ఉన్నవారిని తొలగించి.. లీడర్ల మనుషులకు ఉద్యోగాలు

107
GHMC

దిశ, మేడ్చల్ ప్రతినిధి: కూకట్‌పల్లి సర్కిల్‌లో గత ఐదేళ్లుగా పనిచేస్తున్న ఓ పారిశుద్ధ్య కార్మికురాలిని ఇటీవల ఏ కారణం లేకుండానే విధుల నుంచి తొలగించారు. తాను ఏ తప్పు చేశానని ప్రశ్నిస్తే.. పై అధికారుల ఆదేశాలని సూపర్ వైజర్ తప్పించుకున్నాడు. ఆమె కొద్ది రోజులుగా సర్కిల్ కార్యాలయం చుట్టూ ఉద్యోగం కోసం తిరుగుతుంది. ఎవరూ ఆమె గోడును పట్టించుకోవడం లేదు. ఇంతలోనే స్థానిక కార్పొరేటర్ మనిషంటూ ఓ మహిళను విధుల్లోకి తీసుకున్నారు. అల్వాల్ సర్కిల్‌లో విధులకు తరచూ డుమ్మా కోడుతున్నావంటూ ఇద్దరు కార్మికులను తొలగించారు. వారి స్థానంలో ఓ ప్రముఖ రాజకీయ నేత మనుషులను నియమించారు. మీరు కొంతకాలం ఆగితే మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.

అయితే పోయిన ఉద్యోగం వస్తుందా..? రాదా..? అనే అయోమయంలో వారు ఉన్నారు. పారిశుద్ధ్య కార్మికులను తొలగించి వారి స్థానంలో అధికార, ప్రజా ప్రతినిధులకు సంబంధించిన మనుషులను నియమిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. జీహెచ్ఎంసీలో బయటకు తెలియకుండా పారిశుద్ధ్య కార్మికుల నియామకాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. కార్పొరేటర్ తాలూకు మనుషులో.. ఎస్ఎఫ్ఏ కుటుంబీకులో.. ప్రముఖులకు తెలిసిన వారినో.. అడ్డదారిలో నియమిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఏళ్ల తరబడి చెత్తనే నమ్ముకున్న వారిని అర్ధాంతరంగా.. ఏ కారణాలు లేకుండా విధుల్లో నుంచి తొలగిస్తున్నారని పలువురు పారిశుద్ధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గుట్టుగా అవినీతి..

బల్దియాలో డిప్యూటీ కమిషనర్లు, ఏఎంఓహెచ్‌లు, ఎస్ఎఫ్‌ఏలు బయటకు తెలియకుండా పారిశుద్ధ్య కార్మికులను నియమిస్తున్నారు. కొందరు పారిశుద్ధ్య కార్మికులు పనులు చేయకుండానే జీతాలు చెల్లిస్తున్నట్లు కూడా ఆరోపణలున్నాయి. పారిశుద్ధ్య కార్మికుల్లో దాదాపు 30 శాతం మంది పేర్లు కాగితాల్లో తప్ప.. క్షేత్రస్థాయిలో పనుల్లో ఉండరని కొంత మంది కార్మికులు చెబుతున్నారు. విధుల్లో లేని వారికి జీతాలను ఇవ్వకుండా నివారించేందుకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని తెచ్చారు. కాని నకిలీ వేలి ముద్రలతో గతంలో అవినీతికి పాల్పడం తెలిసిందే. అయితే వీరి నుంచి నెల నెలా మామూళ్లు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఎంతో కాలంగా ఉన్నాయి. అయినా ఎవరిపైన విచారణ జరిపి తగిన చర్యలు తీసుకున్నా దాఖలాల్లేవు. ఎస్ఎఫ్ఏ నుంచి శానిటరీ జవాన్, శానటరీ ఇన్ స్పెక్టర్‌ల నుంచి ఏఎంఓహెచ్, డిప్యూటీ కమిషనర్ల వరకు అవినీతిలో వాటాలున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

వారు కూడా ఇక్కడే తిష్ట..

ఆరోగ్యశాఖ నుంచి డిప్యూటేషన్ పై వచ్చిన వైద్యులు ఏఎంఓహెచ్‌లుగా విధులు నిర్వహిస్తున్నారు. నిర్ణీత కాలం వరకే బల్దియాలో పని చేయాల్సి ఉన్నా.. అక్రమంగా ఏళ్ల తరబడి ఇక్కడే తిష్ట వేస్తున్నారు. వైద్య వృత్తి చేయాల్సిన వారు ఆ వృత్తిని మానేసి ‘చెత్త’ పనులు చేయడంపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు లేక రోగులు చాలా అవస్థలు పడుతున్నారు. కరోనా వల్ల అనేక మంది ప్రాణాలను కోల్పోయారు. కానీ వీరు మాత్రం అసలు వృత్తిని వదిలేసి చెత్త పనులనే ఇష్టపడుతున్నారు. ఏఎంఓహెచ్ లకు వైద్యానికి సంబంధించిన బాధ్యతలు అప్పగించి, పారిశుద్ధ్యం (చెత్త) కు సంబంధించిన పనులను ఇంజనీర్లకు అప్పగించాలని గతంలో నిర్ణయించిన.. అది కార్యరూపం దాల్చలేదు.