ఆర్డర్ ఆర్డర్.. కరీంనగర్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా ‘జడ్జి గణపయ్య’

by  |
ఆర్డర్ ఆర్డర్.. కరీంనగర్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా ‘జడ్జి గణపయ్య’
X

దిశ, కరీంనగర్ సిటీ : హిందువులు అత్యంత ప్రీతిపాత్రంగా పూజించే ఆది దేవుడు వినాయకుని ప్రతిమలు వివిధ రూపాల్లో కొలువుదీరాయి. ఈసారి దేశంలో ఎక్కడా లేని విధంగా కరీంనగర్‌లో వినూత్న వేషధారణతో కొలువుదీరాడు లంబోదరుడు. జడ్జీ రూపంలో కొలువుదీరిన గణపయ్య భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాడు. ఇండియన్ యూత్ సెక్యూర్డ్ ఆర్గనైజేషన్ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక బస్‌ స్టాండులో ఏర్పాటు చేసిన గణపతిని చూసేందుకు జనం భారీగా తరలివస్తున్నారు.

జడ్జి రూపంలో గణనాధుడిని ఏర్పాటు చేసి, వచ్చి పోయే ప్రయాణీకులకు న్యాయస్థానం, చట్టాల పట్ల ఐసోటీమ్ సభ్యులు అవగాహన కల్పిస్తున్నారు. మండపంలో మొత్తం 5 గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేయగా.. మధ్యలో పెద్ద విగ్రహాన్ని జడ్జి గణేష్, మిగతా నాలుగు న్యాయ వాదులుగా ఏర్పాటు చేశారు. దీనితో పాటు దేశంలోని అన్ని హైకోర్టులు, అన్ని రాష్ట్రాల న్యాయమూర్తుల చిత్ర పటాలను మండపంలో పొందుపరిచారు. కాగా, జిల్లా ఉన్నతాధికారులతో పాటు పలువురు ప్రముఖులు మండపాన్ని సందర్శించి, భారతీయ న్యాయ వ్యవస్థ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తుండటం పట్ల నిర్వాహకుడు ఘన శ్యామ్ ఓఝాను అభినందిస్తున్నారు. గతంలో కూడా ఐసో బృందం వ్యవస్థాపకుడు డాక్టర్ గణేష్, రక్తదాన గణేష్, ట్రాఫిక్ గణేష్‌లు ప్రతిష్టించి ప్రజలకు అవగాహన కల్పించారు. జడ్జి గణేష్‌ను కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ, అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్, డీటీసీ ఎం.చంద్రశేఖర్ గౌడ్, టౌన్ ఏసీపీ తుల శ్రీనివాస్ రావు తదితరులు సందర్శించిన వారిలో ఉన్నారు.

ఈ సందర్భంగా భారత రాజ్యాంగ విధివిధానాలు, దేశంలో ప్రతీ పౌరుల విధులు, ఆర్టికల్ -51, ప్రాథమిక కర్తవ్యాలు, దేశ ప్రయోజనాల దృష్ట్యా పోలీసు కమిషనర్ ఆధ్వర్యంలో భారతీయ పౌర విధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి కరపత్రాలను విడుదల చేశారు. భారతీయ న్యాయవ్యవస్థను ప్రోత్సహించడానికి వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించినందుకు జడ్జి గణేష్ బృందం సభ్యులను కమిషనర్ అభినందించారు. న్యాయమూర్తుల నిరంతర సేవల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి పోలీసు కమిషనర్ అన్ని హైకోర్టు భవనాలు, ప్రధాన న్యాయమూర్తుల ఛాయాచిత్రాలను సందర్శించారు.



Next Story

Most Viewed