ఏఈ లీల‌ల‌పై మౌన‌మేలా..?

by Dishanational2 |
ఏఈ లీల‌ల‌పై మౌన‌మేలా..?
X

దిశ‌ప్రతినిధి, వ‌రంగ‌ల్‌, బ‌య్యారం : మ‌హ‌బూబాబాద్ జిల్లా బ‌య్యారం మండ‌లంలోని ఇరిగేష‌న్ ఏఈ శ్రీకాంత్‌ లీల‌ల‌పై శాఖ జిల్లా అధికారులు మౌనం దాల్చతుండ‌టం అనుమానాల‌కు తావిస్తోంది. బ‌య్యారం మండ‌లం వెంక‌ట‌పూర్ గ్రామ పంచాయ‌తీ ప‌రిధిలోని జ‌గ‌నతండాలోని రుక్కమ్మకుంట చెరువు 9 ఎక‌రాల విస్తీర్ణాన్ని క‌లిగి ఉండ‌గా ఏకంగా 30 ఎక‌రాలుగా ఉన్నట్లుగా లేని భూమిని రికార్డుల్లో సృష్టించాడు. ఆర్టీఐ ద్వారా ఓ యువ‌కుడు ఈ విష‌యాన్ని బ‌ట్టబ‌య‌లు చేశాడు. మ‌త్స్యశాఖ ఏడీకి అంద‌జేసిన రికార్డుల్లో చెరువు విస్తీర్ణం 30 ఎక‌రాలుగా పేర్కొన‌గా, మండ‌ల త‌హ‌సీల్దార్ కార్యాల‌యం అధికారులు ఆర్టీఐకి ఇచ్చిన స‌మాధానంలో కేవ‌లం 9 ఎక‌రాల విస్తీర్ణాన్నే క‌లిగి ఉన్న విష‌యం ఇరిగేష‌న్ ఏఈ శ్రీకాంత్ రికార్డుల సృష్టిని బ‌ట్ట‌బ‌య‌లు చేస్తోంది.

ఇదీ జ‌రిగింది..?!

బ‌య్యారం మండ‌లం వెంక‌ట‌పూర్ గ్రామ పంచాయ‌తీ ప‌రిధిలోని జ‌గ‌నతండాలోని రుక్కమ్మకుంట ( పాముల కుంట) సర్వే నెంబరు 1396 లో 09.10 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అయితే చెరువును 30 ఎకరాల విస్తీర్ణం క‌లిగి ఉన్నట్లుగా పేర్కొంటూ ఇరిగేష‌న్ ఏఈ శ్రీకాంత్ జిల్లా మ‌త్స్యశాఖ ఏడీ నాగ‌మ‌ణికి నివేదిక పంపారు. నిబంధ‌న‌ల ప్రకారం మ‌త్స్యసొసైటీల ఏర్పాటుకు క‌నీసం ప‌దిహేను మంది స‌భ్యులు ఉండాలి. ఒక్కో స‌భ్యుడికి రెండ‌క‌రాల విస్తీర్ణాన్ని క‌లిగి ఉండేలన్నది ప్రాథ‌మిక నిబంధ‌న‌. అయితే రుక్కమ్మకుంట చెరువు విస్తీర్ణం తొమ్మది ఎక‌రాలు మాత్రమే. అయితే కొంత‌మంది రాజ‌కీయ నేప‌థ్యం క‌లిగి ఉన్న నేత‌ల ప్రొద్బలంతో పురుడు పోసుకుంటున్న సొసైటీకి చెరువు విస్తీర్ణం స‌మ‌స్య ఆటంకంగా మారింది. ఏం జ‌రిగిందో తెలియ‌దు కాని ఇరిగేష‌న్ ఏఈ నుంచి లేని 21 ఎక‌రాల భూమిని చెరువు విస్తీర్ణంలో క‌లుపుతూ మొత్తం 30 ఎక‌రాలుగా చూపుతూ మ‌త్స్యశాఖ ఏడీకి నివేదిక‌లు అందాయి.

అవినీతి ఆరోప‌ణ‌లు.. ఐనా మౌన‌మే..!

గిరిజ‌న మ‌త్స్య స‌హ‌కార సొసైటీ ఏర్పాటు విష‌యంలో ఇరిగేష‌న్ అధికారి లేని భూమిని సృష్టించిన విష‌యం ఆర్టీఐ ద్వారా యువ‌కుడు వెలుగులోకి తీసుకొచ్చినా.. ఉన్నతాధికారులు ఎలాంటి చ‌ర్యలు తీసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. త‌ప్పుడు నివేదిక‌లు అంద‌జేసినందుకు గాను స‌ద‌రు అధికారికి భారీగానే ముడుపులు ముట్టిన‌ట్లుగా కూడా ఆరోపణ‌లు వినిపిస్తున్నాయి. సొసైటీ మాటున చెరువును హ‌స్తగ‌తం చేసుకునేందుకు కొంత‌మంది క‌దిపిన పావుల‌కు మ‌త్స్యశాఖ అధికారులు సైతం స‌హ‌క‌రించిన‌ట్లుగా జ‌రుగుతున్న ప‌రిణామాలు ద్వారా స్పష్టమ‌వుతోంది. నిరుద్యోగ‌, పేద కుటుంబాల‌కు సొసైటీల్లో స‌భ్యులుగా చేర్చుకోవాలి. అయితే ప్రస్తుతం స‌భ్యులుగా ఉన్నవారిలో ఉద్యోగాలు క‌లిగి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏఈ శ్రీకాంత్‌, మ‌త్స్యశాఖ అధికారుల వైఖ‌రిపై స‌మ‌గ్ర‌మైన విచార‌ణ జ‌రిపితే మ‌రిన్ని అక్రమాలు వెలుగులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అంతేకాకుండా జిల్లాల్లో సొసైటీల ఏర్పాటును పునః ప‌రిశీల‌న చేస్తే రెండు శాఖ‌ల అధికారుల అక్ర‌మాలు వెలుగులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్న అభిప్రాయం ప్రజానీకం నుంచి వెలువడుతోంది. రెండు శాఖ‌ల అధికారులు ఏం చేస్తారో వేచి చూడాలి.







Next Story