తిరిగి కార్యకలాపాలు ప్రారంభించనున్న జెట్ ఎయిర్‌వేస్!

by  |
Jet Airways
X

దిశ, వెబ్‌డెస్క్: రుణ భారంతో మూతపడిన ప్రముఖ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ తిరిగి కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. 2022 మొదటి త్రైమాసికంలో సంస్థ తన విమానాలను మళ్లీ గాల్లో ఎగురుతాయని జలాన్‌ కల్‌రాక్‌ కన్సార్షియం సోమవారం ప్రకటించింది. మొదటి విమానం న్యూఢిల్లీ నుంచి ముంబై మధ్య ప్రయాణిస్తుందని, తద్వారా దేశీయంగా కార్యకలాపాలను పునరుద్ధరించనున్నట్టు జెట్ ఎయిర్‌వేర్ వెల్లడించింది. అంతేకాకుండా వచ్చే ఏడాది ద్వితీయార్థం సమయానికి అంతర్జాతీయ మార్గంలో సైతం విమాన కార్యకలాపాలు పనిచేయనున్నట్టు తెలిపింది.

బిడ్డింగ్ రూపంలో జెట్ ఎయిర్‌వేస్‌ను జలాన్ కల్‌రాక్ కన్సార్టియం దాఖలు చేసిన రుణ పరిష్కార ప్రణాళికకు ఎన్‌సీఎల్‌టీ ఈ ఏడాది జూన్‌లో ఆమోదం తెలిపింది. ఈ ప్రక్రియ అనంతరం జెట్ ఎయిర్‌వేర్ కార్యకలాపాల పునరుద్ధరణను కన్సార్టియం వేగవంతం చేసింది. ‘వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో దేశీయంగానూ, రెండు లేదంటే మూడో త్రైమాసికంలో పరిమితంగానైనా అంతర్జాతీయ కార్యకలాపాలను ప్రారంభించాలని లక్ష్యంగా ఉన్నామని’ కన్సార్టియం ప్రధాన సభ్యుడు, జెట్ ఎయిర్‌వేస్ నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ మురారి లాల్ జలాన్ చెప్పారు. రానున్న మూడేళ్లలో 50కి పైగా విమానాలు, ఐదేళ్లలో 100కు పైగా విమాన సర్వీసులను అందించాలని లక్ష్యంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు.

విమానయాన చరిత్రలో రెండేళ్లకు పైగా మూతపడిన, తిరిగి ప్రారంభించడం ఇదే తొలిసారి అని జలాన్ అన్నారు. జెట్ ఎయిర్‌వేస్ బిడ్డింగ్ ద్వారా పొందించ కన్సార్టియం ఐదేళ్లలో రూ. 12 వేల కోట్లను చెల్లించనుంది. దీనికి జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) ఆమోదించింది. కార్యకలాపాల పునరుద్ధరణ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంస్థ వెయ్యి మందికి పైగా ఉద్యోగులను ఆన్-బోర్డ్ చేయాలని భావిస్తోంది. ఈ నియామకాలు దశలవారీగా ఉంటాయని వెల్లడించింది.


Next Story