నువ్వు చావడం ఉత్తమం.. నెట్టింట వైరలైన ఫోన్ సంభాషణ

by  |
నువ్వు చావడం ఉత్తమం.. నెట్టింట వైరలైన ఫోన్ సంభాషణ
X

బెంగళూరు: ‘సార్.. వచ్చే నెల దాకా రేషన్ ఇవ్వనంటున్నారు. మా ఇంట్లో తిండిగింజలు అయిపోయాయ్. బయట లాక్‌డౌన్‌తో ఉపాధి లేదు. మేం ఎలా బతకాలి..?’ అని ఒక నిరుపేద రైతు మంత్రిని అడిగితే దానికి మంత్రి స్పందిస్తూ.. ‘నువ్వు చచ్చిపోవడం మంచిది..’ అంటూ సమాధానమిచ్చారు. కరోనా మహమ్మారి సృష్టించిన విలయంలో పడి దేశవ్యాప్తంగా పేదవారికి తినడానికి తిండి కరువైన నేపథ్యంలో.. సాయం చేయండని అడిగిన ఆ రైతుకు మంత్రి చెప్పిన సమాధానం అది. వివరాల్లోకెళ్తే.. కర్నాటకలో లాక్‌డౌన్ విధించడంతో ఉపాధి కోల్పోయిన ఒక నిరుపేద రైతు.. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉమేశ్ కట్టికి ఫోన్ చేశాడు. పీడీఎస్ వ్యవస్థ ద్వారా ఇస్తున్న ఐదు కిలోల బియ్యానికి బదులు.. కర్నాటకలో 2 కిలోల బియ్యం, మిగిలిన 3 కిలోలు రాగులు, జొన్నలు వంటివి అందజేస్తున్నారు. అయితే 2 కిలోల బియ్యం సరిపోతాయా…? అని ప్రశ్నించిన రైతుతో ఉమేశ్ కట్టి మాట్లాడిన మాటలు వివాదాస్పదమయ్యాయి.

రైతు.. మంత్రి మధ్య ఫోన్ సంభాషణ

రైతు : సార్, మీరిస్తున్న రేషన్ మాకు సరిపోతుందా..? లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయాం.
ఉమేశ్ కట్టి : మే, జూన్ లలో ప్రతి నెలా కేంద్ర ప్రభుత్వం 5 కిలోల బియ్యం అందజేస్తుంది.
రైతు : అప్పటిదాకా మేం పస్తులుండాలా..? లేక చావాలా..?
ఉమేశ్ : ‘నువ్వు చావడం ఉత్తమం (ఇట్స్ బెటర్ టు డై). ఇందుకే మేం రేషన్ ఇవ్వడం నిలిపేశాం. ఇంకోసారి నాకు ఫోన్ చేయకు..’ అంటూ ఫోన్ పెట్టేశారు ఉమేశ్ కట్టి.
ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్ కొద్దిసేపట్లోనే సోషల్ మీడియాలో వైరలయింది. ఉమేశ్ వ్యాఖ్యలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు. ఇదే విషయమై కాంగ్రెస్ కర్నాటక చీఫ్ డి.కె.శివకుమార్ స్పందిస్తూ.. ఆదుకోండని అడగడం ఆ రైతు చేసిన తప్పా..? అని ప్రశ్నించారు. ఉమేశ్‌ను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తన వ్యాఖ్యాలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవడంతో ఉమేశ్ తన వ్యాఖ్యలపై మరోసారి నిర్లక్ష్యపు వివరణ ఇచ్చారు. ‘అతడు (రైతు) చచ్చిపోతానంటే నేనేం చేయాలి..? నన్ను సరిగ్గా అడిగితే నేను కూడా సరైన సమాధానం చెప్పేవాడిని’ అని అన్నారు. ‘నువ్వు చచ్చిపోవద్దు. ప్రభుత్వం నీకు అండగా ఉంటుంది..’ అని చెప్పొచ్చు కదా అని విలేకరులు చెప్పగా.. ‘నాది అంత పెద్ద జాలి గుండె కాదు. చిన్న హృదయం’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం గమనార్హం.


Next Story

Most Viewed