మహిళలకు ఆర్థిక చేయూత అవసరం: కవిత

79

దిశ, తెలంగాణ బ్యూరో: పారిశ్రామిక రంగంలోకి ప్రవేశించాలనుకునే మహిళలకు, యువతకు సలహాలివ్వడంతో పాటు ఆర్థిక చేయూతనందించాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో సోమవారం తెలంగాణ ఛాంబర్‌ ఆఫ్‌ ఈవెంట్స్‌ ఇండస్ట్రీ (టీసీఈఐ) నాలుగవ స్త్రీ శక్తి అవార్డుల కార్యక్రమం నిర్వహించారు. మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ వినోభా దేవి, మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పుష్పలతా దేవి, ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనూష లకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఆర్థికంగా చేయూత అందించడం ఎంతగానో అవసరమన్నారు.

ఒక మహిళకు అవార్డు ఇచ్చామంటే, ఆ మహిళను ఆదర్శంగా తీసుకునే పిల్లలకు, కుటుంబానికి కూడా అవార్డు ఇచ్చి ప్రోత్సహించినట్లు అవుతుందన్నారు. బతుకమ్మ, నవరాత్రులను పురస్కరించుకొని అవార్డులు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 6 కోట్ల మంది పారిశ్రామికవేత్తలు సూక్ష్మ, మ‌ధ్యత‌ర‌గ‌తి ప‌రిశ్రమ‌లు నిర్వహిస్తున్నారని, ఇందులో కేవలం 15 శాతం మాత్రమే మహిళల భాగస్వామ్యంలో నడుస్తున్నాయన్నారు.

ఈ 15 శాతంలో, 80 శాతం మహిళలు సొంతంగా వ్యాపారాలను నిర్వహిస్తుండగా, మిగిలిన 20 శాతం మంది ప్రైవేటు, ప్రభుత్వ ఆర్థిక సహాయంతో పరిశ్రమలు నిర్వహిస్తున్నారని వివరించారు. అంతర్జాతీయ గైనకాలజిస్టుల అసోసియేషన్ కు కార్యదర్శిగా ఎంపికైన తెలుగు మహిళా డాక్టర్ శాంతికుమారిని అభినందించారు. అనంతరం అధికారులు, పారిశ్రామిక వేత్తలతో కలిసి ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాణిదేవి, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఐఏఎస్ కరుణ వాకాటి, పలువురు ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..