కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేసిన ఈటల.. కేసీఆర్‌కు అది కనబడటంలేదా అంటూ ఫైర్

117
etala

దిశ, పరకాల: అకాల వర్షం మూలంగా పరకాల ప్రాంతంలో పంటలు దెబ్బతిని రైతులు గోడుగోడున విలపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కనబడడం లేదా అంటూ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం పరకాల, నడికూడ మండలాలకు చెందిన నడికూడ, పులిగిల్ల, రాయపర్తి, మలకపేట, నర్సక్కపల్లి గ్రామాల్లో వడగండ్ల వానకు నష్టపోయిన మిర్చి, మొక్కజొన్న ఇతర కూరగాయల పంటలను బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి పంట నష్టానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏ పంట పొలం చూసిన పూర్తిస్థాయిలో ధ్వంసమై పోయిందని.. రైతులు అప్పు చేసి లక్షలాది రూపాయలు పెట్టుబడిగా పెడితే పంట చేతికొచ్చే దశలో వడగండ్ల వాన మూలంగా మట్టి పాలుకావడం ఆవేదన కలిగించిందన్నారు. పంటలు నష్టపోయిన రైతులు మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉందని వారికి భరోసా కల్పించడానికే రైతుల వద్దకు రావడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వ్యవసాయ శాఖ, హార్టికల్చర్, రెవెన్యూ అధికారులతో కలిసి సర్వే జరిపించి ఒక ఎకరానికి మొక్కజొన్న ఇతర పంటలకు 50,000 రూపాయలు, మిర్చి పంటకు లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ విపత్కర పరిస్థితులలో రైతులు ఫసల్ బీమా యోజన చేసి ఉంటే రైతులకు సరైన న్యాయం జరిగేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పేరుతో ఫసలు బీమాను నిర్లక్ష్యం చేయడం మూలంగానే ఈ విపత్కర పరిస్థితుల్లో పంట నష్టం జరిగిన ఎలాంటి భీమా అందక తీవ్రంగా నష్టపోయారన్నారు. వడగండ్ల వానతో నష్టపోయి గత మూడు నాలుగు రోజులుగా రైతులు దిక్కుతోచని స్థితిలో కన్నీరుమున్నీరవుతున్నా ఎమ్మెల్యేలు మంత్రులు ఎక్కడ పోయారంటూ ధ్వజమెత్తారు. వారికి సొంత ప్రయోజనాల మినహా ప్రజల బాధలు పట్టవన్నారు.

ధర్మారెడ్డి కాదు అధర్మారెడ్డి.. గుజ్జల ప్రేమేందర్ రెడ్డి

గత మూడు నాలుగు రోజులుగా రైతులు పంట నష్టపోయి తీవ్ర ఇబ్బందులు పడుతూ కుటుంబాలతో కలిసి రోడ్లపై చేరి స్వచ్ఛందంగా నిరసనలు వ్యక్తం చేస్తుంటే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఎక్కడున్నారు అంటూ ప్రేమేందర్ రెడ్డి ప్రశ్నించారు. ధర్మా రెడ్డికి తల్లిదండ్రులు పెట్టిన పేరు పోయి అతడిని ఇప్పుడు ప్రజల అధర్మారెడ్డిగా పిలుస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనకు ఎంత సేపు సొంత ప్రయోజనం తప్ప ప్రజాప్రయోజనాలు పట్టవన్నారు. ఆయనకు నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే పంటచేలలో తిరిగి రైతులను ఓదార్చే వాడని అన్నారు. అదే ఇక్కడ కాంట్రాక్ట్లు, కమిషన్లు ఉంటే కచ్చితంగా ఎమ్మెల్యే ఊళ్లో తిరిగేవాడిని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మార్తినేని ధర్మారావు, దేవు సాంబయ్య, పరకాల మండల అధ్యక్షుడు బిక్షపతి, కాచం గురుప్రసాద్, కౌన్సిలర్లు ఆర్ పి జయంతి లాల్, పూర్ణ చారి, పార్టీ నాయకులు రవీందర్ జితేందర్ తదితరులు పాల్గొన్నారు.