అద్భుతం ఆవిష్కృతం.. గజ్వేల్‌కు గోదావరి జలాలు

by  |
అద్భుతం ఆవిష్కృతం.. గజ్వేల్‌కు గోదావరి జలాలు
X

దిశ, గజ్వేల్ : కొండపోచమ్మ సాగర్ జలాలను మొదట హల్దీ వాగులోకి వదిలి, మంజీరా నది ద్వారా నిజాం సాగర్‌‌కు తరలించే కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ మంగళవారం ప్రారంభించారు. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించాలన్నదే తమ లక్ష్యమని పదే పదే చెప్పే సీఎం ఆ దిశగా మరో ముందడుగు వేశారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని మర్కుక్, వర్గల్ మండలాల్లోని కెనాల్‌ను హల్దీవాగులోకి మల్లించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పటికే మేడిగడ్డ నుండి మిడ్ మానేరుకు చేరిన కాళేశ్వరం జలాలు. అక్కడి నుంచి కొండపోచమ్మ సాగర్‌కు చేరుకున్నాయి. ఇప్పుడు ఆ జలాల విడుదల కార్యక్రమం ద్వారా కొండపోచమ్మ సాగర్ జలాలను మొదట హల్దీ వాగులోకి వదిలి, మంజీరా నది ద్వారా నిజాం సాగర్‌కు తరలించనున్నారు. ఆ తర్వాత కొండపొచమ్మసాగర్ జలాలను గజ్వేల్ కెనాల్ నుంచి సిద్దిపేట జిల్లాలోని 20 చెరువులను నింపేందుకు నీటిని వదిలారు. దీంతో కాళేశ్వర ప్రాజెక్టు విస్తరణలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. అంతకుముందు ఉదయం11: 45 నిమిషాలకు ప్రత్యేక బస్సులో సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం అవుసులపల్లికి చేరుకున్న సీఎం కేసీఆర్.. అక్కడ కాళేశ్వర జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి హల్దీవాగులోకి నీటిని విడుదల చేశారు. ఆపై మర్కుక్ మండలం లోని కొండపోచమ్మ రిజర్వాయర్‌ నుంచి జలాలను విడుదల చేశారు.

సంగారెడ్డి కెనాల్ నుంచి ఏర్పాటు చేసిన తూముతో 16 వందల క్యూసెక్కుల నీటిని వదిలారు. అవుసులపల్లి దగ్గర క్రాస్ రెగ్యులేటర్‌ను నిర్మించి అక్కడి నుంచి హల్దీ వాగులోకి నీటిని మళ్లించడం కోసం తూము ఏర్పాటు చేశారు. ఈ జలాలు సంగారెడ్డి కెనాల్‌ నుంచి హల్దీ వాగు ద్వారా నిజాంసాగర్‌కు చేరుకుంటాయి. హల్దీ వాగులోకి వచ్చే గోదావరి జలాలు 10 రోజుల్లో మంజీర నది ద్వారా నిజాంసాగర్‌లోకి చేరతాయి. ఈ కార్యక్రమం అనంతరం మర్కూక్‌ మండలం పాములపర్తి గ్రామానికి చేరుకున్న సీఎం కేసీఆర్.. కాళేశ్వరం జలాలను గజ్వేల్‌ కాల్వలోకి నీటిని విడుదల చేశారు. ఈ జలాలు పరిసర ప్రాంతాల్లోని పాముల పర్తి చెరువు, పాతురు చెరువు, చేబర్తి చెరువు, ప్రజ్ఞా పుర్, గజ్వేల్, కేసారం, బయ్యారం, జాలియామా తదితర 20 చెరువులను నింపుతాయి.ఒక్కో చెక్ డ్యామ్ లో 0.62 టీఎంసీల నీరు నిల్వ ఉండనుందని అధికారులు తెలుపున్నారు.14 వేల 268 ఎకరాల్లో వరి పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంది. వర్గల్, తూప్రాన్, వెల్దుర్తి, మాసాయిపేట, కొల్చారం రైతులకు లబ్ధి చేకూరనుంది. హల్దీవాగు జలాల ద్వారా మెదక్, హవేలీ ఘనపూర్ రైతులు లబ్ధి పొందనున్నారు. మొత్తం 98 కిలోమీటర్ల పొడవుండే ఈ వాగు మెదక్‌ జిల్లా తుప్రాన్‌ మండలం యావపూర్, నాగులపల్లి మీదుగా కామారెడ్డి జిల్లాలో మంజీరానదిలో కలుస్తుంది. దీంతో కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ, బీరుకూరు, నస్రుల్లాబాద్, నిజామాబాద్‌ జిల్లా బోధన్, కోటగిరి, వర్గి, ఆర్మూరు మొదలైన ప్రాంతాల రైతులకు చెందిన 14,268 ఎకరాలకు ప్రత్యక్షంగా, మరో 20వేల ఎకరాలకు పరోక్షంగా సాగునీరు అందించేందుకు దోహదపడనుంది. అవుసులోనిపల్లి నుంచి వర్గల్‌ బంధం చెరువుకు నీరు చేరనుంది. ఈ కార్యక్రమంలో స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు హ‌రీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి పద్మ దేవేందర్ రెడ్డి, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, ఎఫ్దీసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి, ఎంపీపీ పాండుగౌడ్, జెడ్పీటీసీ మంగమ్మ రాంచెంద్రం, డీసీసీబీ చైర్మెన్ చిట్టి దేవేందర్ రెడ్డి, ఎఎంసీ చైర్మన్ జంగిర్, అంజిరెడ్డి, పలువురు నేతలు, అధికారులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed