తెలంగాణ కోణంలో జేఎల్ తెలుగు ప్రిపరేషన్ ప్లాన్

by Disha Web Desk 17 |
తెలంగాణ కోణంలో జేఎల్ తెలుగు ప్రిపరేషన్ ప్లాన్
X

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జూనియర్ లెక్చరర్ (తెలుగు) సబ్జెక్టు మొదటి సారిగా పరీక్ష నిర్వహిస్తున్నారు. గతంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఒకసారి పరీక్ష నిర్వహించినప్పటికీ అది గురుకులాలకు సంబంధించినది. అయితే గురుకులాలు కాకుండా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో లెక్చరర్ ఉద్యోగాలకి నిర్వహించే.. తెలుగు సబ్జెక్టులో ఏ అంశాలపై దృష్టి సారిస్తే మంచిదో చూద్దాం..

సిలబస్ ప్రకారం మొత్తం పేపర్ ను 7 రకాలుగా విభజించుకోవచ్చు.

1. సంప్రదాయ సాహిత్య కవుల అధ్యయనం - కాలం - రచనలు

2. సాహిత్య ధోరణుల అధ్యయనం

3. జానపద విజ్ఞానం

4. ఆధునిక కవుల అధ్యయనం

5. తెలుగు వ్యాకరణం, ఛందస్సు అధ్యయనం.

6. భాషా విజ్ఞాన అధ్యయనం

7. తెలుగు సాహిత్య పరిణామం.

సంప్రదాయ సాహిత్య కవుల అధ్యయనం - కాలం రచనలు:

ఈ అంశం కింద సంప్రదాయ సాహిత్య కవుల అధ్యయనాలను పరిశీలించాల్సి ఉంటుంది. అయితే ఈ సంప్రదాయ కవులు తెలంగాణ ప్రాంతానికి చేసిన కృషిని పరిశీలించి చదవాలి. తెలంగాణ నేలపై క్రీ.శ 6వ శతాబ్దం తర్వాత తెలుగు భాషా సాహిత్య ప్రక్రియలకు మొగ్గలు తొడగడం ప్రారంభమైంది.

ముఖ్యంగా తెలంగాణ నేల తెలుగు భాషకు పుట్టినిల్లు. తెలుగు సంప్రదాయ సాహిత్య ప్రక్రియ ఈ నేలపైనే మొదట ప్రారంభమైంది కానీ ఉమ్మడి ఏపీలో అంత ప్రాచుర్యానికి నోచుకోలేదు. కారణం ఈ నేలపై 15వ శతాబ్దపు కాలంలో పర్షియన్, ఉర్దూ, అరబిక్ భాష ప్రభావం ఉండటమే.

తెలంగాణ నేలపై సంప్రదాయ సాహిత్య ప్రక్రియకు మూలం అయిన తిక్కన, ఎర్రన, శివకవుల మీద ఎక్కువగా దృష్టి సారించాలి. ఎందుకంటే ప్రస్తుత భౌగోళిక తెలంగాణ రాష్ట్రంపై శివకవుల ప్రభావం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా పాల్కురికి సోమనాథుడు, మల్లికార్జున పండితారాధ్యుడు, నన్నెచోడుడు మొదలైనవారు.

పాల్కురికి సోమనాథుని సాహిత్య ప్రక్రియ, రచనలపై ఎక్కువగా దృష్టి పెడితే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ నేలపై పుట్టి ఇక్కడి సాహిత్య ప్రక్రియను విశ్వవ్యాప్తం చేసిన పోతనామాత్యుడు చాలా గొప్పవాడు. కానీ కాలక్రమంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రాధాన్యతను నోచుకోలేక పోయాడు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోతన రచనలకు, సాహిత్య ప్రక్రియకు ఇంకా ప్రాధాన్యత ఎక్కువగా పెరిగింది.

తెలంగాణ నేలపై సాహిత్య ప్రక్రియను విస్తృతం చేసిన ప్రధాన కవులైన పోతన, పిల్లలమర్రి పినవీరభద్రుడు, కొరవి గోపరాజు, పొన్నగంటి తెలగన్న, కందుకూరి రుద్రకవి, మడికి సింగన్న మొదలగు వారి రచనలు, రచనాకాలం, ఏ రాజవంశంలో కవులుగా ఉన్నారు. ఏ రాజుల వద్ద ఆస్థాన కవులు గా ఉన్నారు. ఎవరికి అంకితం చేశారు, మొదలగు అంశాలపై లోతుగా చదవాలి.

సాహిత్య ధోరణుల అధ్యయనం:

ఈ అధ్యయనం సాహిత్య ధోరణులను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ నేలపై ఎక్కువగా ప్రభావితం చేసిన శతకం, సంకీర్తన సాహిత్యంపై దృష్టి పెట్టాలి. దాశరథి శతకం, కంచెర్ల గోపన్న సంకీర్తన సాహిత్యాన్ని క్షుణ్ణంగా చదవవలసి ఉంటుంది. ఎందుకంటే వీరి రచనలలో అప్పటి సమకాలీన పరిపాలన విధానం, వాటి తీరు, ప్రజల జీవన విధానం మొదలగునవి చాలా స్పష్టంగా మనకు గోచరిస్తాయి.

తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఆ రోజు సమకాలీన అంశాలపై వచ్చిన వివిధ నవలలను, కథానికలను కూడా చదవాలి. అయితే ఆ కథానికలలో ఉండే అంశం అప్పటి పరిస్థితులను స్పష్టంగా మనకు కళ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేసిన రచనలను సంపూర్ణంగా తెలుసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది.

సాహిత్య ధోరణుల అధ్యయనంలో వివిధ వాదాలు కూడా చాలా ముఖ్యమైనవి వాటిలో దళిత వాదం పేరెన్నిక గలది. తెలంగాణ ప్రాంతంలో దళిత వాదం మీద కూడా చాలా రచనలు వచ్చాయి. గురజాడ రచనలు దళిత వాదానికి గొప్పవే, కాని అవి ఉమ్మడి రాష్ట్రంలో ప్రాధాన్యతను నోచుకోలేదు. కాబట్టి వీటి మీద బాగా దృష్టి పెట్టి ప్రిపేర్ అయితే మంచిది.

అంతేకాకుండా స్త్రీవాద రచనలు, ప్రాంతీయ రచనలు ఇవి కూడా ఈ మధ్యకాలంలో చాలా విస్తృతంగా రావడం జరిగింది. కాబట్టి వాటి సారాంశాన్ని అర్థం చేసుకోవలసి ఉంటుంది.

వివిధ చారిత్రక కావ్యాలలో ఉండే రచనలపై కూడా దృష్టి సారించాలి. ఎందుకంటే తెలంగాణ నేలపై విదేశీయుల ప్రభావంతో కూడిన రచనలు బాగానే ఉన్నాయి. ఈ చారిత్రక కావ్యాలు ఎవరి కాలంలో వచ్చాయి. అప్పటి సామాజిక పరిస్థితులు ఏమిటి అనే కోణంలో చదవవలసి ఉంటుంది.

జానపద విజ్ఞానం:

తెలంగాణ నేల జానపద విజ్ఞానానికి ప్రసిద్ధి. ఈ నేలపై ఎన్నో జానపద విజ్ఞానం విలసిల్లింది. తెలంగాణ సామెతలు, పొడపుకథల్లో తెలంగాణ భాష అట్లే ఉట్టిపడుతుంది. తెలంగాణ నేలపై సంస్కృత భాష ప్రభావం చాలా తక్కువగా ఉంది. తెలంగాణ సామెతలు, పొడుపు కథల్లో పార్శి, అరబిక్ ఉర్దూ పదాల ప్రభావం చాలా స్పష్టంగా కనబడుతుంది. కొన్ని పార్శి, అరబిక్, ఉర్దూ పదాలు తెలంగాణ భాషలో ఇమిడిపోయాయి. అవి ఎంతగా ఇమిడి పోయాయంటే ఇది ఉర్దు పదం అంటే ఆశ్చర్య పోవలసిన అంశం వచ్చింది.

జానపద కళల్లో నాటకాలు, యక్షగానాలు, బొమ్మలాటలు, చిందు, ఒగ్గు, జాతర, పగటి వేషాలు. ఇవి లేకుండా తెలంగాణ సమాజాన్ని అర్థం చేసుకోవడం కష్టం. ఇవి తెలంగాణ అస్థిత్వాన్ని తెలియ పరుస్తున్నాయి. కాబట్టి వీటి మీద బాగా దృష్టి పెట్టి చదవాలి.

ఆధునిక కవుల అధ్యయనం:

ఆధునిక కవుల్లో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన కవులపై దృష్టి పెడితే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఆధునిక కవులలో కాళోజీ, దాశరథి, సి.నారాయణరెడ్డి, విప్లవ, అభ్యుదయ కవులపై ముఖ్యంగా దృష్టి సారించాలి.

తెలుగు వ్యాకరణ, ఛందస్సు అధ్యయనం:

ఈ అధ్యయనం ముఖ్యంగా వ్యాకరణ, ఛందస్సుకు సంబంధించినది. ప్రాథమిక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా భౌగోళిక విభజన, మాండలికాలపై దృష్టి పెట్టాలి.

భాషా విజ్ఞాన అధ్యయనం:

తెలంగాణ భాషా శాస్త్రంపై ముఖ్యంగా, శాసన భాషపై తెలుగు భాష ప్రభావం, సాహిత్య భాష పై వివిధ భాషల ప్రభావాన్ని లోతుగా చదవాలి. వ్యవహారిక భాష ఉద్యమం వల్ల తెలంగాణ ప్రాంతానికి చేగూరిన ఉపయోగాలను కూడా చదవాలి.

తెలుగు సాహిత్య పరిణామం:

తెలుగు సాహిత్య పరిణామం ఏ విధంగా మారుతూ వచ్చింది. తర్వాత కాలంలో ఏ విధమైన ప్రభావాన్ని చూపించింది, ముఖ్యంగా సంస్కృత భాష ప్రభావం ఏవిధంగా ఉంది అనే కోణం చదవవలసి ఉంటుంది.

- పృథ్వీ కుమార్ చౌహాన్, డైరెక్టర్..పృథ్వీ ఐఏఎస్ స్టడీ సర్కిల్.

Next Story