టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం .. ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు..   

by  |
టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం .. ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు..   
X

దిశ, నారాయణపేట: రాష్ట్రంలోని రైతుల ఉసురు తగిలి అధికార టీఆర్ఎస్ పార్టీ కూలిపోతుందని మాజీ మంత్రి, బీజేపీ జాతీయ నాయకులు, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నారాయణపేట జిల్లా కేంద్రం సింగార్ బేస్ వీధిలో గల శిశు మందిర్ ఉన్నత పాఠశాల ఆవరణలోని వాల్మీకి మంటపంలో జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు రోజుల శిక్షణ తరగతులను సోమవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. సీ.ఎం కే.సీ.ఆర్ రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండి పడ్డారు.

కేంద్ర ప్రభుత్వం రా రైస్ ను ఎంత అయినా తీసుకుంటామని అంటున్న.. చెవిలో వేసుకోకుండా వరి కొనవద్దని, వరి వేయొద్దని అధికారులను రైతులపైకి ఉసిగొల్పి వారిని ఆందోళనకు గురి చేస్తూ వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. ప్రభుత్వ తీరుతో రైతులు ఆందోళన చెంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందుకు కే.సీ.ఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కోటి టన్నుల బియ్యం మిల్లింగ్ చేసే టెక్నాలజీ కలిగిన రైస్ మిల్లులు ఈ రాష్ట్రంలో లేవన్నారు. ఇది వరకే మిల్లర్లు కొత్త టెక్నాలజీ మిల్లులు వేస్తామని ప్రభుత్వం సహకరించాలని మిల్లర్లు కోరితే సీఎం పట్టించుకోలేదన్నారు. అప్పుడే సహకరించి ఉంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదన్నారు. జిల్లాకు ఒక కొత్త టెక్నాలజీ కలిగిన రైస్ మిల్లు నడిపిస్తే బిల్డింగ్ వ్యవస్థ మెరుగుపడుతుందని ఈటెల చెప్పారు.

ఇప్పటికైనా మించిపోయింది లేదని ఉప్పుడు బియ్యం నూకల భారం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే సమస్య తీరుతుందన్నారు. రైతుల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పుకునే ఈ ప్రభుత్వం నూకల భారం కోసం 2, 3 వందల కోట్లు ఖర్చు చేయ లేదా అని ప్రశ్నించారు. వరి కొనుగోలు విషయంలో కేంద్రం పై నెపం నెట్టి సీఎం కేసీఆర్ తప్పించుకోవాలని చూస్తున్నారన్నారు. వరిని కేంద్రం కొనుగోలు చేయాలని చెబుతున్న కేసీఆర్ రాష్ట్రంలో తాను అమలు చేస్తున్న రైతుబంధు రైతు బీమా కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వివిధ రకాల పెన్షన్లు, ఉచిత కరెంటు పథకాలను కేంద్రానికి చెప్పే అమలు చేస్తున్నారు అని సీఎం కేసీఆర్ సూటిగా ప్రశ్నించారు.

ఇప్పటికైనా సీఎం కేసీఆర్ తనకే అన్నీ తెలుసు అనే ధోరణి మానుకొని, ప్రతిపక్షాలపై విమర్శలు చేయడాన్ని ఆపి, రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వీలైనంత తొందరలో పరిష్కరించే దిశగా తన పరిపాలన కొనసాగించాలని ఈటల రాజేందర్ ఈ సందర్భంగా సిఎంను కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు నాగూరావు నామాజీ, బి.కొండయ్య, జిల్లా ఇంచార్జ్ కాంతారావు, జిల్లా బీజేపీ అధ్యక్షుడు పగుడాకుల శ్రీనివాసులు, జిల్లా నాయకులు ప్రభాకర్ వర్ధన్, ఉట్కూర్ భాస్కర్, కెంచే శీను, రఘువీర్ యాదవ్, నందు నామాజీ, సత్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed