ఆర్టీసీ ఎండీకి జేఏసీ నాయకుల కీలక లేఖ

by  |
Bus tand
X

దిశ,తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఉన్న ఆర్టీసీ ఆస్తులను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని టీఎస్ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ రాజిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఆర్టీసీ ఎండీకి లేఖ రాశారు. 33 జిల్లాల్లో ఆర్టీసీకి 1404.79 ఎకరాల భూమి ఉన్నట్లు విభజన కమిటీ నిర్ణయించిందని పేర్కొన్నారు. ఇవి రాష్ట్రంలోని సుమారు 600 ప్రాంతాల్లో ఉన్నాయని, వీటిలో కొన్ని చోట్ల పక్కా భవనాలుండగా దాదాపు 200 చోట్ల ఖాళీ స్థలాలు ఉన్నాయని ఆయన తెలిపారు. అయితే ఈ ఆస్తులన్నీ అన్యాక్రాంతం అవుతున్నట్లు వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.

సంస్థకు చెందిన స్థలాలను ‘బిల్ట్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్’, ‘డిపాజిట్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్’ పేరుతో ఇప్పటికే అన్ని స్థలాలను వ్యాపార సముదాయాలకు ఇచ్చారని, అనేక ఎకరాల స్థలాలను లీజు పేరుతో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారన్నారు. దీంతో ఆర్టీసీ డిపోల విస్తరణ చేసేందుకు స్థలాలు లేకుండా పోతున్నాయని, అభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు. లీజుకు తీసుకున్న వారిలో కొందరు రెంట్ కూడా చెల్లించడం లేదని తెలిసిందని, ఆర్మూర్ లో ఇచ్చిన స్థలానికి రూ.6 కోట్ల బకాయి పెండింగ్ లో ఉందన్నారు. అంతేకాకుండా తుర్కయంజల్, కాగజ్‌నగర్, బచ్చన్నపేట, బోధన్ వంటి అనేక చోట్ల భూములు ఖబ్జా అయ్యాయని పత్రికల్లో వార్తలొచ్చాయని, ఆ భూములను రక్షించాలని విజ్ఞప్తి చేశారు.

నిర్మల్‌లోని సంస్థకి చెందిన 2.5 ఎకరాల భూమిలో మున్సిపల్ అధికారులు నిర్మాణాలు మొదలుపెట్టేందుకు వస్తే, అక్కడున్న భూములు లీజుకు ఇవ్వడం కుదరదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిందని నిర్మల్ డిపో మేనేజర్, కార్మికులు అడ్డుకున్నారని గుర్తుచేశారు. అయితే పనులు అడ్డుకున్నందుకు నిర్మల్ డిపో మేనేజర్ పై కేసులుపెట్టి వేధిస్తున్నారని, ఆయన్ను బదిలీ చేస్తున్నట్లు వస్తున్న వార్తలు కార్మికులను ఆందోళనకు గురి చేస్తున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సంస్థకి ఉన్న భూములను ఖబ్జా కాకుండా కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని జేఏసీ తరపున రాజిరెడ్డి డిమాండ్ చేశారు.

Next Story