ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీల‌కంగా ఐటీ ఓట్లు

by  |
Tita Global President Sandeep Makthala
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో జరుగనున్న రెండు ప‌ట్టభ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లోని ఉద్యోగులు కీల‌క పాత్ర పోషించ‌నున్నార‌ని తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ పేర్కొంది. రాష్ట్రంలోని దాదాపు 6 ల‌క్షల ఐటీ ఉద్యోగుల్లో 40శాతం పైచిలుకు తెలంగాణ వాసులే ఉన్నార‌ని, వీరంతా లాక్ డౌన్ స‌మ‌యంలో త‌మ ఓట్లను న‌మోదు చేసుకున్నారు. 14న జ‌ర‌గ‌నున్న పోలింగ్‌లో టెక్కీలు క్రియాశీలంగా పాల్గొని ప్రజాస్వామ్య ప్రక్రియ‌లో త‌మ భాగ‌స్వామ్యాన్ని పెంచుకోవాల‌ని టీటా గ్లోబ‌ల్ ప్రెసిడెంట్ సందీప్ మ‌క్తాల మంగళవారం పిలుపునిచ్చారు. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీలుగా గెలుపొందిన ప్రజాప్రతినిధులు టెక్కీల స‌మస్యల‌ను ప్రస్తావించాల‌ని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 2020 మార్చి 31 నాటికి 5,82,126 మంది ప్రత్యక్షంగా ఐటీ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ ఏడాది వారి సంఖ్య దాదాపు 6 ల‌క్షల‌కు చేరింద‌నే అంచనాలున్నాయి. వీరిలో 40శాతం పైగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారే. వీరి ఓట్లు విజేత‌ల‌ను నిర్ణయించ‌డంలో క్రియాశీల‌క శ‌క్తిగా మార‌నున్నాయ‌ని సందీప్ మక్తాల అన్నారు. ఈ ఎన్నికల్లో టెక్కీలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనాల‌ని ఆయన పిలుపునిచ్చారు. విద్యావంతులు ఈ ఎన్నిక అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలోని బీటెక్ స‌హా ఇత‌ర సాంకేతిక విద్యార్హత ఉత్తీర్ణులైన వారి ఆశ‌లు ఐటీ రంగంపైనే ఉన్నాయ‌న్నారు. వీరితో పాటుగా ఇప్పటికే ఐటీ రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వారు వివిధ స‌మ‌స్యలు ఎదుర్కొంటున్నార‌ని ప‌ట్టభ‌ద్రుల ఎమ్మెల్సీలుగా గెలుపొందిన వారు మండలిలో తమ ప్రస్తావించాల‌ని కోరారు. అంతేగాకుండా ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేసి, యువ‌త‌కు ఉద్యోగ ఉపాధి అవ‌కాశాలు కల్పించాలని సందీప్ తెలిపారు.

Next Story