బాధలో ఇంటర్ బోర్డు.. రీజన్ ఇదే

by  |
బాధలో ఇంటర్ బోర్డు.. రీజన్ ఇదే
X

దిశ, న్యూస్​ బ్యూరో: జూనియర్​ కాలేజీలు, పాఠశాలల్లో ఆన్​లైన్​ క్లాసులు నిర్వహించాలని స్వయంగా విద్యాశాఖ మంత్రి ఈ నెల 10న ప్రకటించారు. ఈ మేరకు 17 నుంచి ప్రభుత్వ, ఎయిడెడ్​ జూనియర్​ కాలేజీల్లో ఆన్​లైన్​ క్లాసుల నిర్వహణకు సంబంధించిన మార్గనిర్దేశకాలను ఇంటర్​ బోర్డు కమిషనర్​ 14న విడుదల చేశారు. కానీ, ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో నిమిషాల వ్యవధిలోనే కమిషనర్​ ఆ ఆదేశాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆన్​లైన్​ క్లాసుల ప్రారంభం కూడా వాయిదాపడింది. విద్యాశాఖ మంత్రి ఆదేశాల ప్రకారమే విధులు నిర్వహించినా తాము అవహేళన పాలవుతున్నామని ఆఫీసర్లు బాధపడుతున్నారు.

దశల వారీగా..

ప్రభుత్వ, ఎయిడెడ్‌ జూనియర్‌ కాలేజీల్లో 17 నుంచి, పాఠశాలల్లో 20 నుంచి దశలవారీగా విద్యార్థులకు ఆన్​లైన్​ క్లాసులు నిర్వహించాలని విద్యాశాఖ సూచించింది. ఈ నేపథ్యంలో 17 నుంచి ప్రభుత్వ, ఎయిడెడ్​ కాలేజీలను తెరిచేందుకు అవసరమైన ఉత్తర్వులను ఇంటర్​ బోర్డు కమిషనర్ సయ్యద్​ ఉమర్​ జలీల్​ శుక్రవారం సాయంత్రం జారీ చేశారు. పూర్తిస్థాయిలో స్టాఫ్​ హాజరు కావడంతో పాటు ఆన్​లైన్​ క్లాసులను విద్యార్థులకు అందించేందుకు అవసరమైన చర్యలపై సూచనలు చేశారు. దూరదర్శన్​, స్మార్ట్​ ఫోన్​ వంటి సహాయంతో విద్యార్థులు క్లాసులు వినేలా చూడాలని కమిషనర్​ సూచించారు. అయితే, ఆ ఆదేశాలొచ్చిన నిమిషాల వ్యవధిలో ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు కమిషనర్​ ప్రకటించారు. కేబినెట్​ స్థాయిలోని వారు లేదా స్వయంగా సీఎం నిర్ణయం మేరకు కమిషనర్​ ఉత్తర్వులను రద్దు చేసినట్లు సమాచారం.

రద్దు సరికాదు..

ఆన్​లైన్​ క్లాసులు నిర్వహించాలని సర్కారు నిర్ణయించిన మేరకు ఇంటర్​ బోర్డు ఉత్తర్వులు విడుదల చేసింది. 17 నుంచి క్లాసులు ప్రారంభించాల్సిన నేపథ్యంతో 15న స్వాతంత్య్ర దినోత్సవం, 16న ఆదివారం కావడంతో 14నే బోర్డు ఆదేశాలు వెలువరించిందని, ఆ తర్వాత ప్రభుత్వం రద్దు చేయించడం సరికాదని ఇంటర్​‌బోర్డు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఆన్​లైన్​ క్లాసుల నిర్ణయాన్ని వాయిదా వేయాలనుకుంటే ఉత్తర్వులు విడుదల కాకముందే చెప్పాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి చర్యల వల్ల ఆఫీసర్లు ఆత్మవిశ్వాసం కోల్పోతారని వాపోయారు.

వాయిదా వెనక రీజన్స్..

సర్కారు నిర్ణయం కేవలం నాలుగు రోజుల్లోనే వెనక్కిపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. సెప్టెంబర్​ 1 తర్వాత అకడమిక్ ఇయర్​ ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం గతంలోనే సూచించింది. అయితే, మన రాష్ట్రంలో ముందుగానే ఆగస్టు 17, 20 తేదీల నుంచే తరగతులు నిర్వహించేందుకు సర్కారు సిద్ధమయింది. దీంతో ఈ నిర్ణయానికి కేంద్రప్రభుత్వం నుంచి అనుమతిలేదని, అందుకే వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.ఇంటర్​ బోర్డు ముందుగా ప్రభుత్వ, ఎయిడెడ్​ కాలేజీల్లో ప్రవేశాలకు మాత్రమే అనుమతినిచ్చింది. ఇప్పటికే ప్రైవేటు కాలేజీల గుర్తింపు వ్యవహారం, ప్రభుత్వ కఠిన నిబంధన అమలుపై అభ్యంతరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంలో ఇంటర్​బోర్డు ఉత్తర్వులు కొత్త సమస్యలను తెస్తాయని భావించే వాటిని రద్దు చేయించినట్లు సమాచారం.

పాఠశాలల్లో క్లాసులపై సందిగ్ధం..

ఇంటర్​ కాలేజీల ఆన్​లైన్​ క్లాసుల నిర్వహణ వాయిదా పడటంతో పాఠశాలల విషయంలో కూడా ఇదే జరుగనుందని స్పష్టమవుతోంది. పాఠశాలల్లో ఈ నెల 20 నుంచి యాభై శాతం సిబ్బందితో, ఆన్​లైన్​ క్లాసులు నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది. అందుకు 17 నుంచే ఉపాధ్యాయులు పాఠశాలకు రావాలని సూచించింది. కానీ, ఇందుకు సంబంధించి ఇప్పటివరకూ ఎలాంటి ఉత్తర్వులను సర్కారు విడుదల చేయలేదు. అకడమిక్​ ఇయర్​లో విద్యార్థుల జాయినింగ్​, కొవిడ్​ వ్యాప్తి నివారణలో జాగ్రత్తలు, అనుసరించాల్సిన చర్యలపైనా ఎలాంటి గైడ్​లైన్స్​ను విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో కేంద్రం నిర్ణయించిన తేదీ కంటే ముందుగానే పాఠశాలలు తెరిచే అవకాశం కనిపించడం లేదు. మరో వైపు రాష్ట్రంలో ప్రస్తుతం కొవిడ్ రూరల్​ ఏరియాల్లోనే ఎక్కువగా వ్యాపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలల నిర్వహణ ఇప్పుడు పెద్ద టాస్క్​గా మారింది. దీంతో పాఠశాలల్లోనూ ఆన్​లైన్​ క్లాసుల నిర్వాహణపై సర్కారు పునరాలోచనలో పడింది.

Next Story