కాకతీయ ప్రాజెక్టులో మళ్లీ నిలిచిన విద్యుత్ ఉత్పత్తి.. ఎందుకంటే..?

by  |
కాకతీయ ప్రాజెక్టులో మళ్లీ నిలిచిన విద్యుత్ ఉత్పత్తి.. ఎందుకంటే..?
X

దిశ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా : జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు 2వ దశలో బాయిలర్ ట్యూబ్ లీకేజీ కావడంతో 600 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. సోమవారం రాత్రి ఈ విషయం వెలుగుచూడటంతో విద్యుత్ ఉత్పత్తిని అధికారులు నిలిపివేశారు. ఈనెల 24న ఫస్ట్ ఫేస్ యూనిట్లో ట్యూబ్ లీకేజీ కావడంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. పదే పదే కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టులో ట్యూబ్ లీకేజ్ కావడం విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడం సర్వసాధారణమైంది.

వారం రోజుల్లోనే రెండుసార్లు విద్యుదుత్పత్తి నిలిచిపోగా గతంలో రెండుసార్లు ట్యూబ్ లీకేజ్ కావడంతో పవర్ ప్రొడక్షన్ నిలిచిపోయింది. విద్యుత్ సరఫరాలో ఇబ్బంది ఏర్పడటంతో సంస్థకు సైతం తీవ్రనష్టం ఏర్పడుతుంది. లీకేజీకి గల కారణాలేమిటో అధికారులు తెలుసుకోవడంలో విఫలమవుతున్నారు. పర్యవేక్షణ లోపమా లేదా పరికరాల నాణ్యత లోపమా అనేది అధికారులు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాగా, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు చిల్పూర్‌లోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టును సందర్శించి అధికారులకు అనేక సూచనలు ఇచ్చిన విషయం తెలిసిందే.

విద్యుత్ ఉత్పత్తిలో ముందుండాలని, రాష్ట్రంలోనే అగ్రగామి పవర్ ప్రాజెక్ట్‌గా నిలవాలని అధికారులు సూచించినప్పటికీ పర్యవేక్షణ లోపం కారణంగా విఫలం అవుతున్నారు. ఇప్పటికైనా కాకతీయ థర్మల్ ప్రాజెక్ట్‌లో విద్యుత్తు ఉత్పత్తికి గల ఆటంకాలు ఏమిటో అధికారులు గుర్తించాలి. పదే పదే ట్యూబ్ లీకేజీ కావడం, విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో ప్రాజెక్టులో పనిచేసే కిందిస్థాయి సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. నిపుణులైన అధికారులు ట్యూబ్ లీకేజీ కాకుండా సత్వరమే సరైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


Next Story

Most Viewed