అసమర్థ కేసీఆర్ గద్దె దిగిపో..

by  |
అసమర్థ కేసీఆర్ గద్దె దిగిపో..
X

దిశ, తెలంగాణ బ్యూరో : అసమర్థ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని షర్మిల ముఖ్య అనుచరురాలు ఇందిరాశోభన్ శనివారం డిమాండ్ చేశారు. కొవాగ్జిన్ టీకా హైదరాబాద్‌లోనే తయారవుతున్నా.. రాష్ట్ర ప్రజలకు ఇప్పటికీ వ్యాక్సిన్ ఇప్పించలేని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని ఆమె మండిపడ్డారు. ఆస్పత్రుల్లో మౌలిక వసతులు లేక కరోనా మహమ్మారితో జనం పిట్టల్లా రాలుతుంటే కేసీఆర్ మాత్రం ప్రగతి భవన్‌లో కూర్చుని చోద్యం చూస్తున్నారని విమర్శించారు.

రెండు రోజుల వ్యవధిలోనే ఆక్సీజన్ కొరతతో బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రిలో 15 మంది, సూర్యాపేట ప్రభుత్వాసుపత్రిలో 11 మంది చనిపోవడం టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లేనని అన్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా అంతా బాగానే ఉందంటూ.. మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ తక్షణమే వైద్య ఆరోగ్యశాఖను సమర్థుడైన బీసీ నాయకుడికి అప్పగించాలని ఇందిరాశోభన్ డిమాండ్ చేశారు.

కరోనా సేకండ్ వేవ్ ఇంత తీవ్రంగా ఉన్న సమయంలో, ముఖ్యమంత్రి తన ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు.. భూముల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని ఆమె ఆరోపించారు. తమ నాయకురాలు వైఎస్ షర్మిల కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చి, పేదల ప్రాణాలను కాపాడాలని ఎన్నిసార్లు విన్నవించినా.. కేసీఆర్ మాత్రం పెడచెవినపెట్టడం ఎంత వరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. ఇప్పటికైనా.. తెలంగాణ ప్రభుత్వం మేల్కొని యుద్ధ ప్రాతిపదికన కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాల్సిన అవసరముందన్నారు. రాష్ట్ర ప్రజలను రక్షించుకోవాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్‌పైనే ఉందని, లేదంటే తన పదవికి రాజీనామా చేయాలని ఇందిరాశోభన్ డిమాండ్ చేశారు.

Next Story