పడే అవకాశం ఉందని వారి రక్షణ కోసం ఫ్రంట్ లైన్ సిబ్బందిగా గుర్తించాలని డిమాండ్ చేశారు.

దేశంలోని, ఒరిస్సా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో రైల్వే ఉద్యోగులను ఫ్రంట్ లైన్ సిబ్బందిగా గుర్తించి వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యం ఇచ్చేందుకు ఆదేశాలు జారీ చేశారని వివరించారు. తెలంగాణలో కూడా రైల్వే ఉద్యోగులను ఫ్రంట్ లైన్ సిబ్బందిగా గుర్తించాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైల్వే ఉద్యోగులను కూడా ఫ్రంట్ లైన్ సిబ్బందిగా గుర్తించి వారికి ఇతర ఫ్రంట్ లైన్ సిబ్బందితో సమానంగా వ్యాక్సినేషన్, తదితర సదుపాయాలు కల్పించేలా తక్షణమే నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Next Story