గ్రూప్ -1 మెయిన్స్‌లో మెరవండిలా..!

by Disha Web Desk 17 |
గ్రూప్ -1 మెయిన్స్‌లో మెరవండిలా..!
X

టీఎస్‌పీఎస్సీ గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షల తేదీలు కూడా వెల్లడయ్యాయి. ప్రిలిమ్స్ పాసైన అభ్యర్థులు మెయిన్స్ కు సిద్ధంగా ఉండటమే తరువాయి. ఈ నేపథ్యంలో ప్రిపరేషన్ వ్యూహాలు తెలుసుకుందాం..

సుదీర్ఘకాలం తర్వాత వచ్చిన గ్రూప్ -1 నోటిఫికేషన్ కాబట్టి ఈ సారి పోటీ తీవ్రంగానే ఉండే అవకాశం ఉంది. ఈ సారి గ్రూప్ -1 మెయిన్స్ సిలబస్ పరిశీలిస్తే విస్తృతంగా ఉంది. మెరిట్‌ను పరిగణించే 6 కంపల్సరీ పేపర్లతోపాటు ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ కలిపి మొత్తం 7 పేపర్లను వర్ణనాత్మక పద్ధతిలో రాయవలసి ఉంటుంది. ఈ సారి మెయిన్స్ ప్రశ్నలు కూడా ప్రిలిమ్స్ తరహాలో సివిల్స్ ప్రశ్నల వలే అడిగే అవకాశం ఉంది. గతంలో గ్రూప్ -1 సిలబస్ హెడ్డింగ్స్‌ను నేర్చుకుంటే సరిపోయేది. మారిన పరిస్థితుల దృష్ట్యా సిలబస్ లోని ప్రతి అంశంపైనా సూక్ష్మ, స్థూల దృష్టితో ప్రిపరేషన్ చేయాలి. ప్రతి అంశానికి కరెంట్ అఫైర్స్ జోడించాలి. అనువర్తనాలు, విశ్లేషణ సామర్థ్యం గల అభ్యర్థులకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. ప్రతి అంశంపై స్థూలంగా ప్రశ్న అడిగినా లేదా సబ్ టాపిక్ పై ప్రశ్న అడిగినా రాసే విధంగా 360 డిగ్రీల కోణంలో ప్రిపరేషన్ చేయాల్సి ఉంటుంది. వ్యాసరూపంలో వర్ణనాత్మకంగా రాసే మెయిన్స్ లో విజయం సాధించాలంటే..వ్యూహాత్మకంగా ప్రిపరేషన్ చేయవలసిందే..

పేపర్ - 1 ఎస్సే:

దీనిలో 3 సెక్షన్లు కలవు ఒక్కొక్క సెక్షన్ నుండి ఒక వ్యాసం చొప్పున మొత్తం వ్యాసాలు 3 గంటల సమయంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒక్కో సెక్షన్ లో ఇచ్చిన 3 ప్రశ్నల నుండి ఒక దానిని తప్పనిసరి రాయవలసి ఉంటుంది. అంటే ఒక్కొక్క వ్యాసానికి 1 గంట సమయం అనుకుంటే మొదటి 5 నిమిషాల్లో రఫ్ గా స్కెలిటిన్ తయారు చేసుకుని ..మిగిలిన 55 నిమిషాల్లో ఉపోద్ఘాతం జాగ్రత్తగా ఆలోచించి 2 లేదా 3 నిమిషాల్లో పూర్తి చేయాలి. అదేవిధంగా చివరి 2 లేదా 3 నిమిషాలు ముగింపుగా కేటాయించుకోవాలి. వ్యాసంలో 1000 పదాల వరకు రాసే అవకాశం ఉంది. కావున వేగంగా ఎక్కువ సమాచారం రాసేవారికి కొంత మెరుగైన అవకాశాలుంటాయి.

ఎస్సే పేపర్ లో విషయ పరిజ్ఞానం ఎంత ముఖ్యమో దానిని రాసే విధానం అంతే ముఖ్యం. వ్యాసాన్ని చిన్న చిన్న పేరాలలో ఒక దానికొకటి అనుసంధానిస్తూ రాయడం అవసరం. ఉపోద్ఘాతం చదవగానే ఆకర్షణీయంగా ఆహ్లాదం కలిగే విధంగా ఉండాలి. దీనిని ఏదైనా కొటేషన్ లో లేదా ప్రముఖుల వ్యాఖ్యలతో ప్రారంభించి, తర్వాత పేరాలో వ్యాసంలో ఏవి రాయబోతున్నామో దాని సారాంశంను తెలపాలి. ఒక పేరాకు మరొక పేరాకు మధ్య పూల దండలో పూలను దారం కలిపే విధంగా అభ్యర్థి సునిశిత పరిశీలనా దృష్టిని కేంద్రీకరించాలి.

ఇచ్చిన ప్రశ్నలను సరిగా అర్థం చేసుకుని, అభ్యర్థి నుండి ఏమి ఆశిస్తుందో గమనించి ఆ అంశంపై 360 డిగ్రీల కోణంలో చర్చించి చక్కని పరిష్కారంతో ముగింపు పలకాలి. వ్యాసంలో అభ్యర్థులు ముఖ్యంగా గమనించాల్సిన అంశాలు.. విషయ స్పష్టత, సరైన భాషను ఉపయోగించుట.. అవసరమైన మేరకే గణాంకాలు ఇవ్వడం, విశ్లేషణా సామర్థ్యాలు, తార్కిక ఆలోచనతో సమాధానం పొందుపరిచే తీరు..తగిన ఉదాహరణలు, వాస్తవ దృక్పథంతో రాయడం, భావవ్యక్తీకరణ చాలా ముఖ్యం. వీటితో పాటు అతిశయోక్తులు, తప్పుడు గణాంకాలు, నిరాశావాదం.. విప్లవ తీవ్రవాద భావాలు లేకుండా రాయాలి.

సెక్షన్ -1లో సామాజిక అంశాలు, ఆర్థిక వృద్ధి న్యాయ అంశాలు ఉన్నాయి. దీనికి ఎకానమీ, కరెంట్ అఫైర్స్‌తో సరైన మార్గంలో ప్రిపేరయిన వారు సులభంగా వ్యాసం వ్రాయవచ్చు.

సెక్షన్ -2లో భారత రాజకీయ పరిణామాలు, భారతదేశ చారిత్రక వారసత్వ సంస్కృతి అంశాలు కలవు. పేపర్ -2 చరిత్ర, పేపర్ 3 పాలిటీ క్షుణ్ణంగా ప్రిపేరైన వారు ఈ వ్యాసంను సులభంగా గట్టెక్కవచ్చు.

సెక్షన్ - 3లో శాస్త్ర సాంకేతిక అంశాల్లో వస్తున్న పరిణామాలు, నూతన అంశం విద్య, మానవ వనరుల అభివృద్ధి కలవు. సైన్స్ అభ్యర్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాన్ని, ఆర్ట్స్ అభ్యర్థులు విద్య, మానవ వనరుల అభివృద్ధి అంశాన్ని ఎంపిక చేసుకొని సంబంధిత వ్యాసం రాయడం ఉత్తమం.

ఒత్తిడి లేకుండా రాయాలి :

మిగతా పేపర్లలో (పేపర్ 2,3,4,5,6) ఒక్క డేటా ఇంటర్ప్రిటేషన్ తప్పించి, ప్రతి పేపర్లో 3 సెక్షన్లు, సెక్షన్ లో మొదటి రెండు ప్రశ్నలకు ఛాయిస్ లేదు. తర్వాత మూడు ప్రశ్నలకు ఇంటర్నల్ చాయిస్ ఇచ్చారు. ప్రతి ప్రశ్నకు 12 నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది. ప్రశ్నను జాగ్రత్తగా చదివి సమాధానాన్ని మైండ్ మ్యాపింగ్ చేసుకోవడం 1 నిమిషంలోనే జరగాలి.

ప్రశ్నలో వివరించండి?, చర్చించండి?, వ్యాఖ్యానించండి? విమర్శనాత్మకంగా రాయండి? వంటి ప్రశ్నల ట్యాగులను జాగ్రత్తగా అర్థం చేసుకుని సమాధానం రాయాలి. ఇవి 10 మార్కుల ప్రశ్నలు కాబట్టి విషయ పరిజ్ఞానానికే అధిక ప్రాధాన్యత. వ్యాసంలో భావ వ్యక్తీకరణకు అంతగా ప్రాధాన్యత ఉండదు. సమాధానాలు అన్ని ప్రశ్నలకూ రాసే సందర్భంలో అభ్యర్థుల్లో ఒత్తిడి పెరిగి రైటింగ్ దెబ్బతినకుండా చూసుకోవాలి.

సమాధానాలు చిన్న చిన్న పేరాలు లేదా పాయింట్ల రూపంలో రాయాలి. ఉపోద్ఘాతాలు, పరిచయాలు ముగింపులకు అంతగా ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం లేదు. అవసరమైన చోట పటాలు, గ్రాఫ్ లు, వృత్తాలు, పట్టికల రూపంలో ఎక్కువ సమాచారాన్ని తక్కువ సమయంలో తక్కువ ప్రదేశంలో చక్కగా తెలియజేయవచ్చు. ఈసారి పదాల పరిమితి 200 వరకు పెంచడం వల్ల ఎక్కువ సమాచారం ఇచ్చే అభ్యర్థులకు ఖచ్చితంగా అనుకూల ఫలితాలుంటాయి. చాయిస్ లేని మొదటి 1,2 ప్రశ్నలు మొదటి రెండు చాప్టర్ల నుండి ఇస్తారా లేదా మొత్తం సెక్షన్ నుండి ఇస్తారా అనే విషయంలో స్పష్టత లేదు.

పేపర్ - 2: చరిత్ర ప్రిపేరయ్యే టప్పుడు సిలబస్ లో సామాజిక సాంస్కృతిక అంశాలకే ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యమైన సంఘటనలు యుద్ధాల వంటి వాటిని సంవత్సరాలను తెలియజేయడం అవసరం.

తెలంగాణ చరిత్ర చదివేటప్పుడు 6వ పేపర్‌లోని తెలంగాణ ఉద్యమ చరిత్ర కలిపి చదువుకోవడం, ఉమ్మడి అంశాలపై స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. జాగ్రఫీలో మొదటి రెండు యూనిట్లలో ఇండియన్ జాగ్రఫీ విస్తృత సిలబస్‌ను పొందుపరచుట వలన అభ్యర్థులు ప్రత్యేక దృష్టి పెట్టవలసి ఉంటుంది. తెలంగాణ జాగ్రఫీ అంశాలను చదివేటప్పుడు తెలంగాణ ఎకానమీను అనుసంధానం చేస్తూ చదవడం వల్ల ఉమ్మడి అంశాలపై సులభంగా పట్టు సాధించవచ్చు.

పేపర్ -3: సోషియాలజీ అంశాలను రాసేటప్పుడు నిర్వచనాలు ప్రముఖ సోషియాలజిస్టుల వ్యాఖ్యలను ప్రస్తావించుట వల్ల మార్కులు పెరుగుతాయి. పాలిటీలో ఆర్టికల్స్, కోర్టు తీర్పులను కరెంట్ అఫైర్స్ ను సందర్భానుసారంగా రాయడం వల్ల గరిష్ట ప్రయోజనం పొందవచ్చు. గవర్నెన్స్ తో సమాధానాలు రాసేటప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఆ స్థానంలో మనం ఎంత విశ్లేషణాత్మకంగా ఆలోచిస్తామో తెలియజేస్తూ సమాధానం రాస్తే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

పేపర్ -4: ఎకానమీలో సమాధానాలు రాసేటప్పుడు తగిన గణాంకాలు ముఖ్యం ఇండియా, తెలంగాణ ఆర్థిక సర్వేలు విడుదల చేయు అంశాలను జోడించి సమాధానం రాస్తే మెరుగైన మార్కులు వస్తాయి. పర్యావరణం అభివృద్ధికి సంబంధించి వాతావరణ మార్పులకు సంబంధించి యూఎన్ఓ, ఇతర అంతర్జాతీయ సంస్థలు చేపడుతున్న చర్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి.

పేపర్ - 5: లో సైన్స్ అండ్ టెక్నాలజీ సమాధానాలు రాసేటప్పుడు కరెంట్ అఫైర్స్ ను జోడిస్తూ, సరైన ఉదాహరణలను పేర్కొంటూ సాంకేతిక పదాలను జాగ్రత్తగా వాడాలి. ఈ పేపర్ మంచి స్కోరింగ్ పేపర్ కనుక, ప్రశ్నలు సివిల్స్ తరహాలో అప్లికేషన్ (అనువర్తనం) తరహాలో అడిగే అవకాశం ఉంది.

ఆర్ట్స్ అభ్యర్థులు దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ లో మూల అంశాల కంటే అనువర్తనాల పైనే ఎక్కువగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది.

టీఎస్‌పీఎస్సీ విడుదల చేసిన నూతన నమూనా ప్రశ్నావళి ప్రకారం డేటా ఇంటర్ప్రిటేషన్ సెక్షన్ లో 1 గంటలో 25 ప్రశ్నలను రాయాల్సి ఉంది. అయితే ఇచ్చే 30 ప్రశ్నలు సెక్షన్ లోని 5 చాప్టర్ల నుండి 6 చొప్పున ఇచ్చే అవకాశం ఉంది. దీనిపై కూడా స్పష్టత లేదు కనుక అభ్యర్థులు అన్ని అంశాలను క్షుణ్ణంగా ప్రిపేరవడం మేలు.

రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి:

1 గంటలో 25 ప్రశ్నలు అంటే ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం 2.4 నిమిషాలలో పూర్తి చేయాలి. ఎంత వేగంగా అభ్యర్థి స్పందిస్తాడో అనే దానిని బట్టి మార్కులు ఆధారపడి ఉంటాయి. స్టెప్స్ కు అంతగా ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం లేదు. కొంచెం కష్టపడితే ఈ సెక్షన్ లో గరిష్ట మార్కులు పొందవచ్చు. పరీక్ష జూన్ లో జరిగే అవకాశం ఉంది. కావున వచ్చే 4 నెలల్లో అన్ని పేపర్లకు కలిపి రోజూవారి టైం టేబుల్ వేసుకోవాలి. జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే కావున తెలుగు మీడియం అభ్యర్థులు కొంత సమయం వెచ్చిస్తే సరిపోతుంది.

చివరిగా అభ్యర్థులు పాటించాల్సిన అంశాల్లో ముఖ్యమైనవి.. సొంత నోట్స్ చాలా ప్రభావం చూపిస్తుంది. లేకుంటే మార్కెట్లో రెడీమేడ్ నోట్సు చదవవచ్చు. నోట్స్ తయారీ కష్టమనుకునే వారు ప్రతి అంశంపై కొన్ని ముఖ్యమైన పదాలుతో సినాప్సిస్ తయారు చేసుకుంటే పరీక్ష ముందు రివిజన్ చక్కగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ 1 లేదా 2 గంటలు రైటింగ్ ప్రాక్టీస్ చేయడం తప్పనిసరి అదేవిధంగా 1 లేదా 2 గంటలు రైటింగ్ ప్రాక్టీస్ చేయడం తప్పనిసరి అదే విధంగా రోజు గంటల తరబడి టెస్ట్ సిరీస్ లు..రాస్తూ పోతే ప్రిపరేషన్ భారమై లాభం కంటే నష్టం కలిగే అవకాశం ఉంది.

డైలీ టెస్టుల కంటే వారానికి ఒకటి లేదా 2 టెస్టులు రాయడం మంచిది. ప్రతి అంశానికి సంబంధించి విశ్లేషిస్తూ చదవడంతో పాటు చక్కని విశ్లేషణతో రాయడం అనేది అతి ముఖ్యమైంది. సొంతనోట్సా, రెడీమేడ్ నోట్సా, అకాడమీ పుస్తకమా ప్రైవేట్ పుస్తకమా, ఇంటర్ నెట్ సమాచారమా అనేది ముఖ్యం కాదు. ప్రతి అంశం పైన ఎంత అవగాహన పెంచుకొన్నాం..దానిని ప్రశ్నల రూపంలో ఊహించుకొని ఏ విధమైన విశ్లేషణతో సమాధానం రాస్తే మంచి మార్కులు వస్తాయో అనే టెక్నిక్ తెలిస్తే విజయం మీదే...

- చావా. వెంకటేశ్వర్లు.

గ్రూప్ - 1 విజేత, మెంటార్


Next Story

Most Viewed