టార్గెట్ హుజురాబాద్‌.. ఆ పథకంలో సర్కార్ నయా ప్లాన్స్!

by  |
Chief Minister KCR
X

దిశ, తెలంగాణ బ్యూరో: హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక అధికార పార్టీకి ‘ఇజ్జత్ కా సవాల్’ కావడంతో ఆరు నూరైనా గెలవడం కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నది. తగిన వ్యూహాలు రచిస్తున్నది. ‘దళిత బంధు‘ లాంటి కొత్త పథకాలను తెరమీదకు తెస్తున్నది. యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలనుకుంటున్నది. పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌లో ప్రయోగాలు చేస్తున్నది. ఆ నియోజకవర్గంలో సుమారు 40 వేలకు పైగా ఎస్సీల ఓట్లు ఉండడంతో వాటిని గంపగుత్తగా తనవైపు తిప్పుకోడానికి తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో వందమంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయాలనే విధంగా నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం హుజూరాబాద్‌లో మాత్రం అర్హులైన అన్ని దళిత కుటుంబాలకు ఒకేసారి అమలు చేయాలనుకుంటున్నది. ఇందుకోసం అదనంగా రూ. 2,000 కోట్లను కూడా ఖర్చు చేయాలనుకుంటున్నది.

‘దళిత బంధు‘ పథకం అమలు కోసం విధి విధానాలను రూపొందించే కసరత్తు జరుగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా దళితులకు ఆర్థికంగా సాధికారత కల్పించాలన్న లక్ష్యంతో ఇప్పటికే దళిత మేధావులు, ప్రజా సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్ అధికారులతో కూడా విస్తృతంగా చర్చించారు. కడు పేదరికంతో ఉన్న దళిత కుటుంబాలను ఆర్థికంగా వృద్ధిలోకి తీసుకురావడానికి ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నది. ఇందుకోసం రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో ఇప్పటికే వెయ్యి కోట్లను ప్రభుత్వం కేటాయించింది. రానున్న నాలుగేళ్ళ కాలంలో సుమారు రూ. 40 వేల కోట్లను ఖర్చు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. కానీ ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో వీలైనంత తొందరగా మార్గదర్శకాలను జారీ చేసి అమలులోకి తేవాలని భావిస్తున్నారు.

దళిత కుటుంబాల్లో ఈ పథకానికి అర్హతను నిర్ణయించడానికి ఎలాంటి అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలన్నదానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ‘కడు పేదరికం’ అనేదానికి దేన్ని క్రైటీరియాగా తీసుకోవాలనేదానిపై చర్చిస్తున్నారు. హుజూరాబాద్‌లో మొత్తం 20,929 దళిత కుటుంబాలు ఉన్నందున వీలైనంత ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చాలనుకుంటున్నది సర్కారు. ఆ మేరకు ఓటు బ్యాంకును రాబట్టుకోడానికి వీలవుతుంది. ఈ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకునే నిబంధనలు, విధివిదానాలు రూపొందనున్నాయి. పేదరికం స్థాయిని పరిగణనలోకి తీసుకోడానికి ఇంటి విస్తీర్ణం, ఇంట్లోని గృహోపకరణాలు, టూ-వీలర్, కుటుంబం మొత్తం వార్షికాదాయం లాంటి అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. ఒకటి రెండు రోజుల్లోనే ’దళిత బంధు’ విధి విధానాలు ఖరారు కావచ్చని అధికారుల సమాచారం.

హుజూరాబాద్‌కు నిధుల వరద

’దళిత బంధు’ పథకానికి రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు రూ. 1,200 కోట్లను ఖర్చు పెట్టాలనుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం కేవలం హుజూరాబాద్ నియోజకవర్గంలో మాత్రం గరిష్ఠంగా సుమారు రూ. 2,000 కోట్లను ఖర్చు చేయాలనుకుంటున్నది. రాష్ట్రం మొత్తంమీద ఈ పథకం కింద చేయాలనుకుంటున్న ఖర్చు కంటే ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గానికే ఎక్కువ కేటాయించాలనుకుంటున్నది. అదనంగానే ఈ నిధులను సమకూర్చనున్నట్లు సీఎం ప్రకటించారు. ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి బహిష్కరించిన తర్వాత ఆ సెగ్మెంట్‌పై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రతీ రోజూ ఏదో ఒక అభివృద్ధి, సంక్షేమ పథకానికి ప్రభుత్వం అనుమతి మంజూరు చేస్తున్నది.

కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మొదలు జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ వరకు ప్రభుత్వం సుమారు రూ. 660 కోట్లకు పైగానే ఆర్థిక అనుమతులు మంజూరు చేసినట్లు సచివాలయ వర్గాల సమాచారం. ఇందులో ఇప్పటికే సుమారు రూ. 360 కోట్ల మేర విడుదలైందని, మిగిలింది కూడా వారం రోజుల్లోపే ఒకదాని తర్వాత ఒకటిగా వేర్వేరు పథకాలకు విడుదలవుతాయని సూచనప్రాయంగా సచివాలయ అధికారులు తెలిపారు. మానేరు రివర్ ఫ్రంట్ పథకానికి రూ. 310 కోట్లు, హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రోడ్లకు రూ. 35 కోట్లు, జమ్మికుంట మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 30 కోట్లు ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసింది.

ఇక రాష్ట్రంలో ఆసరా పింఛన్లకు వయో పరిమితిని 57 ఏళ్ళకు కుదించడంపై విధాన నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ హుజూరాబాద్ పరిధిలో మాత్రం ఇప్పటికే గుట్టుచప్పుడు కాకుండా వివరాల సేకరణ మొదలైంది. కొన్ని గ్రామాల్లో సీసీ రోడ్లకు నిధులు మంజూరయ్యాయి. గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను కూడా వెంట వెంటనే విడుదల చేస్తున్నది. ప్రభుత్వ పథకాలను సమర్ధవంతంగా అమలుచేయడానికి, ప్రభుత్వానికి పూర్తి సహాయ సహకారాలు అందించే అధికారులను అక్కడికి బదిలీ చేస్తున్నది. జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ల మొదలు క్రింది స్థాయి సిబ్బంది వరకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్నది. ఉప ఎన్నికలు ముగిసే లోపు దళిత బంధుకు అవసరమయ్యే రూ. 2,000 కోట్లకు అదనంగా మరో వెయ్యి కోట్లను ఖర్చు చేయాలనుకుంటున్నట్లు తెలిసింది. ఇప్పటికే దాదాపు సగం విడుదలకాగా మిగిలినవి త్వరలో రిలీజ్ కానున్నట్లు సమాచారం.

Next Story