సీఏఏను పునసమీక్షించాలి: అసెంబ్లీ తీర్మానం

by  |
సీఏఏను పునసమీక్షించాలి: అసెంబ్లీ తీర్మానం
X

దిశ, న్యూస్ బ్యూరో

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ వ్యతిరేకమైనదని, భారత సమాజంలో అనేక సెక్షన్ల ప్రజల్లో రకరకాల గందరగోళాలు ఉన్నాయని, దీన్ని పునసమీక్షించాల్సిందేనని తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ఈ తీర్మానంపై అసెంబ్లీలో లోతుగా చర్చ జరిగింది. ఈ చట్టం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనదని, లౌకికతత్వం, సమానత్వ సూత్రానికి వ్యతిరేకమైనదని ముఖ్యమంత్రి ఆ తీర్మానంలో పేర్కొన్నారు. బీజేపీ ఏకైక శాసనసభ్యుడు రాజాసింగ్ ఈ తీర్మానంతో విభేదించారు. ముఖ్యమంత్రి నుంచి ఘాటైన సమాధానం రావడంతో అసహనానికి గురై తీర్మానం ప్రతులను అసెంబ్లీలో చించివేసి నిరసన తెలిపారు. అనంతరం జరిగిన ఓటింగ్‌లో ఈ తీర్మానానికి సభ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. సీఏఏ వ్యతిరేక వైఖరి తీసుకున్న ముఖ్యమంత్రిని మజ్లిస్ సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ ప్రశంసలతో ముంచెత్తారు.

శాసనసభ సమావేశాల ముగింపురోజైన సోమవారం ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆ తీర్మానంలో కేంద్రంపైనా, కేంద్ర మంత్రులపైనా నిప్పులు చెరిగారు. ఇప్పుడున్న పద్ధతిలోనే సీఏఏ అమలుచేయడం వాంఛనీయం కాదని, యావత్తు దేశంలో విమర్శలు రావడం, అసంతృప్తి సెగలు చోటుచేసుకోవడం, ఉవ్వెత్తున నిరసనలు వస్తున్నందున వాటిని కూడా పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని పునస్సమీక్షించాలని కోరారు. భారీ సంఖ్యలో నిర్దిష్టంగా ఒక మతానికి చెందిన ప్రజలను మినహాయించే ఎన్‌పిఆర్, ఎన్ఆర్‌సి ప్రతిపాదిత అమలుపై సభ ఆందోళన వ్యక్తపరుస్తున్నదని పేర్కొన్నారు. ఎన్‌పిఆర్, ఎన్ఆర్‌సి, సీఏఏలకు ఉన్న రాజ్యాంగ, చట్టబద్ధతలపై అనేక ముఖ్యమైన ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని, వీటిని కేంద్ర ప్రభుత్వం విశదీకరించలేకపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక నిర్దిష్ట మతానికి చెందినవారిని పౌరసత్వ జాబితా నుంచి తొలగించడాన్ని రాజ్యాంగం ఒప్పుకోదన్నారు.

వీటి మార్గదర్శకాలలో ఉన్న అంశాలకు, కేంద్ర మంత్రులు పార్లమెంటు వేదికగా ఇస్తున్న హామీలకు పొంతనే లేదని, ఈ గందరగోళంతో ఏది వాస్తవమో తేల్చుకోలేకపోతున్నారని అన్నారు. వీటివల్ల ఎక్కువగా మతపరమైన, భాషాపరమైన మైనారిటీలతో పాటు మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. భారత భూభాగంలో పుట్టినవారికి సైతం జన్మస్థలాన్ని, పుట్టిన తేదీని ధృవీకరించే పత్రాలను, వారి తల్లిదండ్రుల పుట్టినతేదీ, పుట్టిన స్థలం వివరాలను డాక్యుమెంట్ల రూపంలో తీసుకురావాలన్న నిబంధన ఆచరణలో అమలయ్యేదికాదని ముఖ్యమంత్రి తన స్వీయానుభవాన్ని చెప్పారు. ప్రధాన మంత్రి సహా ఈ దేశంలో ప్రజలచేత ఎన్నుకోబడిన సభ్యులంతా ఓటరు గుర్తింపు కార్డు ఆధారంగానే ఎన్నికల్లో పోటీచేశారని, కానీ ఎన్ఆర్‌సి, సీఏఏ విషయంలో ఇవి తగిన ధృవీకరణ పత్రాలు కావని ప్రభుత్వం చెప్పడం అసమంజసం అని అన్నారు.

సంకుచిత ఆలోచనలు :

ప్రతీ దేశానికి ఒక పౌరసత్వ చట్టం ఉండాల్సిందేనని, అయితే అది ప్రజలకు సౌకర్యం కలిగించాలి తప్ప ఇబ్బందులను కాదని సీఎం అన్నారు. నేటి ప్రాపంచిక పరిస్థితుల్లో విశ్వమానవ సౌభ్రాతృత్వం కనిపిస్తోందని, ఒక దేశానికి చెందినవారు అనేక దేశాల్లో వివిధ కారణాలతో బతుకుతున్నారని, ‘గ్లోబల్ సిటిజన్’గా మారారని, ఇప్పుడు భారత పౌరసత్వం కోసం పుట్టినతేదీ, పుట్టిన స్థలం తదితరాలకు సంబంధించి ఆధారాలను సమర్పించాలని కోరడమంటే అది సంకుచిత ఆలోచనా ధోరణేనని అన్నారు. నిజంగా చొరబాటుదారులను ఏరివేయాలంటే తగిన విధానాన్ని అనుసరించాలి తప్ప సీఏఏ అమలు తగిన ఫలితాలను ఇవ్వదన్నారు. అమెరికా అధ్యక్షుడు మెక్సికో సరిహద్దులో పెద్ద గోడ కట్టినట్లుగా మన దేశ పెద్దలు కూడా బోర్డర్‌లో ఇలాంటి గోడ కడతామంటే ఎవరైనా వద్దంటారా అని కేసీఆర్ తనదైన శైలిలో చమత్కరించారు.

నిజానికి ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చిన సీఏఏ ఒక్క రోజుతో ముగిసే ముచ్చట కాదని, దీనిపై మేధావులు, మాజీ జడ్జీలు లేవనెత్తుతున్న అంశాలు సైద్ధాంతికపరమైనవని అన్నారు. సీఏఏ అనే చట్టం బీజేపీ పెద్దల అసహనంలోంచి పుట్టుకొచ్చిందన్నారు. దీనికి వ్యతిరేకంగా మాట్లాడినవారంతా దురదృష్టవశాత్తు ‘దేశద్రోహులు’ అవుతున్నారు. ఇప్పుడు ఈ సభ కూడా సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తే దేశద్రోహ సభ అయిపోతుందా అని ప్రశ్నించారు. ఏడు రాష్ట్రాల అసెంబ్లీలు ఇప్పటికే తీర్మానం చేశాయని గుర్తుచేశారు. మతపరమైన, భాషాపరమైన మైనారిటీలను భారత సమాజం నుంచి వేరుచేసి చూసే దేశ విభజన రాజకీయాలు అవసరమా అని నిలదీశారు. నిజానికి షహీన్‌బాగ్ లాంటి నిత్య నిరసన వేదికలతో పాటు ఉన్నత విద్యా సంస్థల్లో జరిగే వ్యతిరేక ప్రదర్శనలు, పలు రాష్ట్రాల అసంతృప్తి అంతర్జాతీయ స్థాయిలో మన రాష్ట్ర ప్రతిష్టను మంటగలుపుతున్నాయన్నారు.

వాజ్‌పాయి హయాంలోనే విఫల ప్రయోగం :

వాజ్‌పాయి ప్రధానిగా ఉన్న సమయంలోనే సీఏఏ సవరణ చట్టానికి పునాదులు పడ్డాయని గుర్తుచేశారు. పౌరసత్వ గుర్తింపు కార్డు ఇవ్వడంకోసం దేశంలోని పలు ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలుచేశారని, అందులో మన రాష్ట్రంలోని మెదక్ జిల్లా కూడా ఉందని, ఈ ప్రాజెక్టు కోసం సుమారు 44 కోట్లు కూడా ఖర్చయిందని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా సుమారు 31 లక్షల మంది వివరాలను సేకరిస్తే చివరకు 12 లక్షల మందికి కూడా కార్డులు అందలేదని, ఇదే విషయాన్ని యుపీఏ హయాంలో మంత్రిగా ఉన్న గురుదాస్ కామత్ పార్లమెంటుకు 2012లో సమర్పించిన నివేదికలో స్పష్టం చేశారని వివరించారు. ఆ రకంగా అది ఒక విఫల ప్రయోగంగా మిగిలిపోయిందని, ఇప్పుడు అదే ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ భుజానికెత్తుకుని దేశంలో గందరగోళ పరిస్థితులకు కారణమైందన్నారు.

ఎన్ఆర్‌సి విషయంలో కేంద్రం చెప్పేది ఒకటి చేసేది మరొకటిగా ఉందన్నారు. కేంద్ర హోం మంత్రిత్వశాఖ 2018-19లో తన వార్షిక నివేదికలో ఎన్ఆర్‌సికి ఎన్‌పిఆర్ తొలి మెట్టుగా ఉంటుందని పేర్కొంటే హోం మంత్రి అమిత్ షా మాత్రం లోక్‌సభలో అలాంటిదేమీ లేదని, ఎన్‌పిఆర్ సందర్భంలో ప్రజలు ఇచ్చే సమాచారం స్వచ్ఛందం మాత్రమే గానీ ‘తప్పనిసరి కాదు’ అని పేర్కొనడంతో ప్రజలు ఎవ్వరూ నమ్మడంలేదన్నారు. దశాబ్దాలుగా ఇక్కడ నివసిస్తున్న ప్రజలు తగిన ధృవీకరణ పత్రాలు సమర్పించలేకపోతే వారు ఎక్కడికి పోవాలని ప్రశ్నించారు. యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాల లాంటి సందర్భాల్లో ప్రజలు పక్క దేశాల నుంచి సరిహద్దు దాటి మరో దేశంలోకి పోవడం సహజమేనని, ఐక్యరాజ్య సమితి సైతం ‘వారిని కాందిశీకులుగా గుర్తించి ఆశ్రయం ఇవ్వాలి’ అని ఆదేశించిందని కేసీఆర్ గుర్తుచేశారు.

మహిళలు, నిరక్షరాస్యులు, పేదలకే ఇబ్బందులు :

ఎన్‌పిఆర్ లేదా దాని తర్వాత వచ్చే ఎన్ఆర్‌సిలతో ఎక్కువ ఇబ్బందులు పడేది మైనారిటీ ముస్లింలతో పాటు మహిళలు, నిరక్షరాస్యులు, పేదలేనని అన్నారు. మన దేశ ప్రత్యేక పరిస్థితుల్లో ఇలాంటి ధృవీకరణ పత్రాలను సమకూర్చుకోవడంలో చాలా ఇబ్బందులు ఉన్నాయన్నారు. మహిళలు పెళ్ళయిన తర్వాత మెట్టినింటికి వెళ్ళిపోతే ఇంటిపేర్లు మారిపోతాయని, అప్పటివరకూ సర్టిపికెట్లలో ఉన్న పేర్లకు ఇవి సరిపోవని, చివరకు ‘డౌట్‌ఫుల్’ జాబితాలోకి వెళ్ళిపోతారని అన్నారు. దేశంలో సుమారు 60% మంది ఇలాంటి కోవలోకి వచ్చేవారే అని అన్నారు. వీరి ఆందోళనకు కేంద్రం ఎలాంటి సమాధానం చెప్తుందని ప్రశ్నించారు. ప్రజల సందేహాలను నివృత్తి చేయడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అన్నారు. అప్పటివరకూ సీఏఏ, ఎన్‌పిఆర్, ఎన్ఆర్‌సిలపై కేంద్ర ప్రభుత్వం పునస్సమీక్ష చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ తీర్మానానికి అసెంబ్లీ ఏకగ్రీవంతా మద్దతు పలికింది.

Tags : Telangana, Assembly, CAA, NPR, NRC, CM KCR, Mexico



Next Story

Most Viewed