‘టీ ఫ్రైడ్’ ఫెయిల్యూర్ పథకమేనా..?

by  |
Entrepreneurs
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి దోహదపడాలని, వారిని పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించాలని ప్రభుత్వం నవంబరు 2014లో ‘టీ ప్రైడ్’ పథకానికి అంకురార్పణ చేసింది. ఆ మరుసటి సంవత్సరం నుంచి దీన్ని అమలు చేయడం మొదలుపెట్టింది. ఏళ్లు గడుస్తున్నా దళిత, గిరిజనులకు మాత్రం అది అందని ద్రాక్షగానే మిగిలింది. వేలల్లో దరఖాస్తులు వస్తున్నా, వాటిని పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేసినా సబ్సిడీ రుణాల మంజూరు నామమాత్రంగానే ఉన్నది. ఆశతో ఎదురుచూసినవారికి నిరాశే ఎదురవుతున్నది. ఇప్పటివరకు ఈ పథకం కింద 51,390 మంది దరఖాస్తు చేసుకుంటే అందులో 36,584 మంది ఎంపికయ్యారు. చివరకు రుణాలు వచ్చింది మాత్రం 7,392 మందికి మాత్రమే.

షెడ్యూల్డ్‌ కులాలు, తెగలకు చెందిన యువతను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్టేట్‌ ప్రోగ్రాం ఫర్‌ ర్యాపిడ్‌ ఇంక్యుబేషన్‌ ఆఫ్‌ దళిత్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ (టీ-ప్రైడ్‌) పథకాన్ని 2014 నవంబర్ 29న ప్రారంభించింది. రాష్ట్ర ఇండస్ట్రీస్ డిపార్టుమెంటు ద్వారా ఈ పథకం అమలవుతున్నది. పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాలు చేపట్టే ఎస్సీ, ఎస్టీ యువతకు 35 శాతం సబ్సిడీని అందజేసేందుకు పథకానికి రూపకల్పన చేసింది. మూలధనంతోనే సమాజంలోని అంతరాలను రూపుమాపే అవకాశం ఉన్నదని, ఆ దిశగా సాధ్యమైనంత ఎక్కువ మంది దళిత, గిరిజన వర్గాల నుంచి యువకులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని భావించింది.

‘టీ-ప్రైడ్’ నిరాశావహులు

‘టీ-ప్రైడ్’ పథకం కింద లబ్ధి పొందడానికి ఔత్సాహికులు 2017 మొదలు 2021 డిసెంబర్ వరకు 51,390 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ ఐదేళ్లలో 36,854 మంది ఎంపికయ్యారు. అందులో 11,372 మంది వివిధ కారణాలతో అర్హత సాధించలేకపోయారు. ఇప్పటికీ 2,011 మంది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పథకం కింద 2017 నుంచి ఇప్పటివరకు కేవలం 7,392 మంది మాత్రమే లబ్ధి పొందారు. ఎస్సీ, ఎస్టీ యువతకు ప్రోత్సాహం అందజేస్తున్నట్లు ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నా ఆచరణలో మాత్రం ఆశించిన ఫలితాలు రావడంలేదు.

ఎడ్యుకేషన్, ఎంట్రిప్రెన్యూర్‌షిప్, ఎంప్లాయిమెంట్ అనే 3-ఈ సూత్రంతో నిమ్న వర్గాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకొస్తామని ప్రభుత్వం ఈ పథకం గురించి గొప్పగా చెప్పింది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 2017 నుంచి 2021 వరకు యువత నుంచి వచ్చిన దరఖాస్తులు, స్క్రూటినీ తర్వాత అర్హత పొందినవారు, ఇంకా పరిశీలనలో ఉన్న దరఖాస్తులు తదితర వివరాలు ఇలా ఉన్నాయి.

సంవత్సరం దరఖాస్తులు ఎంపిక తిరస్కరణ పెండింగ్
2017 7060 5718 1339 7
2018 13509 10668 2867 7
2019 10412 7072 3,301 20
2020 12485 9216 3,027 139
2021 7924 4,180 838 1,838

ఇచ్చింది గోరంత…

ఎస్సీ, ఎస్టీలకు రుణ సబ్సిడీ ఇచ్చి ఆర్థికంగా బలోపేతం చేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ రుణాలు మాత్రం 15% మందికే అందాయి. వివరాల్లోకి వెళ్తే, 2017లో 7,060 మంది రుణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో 5,718 మంది ఎంపికయ్యారు. కానీ కేవలం 853 మందికే ప్రభుత్వం రుణాలను మంజూరు చేసింది. మొత్తం అర్హులైన దరఖాస్తుదారుల్లో ఇది 14.91 శాతం మాత్రమే. ఆ మరుసటి సంవత్సరం (2018లో) 13,509 మంది దరఖాస్తు చేసుకుంటే అందులో 10,668 మంది ఎంపికయ్యారు. రుణాలు మాత్రం 2,016 మందికే వచ్చాయి. ఇది 18.89 శాతమే. 2019లో 10,412 మంది దరఖాస్తు చేసుకుంటే 7,072 మంది ఎంపికయ్యారు. రుణాలు మాత్రం 2,869 మందికి వచ్చాయి. ఈ ఏడాదిలోనే ఎక్కువ మందికి 40.13 శాతం మందికి ప్రభుత్వం అందజేసింది.

గతేడాది (2020లో) 12485 మంది దరఖాస్తు చేసుకోగా 9,216 మందిని అధికారులు ఎంపిక చేశారు. ఇందులో 1,632 మందికి రుణాలు అందాయి. కరోనా కారణంగా రాష్ట్రానికి ఏర్పడిన ఆర్థిక చిక్కులతో ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలను ఈ పథకం కింద ఆదుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ సంవత్సరం (2021లో) నవంబర్ చివరి నాటికి 7,924 మంది దరఖాస్తు చేసుకోగా అందులో అన్ని అర్హతలూ సాధించి 4,180 మంది ఎంపికయ్యారు. కానీ కేవలం 22 మందికి మాత్రమే రుణాలు మంజూరయ్యాయి. ఇది మొత్తం అర్హత సాధించిన దరఖాస్తుదారుల్లో కేవలం 0.22 శాతం మాత్రమే. పరిశ్రమల శాఖ అధికారికంగా ఇచ్చిన గణాంకాల ప్రకారం, 2017 నుంచి 2021 నవంబర్ వరకు ఈ ఐదేళ్లలో 7,392 మంది మాత్రమే ‘టీ ప్రైడ్’ పథకం కింద రుణాలు పొందగలిగారు.


Next Story

Most Viewed