కరీంనగర్ మెడికల్ సర్వే ఫలితాలిస్తుందా?

by  |
కరీంనగర్ మెడికల్ సర్వే ఫలితాలిస్తుందా?
X

దిశ, కరీంనగర్: కరోనా కోరల్లో చిక్కుకున్న కరీంనగర్‌ ప్రాంతంలో నిర్వహిస్తున్న మెడికల్ సర్వే ఎలాంటి ఫలితాన్నిస్తోందో అంతు చిక్కకుండా తయారైంది. ఇండోనేషియా నుంచి వచ్చిన 13 మంది మతప్రచారకులకు కరోనా పాజిటివ్ రావడంతో కరీంనగర్ వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే స్పందించిన సర్కార్ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి ఇండోనేషియన్లు తిరిగిన ప్రాంతాల్లో వ్యాధి సోకిన వారి గురించి చేస్తున్న సర్వే ఇప్పుడు ఏ మేరకు ఫలితానిస్తుందన్నది స్పష్టత రావట్లేదు. 100 మెడికల్ టీంలు, 16టీంలకు ఒక డాక్టర్‌ చొప్పున ఏర్పాటు చేసిన జిల్లా యంత్రాంగానికి అన్నివర్గాల నుండి సహకారం అందడం కష్టమేనని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మంత్రి గంగుల ఇంటింటికి తిరిగి ఒప్పించే ప్రయత్నం చేశారు. ఫస్ట్‌రోజునే 25వేల మందిని మెడికల్ టీంలు కలిసి వివరాలు సేకరించాయని, 28 మందిని 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలని సూచించామని మంత్రి పేర్కొన్నారు.

మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించేందుకు జిల్లా అధికార యంత్రాంగం తీసుకున్న చర్యలు స్పీడ్‌గానే ఉన్నయని చెప్పాలి. సర్వేటీంలు అంతర్గతంగా ఉన్న కరోనా బాధితులను గుర్తించేవిధంగా అవకాశం లేదన్నది స్పష్టమవుతోంది. మీ ఇంట్లో ఎంత మంది ఉన్నారు? వారి ఆరోగ్య పరిస్థితులు ఏంటి? ఎవరికైనా జలుబు, దగ్గు, జ్వరం వంటివి వచ్చాయా! వస్తే వారి వివరాలు తెలపండి. ఇది సర్వే ద్వారా సేకరిస్తున్న వివరాలు. దీనివల్ల అందరూ వివరాలను సంపూర్ణంగా అందిస్తారా లేదా అన్నది అనుమానమేనని చెప్పాలి. కరోనా వైరస్ సోకిందని చెబితే ఐసోలేషన్ కేంద్రాలకు తరలిస్తారన్న భయం కొందరిదైతే, చుట్టుపక్కలవారు తమ కుటుంబాన్ని వెలివేసే అవకాశం లేకపోలేదన్న భయం మరికొందరిని పట్టుకుందన్నది వాస్తవం.

మతప్రచారకులకు గైడ్‌గా వ్యవహరించిన వ్యక్తి కూడా దగ్గు, జలుబుతో బాధపడుతూ హోం క్వారంటైన్ అయిపోయి ఎవరికీ సమాచారం ఇవ్వలేదు. దీంతో జిల్లా అధికారులకు‌ సమాచారంరాగానే అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స చేసినట్టుగా తెలుస్తోంది. ఇలా మరెంత మంది బయటకు చెప్పకుండా ఇంట్లోనే ఉండిపోయారోనన్నది గమనించాల్సిన విషయం. ఇద్దరు ఏఎన్ఎంలకో టీం చొప్పున ఇంటింటికీ పంపించి వివరాలు సేకరించడం వల్ల ప్రజల నుండి సంపూర్ణ సహకారం అందే అవకాశాలు లేదన్నది మాత్రం వాస్తవం. సాక్షాత్తు మంత్రి వస్తేనే కొన్నిచోట్ల సాయ నిరాకరణ చేసిన పరిస్థితులు ఎదురైనప్పుడు సామాన్య ఏఎన్ఎంల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

Tags : Karimnagar, Corona virus, Positive, Medical Team, Survey, Indonesian Evangelists, Minister Gangula, Doctors, ANM

Next Story