రూ.20 లక్షలకు రెక్కలు.. అధికారుల దుమ్ము దులిపిన మహిళలు

by  |
fraud-11
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఇందిరా క్రాంతి పథకంలో మహిళా సభ్యులు పొదుపు చేసే డబ్బులు బ్యాంకుకు చేరకుండానే గాయబ్ అయ్యాయి. ప్రతి నెలా గ్రామ పొదుపు సంఘాల సభ్యులు పొదుపు చేసిన డబ్బులను సేకరించే సీఏ, క్లస్టర్ సీసీల ఆధ్వర్యంలో రూ. 20 లక్షలు గాయబ్ అయ్యాయి. రెండు నెలల తరువాత తమ సొమ్ము గురించి బ్యాంకులో వాకబు చేయగా మహిళా సంఘాల సభ్యుల డబ్బులు బ్యాంకులోని వారి ఖాతాలలో జమ కాలేదని తెలియడంతో లబోదిబోమన్నారు. ఈ ఉదంతం బోధన్ ఏపీఎం పరిధిలోని కలదుర్కి క్లస్టర్ లోని కల్ధూర్కి గ్రామంలో వెలుగు చూసింది. దీంతో మహిళా సంఘాల సభ్యులు సీఏను, సీసీలను సమావేశంలో దుమ్ము దులిపివేశారు. రూ.20 లక్షల నగదు గాయబ్ కావడంతో డీఆర్డీఏ అధికారులు స్పందించాల్సిన పరిస్థితి నెలకొంది.

బోధన్ డివిజన్ లోని కలదుర్కి క్లస్టర్ లో సీసీ, సీఏల చేతివాటం జరిగిందా? రూ.20 లక్షల రూపాయాలు ఎటుపోయాయి? అని విచారణ చేపట్టారు అధికారులు. అందులో భాగంగా ప్రధానంగా నిర్లక్ష్యానికి కారకుడు అయిన అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ ను సస్పెండ్ చేయాల్సి ఉన్నా కేవలం మెమోతో సరిపెట్టారు. సీసీని సస్పెండ్ చేశారు. సీఏను ఉద్యోగం నుంచి తొలిగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే కల్ధూర్కికి చెందిన సూమారు 60 గ్రామ మహిళా పొదుపు సంఘాలకు గాను కొన్ని సంఘాలకు సంబంధించిన డబ్బులు రికవరీ ఎలా అని అందరూ తలలు పట్టుకుంటున్నారు. తాము ప్రతినెల మాదిరిగా గత రెండు నెలలుగా సీఏ, సీసీలకు డబ్బులు ఇచ్చి లెక్కలు అప్పజెప్పామని, వారిపై అధికారుల పర్యవేక్షణ లేక డబ్బులు జమ చెయ్యలేదని.. కానీ ఈ విషయం అధికారులు తొక్కిపెట్టడం వెనుక మతలాబు ఉందనే ఆరోపణలు ఉన్నాయి.

గ్రామ మహిళా పొదుపు సంఘాల సభ్యుల డబ్బులు సీఏలు, సీసీలు, ఏపీఎంలు కాజెయ్యడం అనేది ఇప్పుడు సర్వసాధారణమైంది. డీఆర్డీఏ శాశ్వత ఉద్యోగులు ప్రాజెక్టు అధికారులు మాత్రమే ఉండగా మిగిలిన వారంతా తాత్కలిక ఉద్యోగులు ఉండటం.. ఏపీఎం వరకూ ఇదే పరిస్థితి ఉండటంతో అక్కడ రుణాలు ఇవ్వాలన్నా, మంజూరుకైనా ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ఈ ఏడాది మూడు నెలల క్రితం మాక్లూర్ మండలంలో ఓ గ్రామంలో మహిళా సంఘాల డబ్బులను సీసీ, సీఏ దారి మళ్లించారు. ఇతర సంస్థలలో పెట్టుబడులను పెట్టి నిండా ముంచిన తరువాత చెతులెత్తేశారు. గత ఏడాదిన్నర క్రితం బాల్కొంలో ఇదే మాదిరిగా మహిళలు పొదుపు చేసుకున్న డబ్బులకు రెక్కలు వచ్చాయి. పొదుపు చేసుకుని బాగుపడుదామనుకుంటే ఇందిరా క్రాంతి పథకంలో కొందరు అవినీతి వల్ల సామాన్య పేద మహిళల కలలు కలలుగానే మిగిలిపోతున్నాయి. డీఆర్ డీఏ లో ముఖ్యంగా పైసల విషయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, రికవరీలు చెయ్యకపోతే పరిస్థితి దారుణంగా ఉండే పరిస్థితి నెలకొంది.


Next Story