ఫారెస్ట్ అధికారులపై జూలకంటి ఫైర్

by  |
Jhulakanti Rangareddy
X

దిశ, దామరచర్ల: నాగార్జున సాగర్ ముంపు బాధితులకు, ఆదివాసీ రైతులకు పోడు భూముల పట్టాలివ్వాలని, రైతు బంధు, రైతు బీమా, బ్యాంకు రుణ సౌకర్యం కల్పించి వారిని ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం మండల పరిధిలోని గాంధీనగర్‌లో నాగార్జున సాగర్ ముంపు బాధితులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి ఏడేళ్లు గడుస్తున్నా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని విమర్శించారు. సాగర్ ముంపు బాధితులకు వెంటనే పట్టాలివ్వాలని, పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులపై ఫారెస్ట్ అధికారుల దాడులు నియంత్రించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోడు భూములను సాగు చేయనీయకుండా అటవీ అధికారులు అడ్డుకోవడం వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందని ఆరోపించారు.

పొడు భూములను లాక్కొని కార్పొరేట్లకు అప్పగించడం, ప్రభుత్వ భవనాలు నిర్మించే కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. అందులో భాగంగానే పోడు రైతులపై అక్రమంగా కేసులు బనాయించి భయబ్రాంతులను చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులపై పెట్టిన కేసులను ఎత్తేసి రైతుబంధు, రుణాల సౌకర్యం కల్పించాలన్నారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా గిరిజనులు, పేదలకు అన్యాయం చేస్తుందని దుయ్యబట్టారు.15 ఏండ్లుగా పట్టాల కోసం ఆందోళన చేస్తున్నా పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. హక్కు పత్రాలు లేక పోవడం వల్ల రైతుబంధు,రైతు భీమా,బ్యాంకు రుణాలు అందక రైతులు నష్టపోతున్నారన్నారు.

ప్రభుత్వానికి పోడు రైతుల గోడును విన్పించేందుకు… పోడు రైతుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 5న చేపట్టిన సడక్‌ బంద్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వీరేపల్లి వెంకటేశ్వర్లు, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రవి నాయక్, సీపీఎం మండల కార్యదర్శి మాలోతు వినోద్ నాయక్, సీఐటీయూ మండల కార్యదర్శి బైరం దయానంద్, గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు సపావట్ పాపా నాయక్, గిరిజన సంఘం మండల అధ్యక్షుడు భూక్య విజయ్ నాయక్, డీవైఎఫ్ఐ రాష్ట్ర నాయకులు పి.శ్రీను, నాయకులు దుర్గయ్య, అంజయ్య, వెంకటయ్య, ప్రసాద్, రాజు తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed