గంటా వైసీపీ ఎంట్రీ, అవంతి టెన్షన్… కారణం ఇదేనా?

by  |
గంటా వైసీపీ ఎంట్రీ, అవంతి టెన్షన్… కారణం ఇదేనా?
X

విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరనున్నారని వార్త ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఎంట్రీకి జగన్ ఓకే చెప్పారని, గంటా వైసీపీ తీర్ధం పుచ్చుకునేందుకు ఆగస్టు 9 న ముహూర్తం ఫిక్స్ అయినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన రాకను మంత్రి, భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్, జిల్లా వైసీపీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

చిన్నాపురం, తగరపువలస, విఎం పాలెం లో గురువారం ఉదయం వైసీపీ కార్యకర్తలు గంటాను పార్టీలో చేర్చుకోవద్దంటూ పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కార్యకర్తలను ఇబ్బంది పెట్టారని, ఆయనను పార్టీలో చేర్చుకుని మా మనోభావాలను దెబ్బ తీయొద్దని అధిష్టానాన్ని కోరుతున్నారు. అయితే వీరి ఆందోళనల వెనుక అవంతి హస్తం ఉందని ఆరోపిస్తున్నారు గంటా వర్గీయులు.

2019 ఎన్నికల ముందు కొద్దిరోజుల వరకు గంటా, అవంతి మంచి మిత్రులు. అదే పార్టీలో ఉంటే మంత్రి పదవి దక్కదని, జిల్లాలో బలమైన నేత గంటా ఉండగా టీడీపీలో ఎదగడం కష్టం అని భావించి అవంతి పార్టీ మారినట్టు అప్పట్లో పుకార్లు వచ్చాయి. అవంతి టీడీపీని వీడడం బాగా కలిసొచ్చింది. వైసీపీ అధికారంలోకి రావడం, మంత్రి పదవి దక్కడంతో జిల్లాలో తన స్థానాన్ని పటిష్టపరుచుకుంటూ అడుగులు వేస్తున్నారు అవంతి.

ఇప్పుడు గంటా కూడా వైసీపీలో చేరితే కథ మళ్ళీ మొదటికి వస్తుందేమో అని అవంతి భయపడుతున్నారని ఆయన వ్యతిరేకులు భావిస్తున్నారు. ఎందుకంటే గంటా లాంటి ఓటమి ఎరుగని నేత, జిల్లా వ్యాప్తంగా బలం ఉన్న నాయకుడు తమ పార్టీలో చేరతా అంటే జగన్ కూడా సంతోషంగా ఆహ్వానిస్తారు. అదనంగా ముఖ్య పదవి కూడా కట్టబెట్టే అవకాశాలు లేకపోలేవు. ఏపీలో రెండవ మంత్రివర్గ విస్తరణ జరగలేదు. ఈ నేపథ్యంలో గంటాకు మంత్రి హామీ ఇచ్చే అవకాశం ఉండొచ్చు అని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

అదే జరిగితే పాలనా రాజధానిగా అవతరించనున్న విశాఖలో అవంతికి అధికారం తగ్గిపోతుందని భావించే ఇలా వ్యతిరేక నినాదాలు చేయిస్తున్నారని గంటా వర్గీయులు ఆరోపిస్తున్నారు. విశాఖ రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే…

Next Story

Most Viewed