కన్నీరు పెట్టుకున్న సుప్రీం లీడర్

by  |
కన్నీరు పెట్టుకున్న సుప్రీం లీడర్
X

న్యూఢిల్లీ: ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ దేశ ప్రజలకు కంట కన్నీరు పెడుతూ క్షమాపణలు చెప్పారు. తనపై పెట్టుకున్న ఆశలను, బాధ్యతలను పూర్తిస్థాయిలో నెరవేర్చలేకపోయానంటూ ఉద్వేగంతో మాట్లాడారు. తన కళ్లద్దాలు తీసి కన్నీరు తుడుచుకుంటూ తనపై పెట్టుకున్న నమ్మకాలను సంతృప్తి పరచలేదని పశ్చాత్తాపపడ్డారు. అధికారిక పార్టీ 75వ ఆవిర్భావ దినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన భారీ మిలిటరీ పరేడ్‌లో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

సముద్రమంతటి లోతు, ఆకాశమంత ఎత్తు ప్రజలు తనపై నమ్మకాలు పెట్టుకున్నారని, కానీ, ఆశించిన స్థాయిలో విధులు నిర్వహించలేకపోయారని అన్నారు. తన పూర్వీకులు కిమ్ ఇల్ సంగ్, కిమ్ జోంగ్ ఇల్‌లు అందించిన విలువలను కొనసాగించే బాధ్యత తనపై ఉన్నదని, ప్రజలు తనపైన నమ్మకముంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కానీ, ప్రజల జీవితాల్లో సమస్యలను తాను తొలగించలేకపోయారని అన్నారు. కిమ్ జోంగ్ ఉన్ ప్రస్తుతం ఒత్తిడిలో ఉన్నారని, ఆర్థికంగా చేదోడువాదోడుగా నిలిచే చైనాతో కరోనా కారణంగా సరిహద్దులు మూసేయడం, ప్రకృతి విపత్తులతో దేశం చితికిపోయిందని నిపుణులు చెబుతున్నారు. అందుకే తన ప్రసంగం దక్షిణ కొరియాతో స్నేహహస్తాన్ని అందించేలా సాగిందని వివరించారు. అలాగే, అమెరికాపైనా నేరుగా వ్యాఖ్యానాలు చేయకపోవడం గమనార్హం.

Next Story