కరీంనగర్‌లో మినీ మార్కెట్లకు మోక్షమెప్పుడో..?

by Sridhar Babu |

<p>దిశ, కరీంనగర్ సిటీ: నిత్యం కూరగాయలు కొనుగోలు చేసేందుకు నగరవాసులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.. ప్రధాన ప్రాంతాల్లో మినీ కూరగాయల మార్కెట్లు నిర్మిస్తున్నామని బల్దియా పాలకవర్గం చేసిన ప్రకటన నీరుగారి పోతోంది. మూడేళ్ల క్రితం, గత పాలకవర్గం హయాంలో పలుచోట్ల అట్టహాసంగా మినీ మార్కెట్లు నిర్మించారు. కానీ ఖాళీగా వదిలేశారు. ఇంకా స్ట్రీట్ వెండర్లకు కేటాయించలేదు. దీంతో అవి ఆకతాయిలకు అడ్డాలుగా మారుతున్నాయి. రాత్రి పూట అసాంఘిక కార్యక్రమాలకు నెలవు కాగా, నగర వాసులు [&hellip;]</p>

కరీంనగర్‌లో మినీ మార్కెట్లకు మోక్షమెప్పుడో..?
X

దిశ, కరీంనగర్ సిటీ: నిత్యం కూరగాయలు కొనుగోలు చేసేందుకు నగరవాసులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.. ప్రధాన ప్రాంతాల్లో మినీ కూరగాయల మార్కెట్లు నిర్మిస్తున్నామని బల్దియా పాలకవర్గం చేసిన ప్రకటన నీరుగారి పోతోంది. మూడేళ్ల క్రితం, గత పాలకవర్గం హయాంలో పలుచోట్ల అట్టహాసంగా మినీ మార్కెట్లు నిర్మించారు. కానీ ఖాళీగా వదిలేశారు. ఇంకా స్ట్రీట్ వెండర్లకు కేటాయించలేదు. దీంతో అవి ఆకతాయిలకు అడ్డాలుగా మారుతున్నాయి.

రాత్రి పూట అసాంఘిక కార్యక్రమాలకు నెలవు కాగా, నగర వాసులు మండిపడుతున్నారు. మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయిన అనంతరం నగర పరిధి శరవేగంగా విస్తరించింది. శివారు కాలనీలతో పాటు పరిసర గ్రామాలు కూడా కలిసిపోవడంతో నిత్యావసరాల సమస్య తీవ్రమైంది. ప్రధానంగా కూరగాయల కొనుగోళ్ల కోసం నగరవాసులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. పలు కాలనీల్లో రోడ్లవెంట విక్రయించినా దుమ్ము, ధూళీ పేరుకుపోయి అపరిశుభ్రంగా ఉంటున్నాయని వినియోగదారులు వాపోతున్నారు.

రోడ్లపైనే వాహనాలు

ప్రధాన కూరగాయల మార్కెట్‌తో పాటు, రైతుబజార్‌కు అత్యధిక మంది నగరవాసులు వెళ్తుంటారు. ఆయా చోట్ల రోడ్లపైనే వాహనాలు పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. నగరవాసులు కాశ్మీర్ గడ్డ, వెంకటేశ్వర స్వామి గుడి, శనివారం అంగడి లాంటి దూర ప్రాంతాలకు వెళ్లి కొనుగోళ్లు జరపడం ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో నగరవాసుల ఇబ్బందులు తొలగించేందుకు నిర్ణయించిన గత పాలకవర్గం, ప్రధాన కాలనీల్లో మినీ మార్కెట్లు ఏర్పాటు చేసేందుకు తీర్మానించి, యుద్ధ ప్రాతిపదికన నిర్మించింది. చైతన్యపురి, అటవీ శాఖ కార్యాలయం పక్కన, ఆర్‌అండ్‌బీ కార్యాలయం ఎదురుగా కిసాన్ నగర్, బస్టాండ్ వెనుకవైపు మార్కెట్ షెడ్ల నిర్మాణం చేశారు. ఆయా ప్రాంతాల్లో విక్రయాలు కొనసాగిస్తున్న వారిని తరలించి పరిశుభ్రమైన కూరగాయలు నగర వాసులకు అందించాలని సంకల్పించారు.

చైతన్యపురిలో మాత్రమే..

చైతన్యపురిలో నిర్మించిన షెడ్‌లో మాత్రమే వెండర్లకు, జిల్లా జైలు పక్కన పండ్ల వ్యాపారులకు స్థలం కేటాయించారు. మిగతా చోట్ల షెడ్లు అలాగే వదిలేశారు. దీంతో ఆయా ప్రాంతాల పరిసరాల్లో ఎండనకా, వాననకా ఫుట్‌పాత్‌లపైనే కూరగాయలు విక్రయిస్తుండగా, స్మార్ట్ సిటీలో డర్టీ వెండింగ్స్ అనే కామెంట్స్ వస్తున్నాయి. వీటిని వినియోగంలోకి తీసుకురావాలంటూ బల్దియా అధికార యంత్రాంగాన్ని నగర వాసులు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పలుమార్లు లిఖితపూర్వకంగా కోరినా పట్టించుకున్న దాఖలాలు లేవనే విమర్శలు ఉన్నాయి. వీటి నిర్మాణం కోసం వెచ్చించిన లక్షలాది రూపాయల ప్రజాధనం వృథా అవుతున్నాయని పలువురు మండిపడుతున్నారు.

ఆకతాయిలకు అడ్డాలుగా..

మినీ మార్కెట్లను ప్రారంభించకపోవడంతో ఆకతాయిలు, జులాయిలకు అడ్డాలుగా మారాయి. చీకటి పడిందంటే గ్రూపులుగా చేరి, పార్టీలు చేసుకుంటున్నారు. బస్టాండ్ వెనుకవైపున ఉన్న షెడ్డు వెంబడి వెళ్లాలంటే నగర వాసులు భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. బస్టాండ్ మీదుగా వెళ్లే ప్రధాన రహదారి నిరంతరం ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటుండగా, కలెక్టరేట్, భగత్ నగర్, అంబేద్కర్ స్టేడియం వైపు వెళ్లే వారికి బైపాస్‌గా మారిన బస్ స్టాండ్ వెనుక వైపు రోడ్డు పక్కనే షెడ్డు నిర్మించగా, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఉంది. అయినా, పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికైనా బల్దియా అధికారులు స్పందించి సత్వరమే మినీ మార్కెట్లకు మోక్షం కల్పించి, వినియోగంలోకి తేవాలని నగర వాసులు కోరుతున్నారు.

Next Story