మురిపించి ముగించేశారు.. విధుల్లోకి తీసుకుని తొలిగించారు

by  |
మురిపించి ముగించేశారు.. విధుల్లోకి తీసుకుని తొలిగించారు
X

దిశ, గోదావరిఖని: ఆర్ఎఫ్‌సీఎల్ కేంద్ర ఎరువుల కర్మాగారం ప్రారంభమైతే ఎంతోమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని భావించిన మాజీ ఉద్యోగుల కుటుంబాల ఆశలు ఆవిరిగానే మిగిలిపోయాయి. ఎరువుల కర్మాగారం ప్రారంభం కావడంతో కొందరు ఖద్దరు చొక్కా నాయకులు దళారీ వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ ఉద్యోగాలలో నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలను దండుకుంటున్నారు. ఒక ఉద్యోగానికి 10 లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తడంతో స్పందించిన సెంట్రల్ విజిలెన్స్ అధికారులు ప్రజాసంఘాల ఫిర్యాదుతో విచారణకు వచ్చారు. ఈ క్రమంలో ఆర్ఎఫ్‌సీఎల్ యాజమాన్యం ఏర్పాటు చేసిన అతిధి గృహంలో కూడా ఉండకుండా బయట నుంచి వచ్చి ఉద్యోగుల నుండి వివరాలు అడిగి తెలుసుకొని విచారణ చేపట్టారు. ఈ విచారణలో డబ్బులు పెట్టి ఉద్యోగాల్లో చేరారనే విమర్శలు వచ్చిన కొంతమందిని విధుల నుండి పక్కనపెట్టి ఇతరులకు స్థానికంగా ఉండే వారికి ఈ అవకాశాన్ని కల్పించారు. విధుల నుండి తొలగించిన వారి నుండి ఎంత డబ్బు ఖర్చు చేసి ఉద్యోగాల్లో చేరారు. అనేదానిపై వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. అయితే విజిలెన్స్ విచారణ ముగియడంతో నూతనంగా విధుల్లోకి తీసుకున్న కొంతమందిని పక్కకు పెట్టినట్లు స్థానికంగా ప్రచారం సాగుతోంది.

అనుమానాలే నిజమయ్యాయి..?

ఆర్ ఎఫ్ సీ ఎల్ కేంద్ర ఎరువుల కర్మాగారంలో ఎంతోమంది నిరుద్యోగుల నుండి కొంతమంది దళారులు డబ్బులు దండుకున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తడంతో స్పందించిన సెంట్రల్ విజిలెన్స్ అధికారులు నేరుగా విచారణ చేపట్టారు. ఈ విచారణలో డబ్బులు దండుకున్నారని విషయం బయటపడడంతో కొంతమంది సిబ్బందిని నిధుల నుండి తొలగించారు. ఆ సమయంలో వారి స్థానాల్లో స్థానికంగా ఉండే వారితో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారిని విధుల్లోకి తీసుకున్నారు. విచారణ కొనసాగిన ఈ కొన్ని రోజులు విధుల్లోకి తీసుకున్న వారిని మళ్లీ విధుల నుండి తొలగించి పాతవారిని తీసుకున్నట్లు పలువురు వాపోతున్నారు.

“అధికారం” లో దాగిన విచారణ రిపోర్ట్

అధికారం మనదైతే ఏం చేసినా చెల్లుతుంది అనేదానికి ఈ సంఘటనే నిదర్శనంగా చెప్పవచ్చు. ఓవైపు ప్రజా సంఘాలు మరోవైపు నిరుద్యోగులు ఉద్యోగాల నుండి లక్షల రూపాయలను దండుకున్నారని ఫిర్యాదు చేయడంతో విచారణకు వచ్చిన సెంట్రల్ విజిలెన్స్ అధికారులకు అధికార ఒత్తిడి కారణమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. విచారణ జరిగినన్ని రోజులు కొత్త వారికి అవకాశం ఇచ్చి విచారణ ముగిశాక అధికార పార్టీ నాయకుడు చెప్పినవారికే. ఆయా నాయకుడు సెలెక్ట్ చేసి లెటర్ లో పేరు పంపిన వారిని మళ్లీ వీధుల్లోకి తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. తన అధికారంతో సెంట్రల్ విజిలెన్స్ అధికారులు సైతం సదరు నాయకులు కట్టడి చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఉన్నత అధికారులు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.


Next Story

Most Viewed