పోలీస్‌శాఖలో థర్డ్‌జెండర్స్‌.. కర్ణాటక ప్రభుత్వ ముందడుగు!

by  |
Police
X

దిశ, ఫీచర్స్ : ‘ట్రాన్స్‌జెండర్స్’ కమ్యూనిటీని సమాజం ఇప్పుడిప్పుడే యాక్సెప్ట్ చేస్తోంది. ఈ కమ్యూనిటీలో కూడా ఎంతోమంది ఉన్నత స్థానంలో ఉండగా… ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా సత్తా చాటుతున్నారు. కానీ ఇప్పటికీ ‘జెండర్’ కారణంగా వారిని ఉద్యోగావకాశాలకు దూరం పెడుతున్న సందర్భాలను చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర పోలీసు (KSP)లోని ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ (IRB)లో స్పెషల్ రిజర్వ్ సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్ట్ కోసం ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ నుంచి దరఖాస్తులు కోరుతూ కర్ణాటక ప్రభుత్వ శాఖ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేయడం విశేషం.

కర్ణాటక ప్రభుత్వం తొలిసారిగా ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి అద్భుత అవకాశం అందిస్తోంది. ఐ‌ఆర్‌బీలోని రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్ట్‌ కోసం 70 ఖాళీలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ విడుదల చేయగా, జనవరి 18 లోపు అభ్యర్థులు అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది జూలైలో కర్ణాటక హైకోర్టు ఆదేశాలను అనుసరించి లింగమార్పిడి వ్యక్తులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉద్యోగాలను రిజర్వ్ చేసిన మొదటి రాష్ట్రం కర్ణాటక.

నగరానికి చెందిన NGO, హక్కుల సమూహం ‘సంగమ’తో పాటు సోషల్ యాక్టివిస్ట్ నిషా గులూర్ గతేడాది దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)కి ప్రతిస్పందనగా, అన్ని కేటగిరీల్లో ట్రాన్స్‌జెండర్లకు ఒక శాతం రిజర్వేషన్ ఇవ్వాలని 2021 జూలైలో హైకోర్టు ఆదేశించింది. ‘భారతదేశంలో ప్రభుత్వం తన రిక్రూట్‌మెంట్‌లో ట్రాన్స్‌జెండర్లకు సమాన హోదా కోసం వేసిన తొలి అడుగు ఇది. రిజర్వేషన్ కల్పించాలని కోర్టు ఆదేశాలు ఇవ్వడం అభినందనీయం’ అన్నారు సీనియర్ న్యాయవాది వెంకటేష్.

కర్ణాటకకు ముందే చత్తీస్‌గఢ్ పోలీస్ శాఖ.. 2019-20లో నోటిఫికేషన్ కోసం థర్డ్ జెండర్స్ నుంచి అప్లికేషన్స్ స్వీకరించగా, అందులో 13 మంది కానిస్టేబుల్స్‌గా ఎంపిక కావడం విశేషం. ఆ 13 మంది థర్డ్ జెండర్స్ కూడా రాయ్‌పూర్‌కు చెందిన వారే కాగా.. గతంలో తమిళనాడు, రాజస్థాన్‌లో మాత్రం పోలీస్ శాఖలో ట్రాన్స్‌జెండర్స్ పోలీస్ డ్యూటీ చేస్తున్నారు.

అభినందనీయం :

‘థర్డ్ జెండర్ సమూహం నుంచి దరఖాస్తులను ఆహ్వానించినందుకు KSPని అభినందిస్తున్నాం. ఒక సంస్థగా, వారి లైంగిక ధోరణి, లింగ గుర్తింపు ఆధారంగా వివక్షకు గురవుతున్న అట్టడుగు వర్గాలను ప్రధాన స్రవంతిగా మార్చడం, రెండు దశాబ్దాలుగా లైంగిక, లింగ మైనారిటీల సాధికారత కోసం, హక్కుల కోసం పోరాడుతున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర పోలీసులు కొత్త ముందడుగు వేయడం సంతోషకరం. ఇతర సంస్థలు కోర్టు నిర్దేశించిన విధంగా నడుచుకోవాలి. అర్హులైన ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ సభ్యులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల’ని సంగమ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ ఉమాదేవి అన్నారు.

Next Story