అత్యధిక యూనికార్న్ కంపెనీలతో మూడో స్థానంలో భారత్!

by  |
Byju
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో ఈ ఏడాది కొత్త యూనికార్న్ కంపెనీలు సత్తా చాటాయి. తాజా హురున్ ఇండియా నివేదిక ప్రకారం.. భారత్ మొత్తం 54 యూనికార్న్ కంపెనీలతో యూకే ను అధిగమించి మూడో స్థానంలో నిలిచింది. బుధవారం వెల్లడైన నివేదికలో మన దేశం నుంచి అత్యంత విజయవంతమైన యూనికార్న్ కంపెనీగా 1.6 లక్షల కోట్ల విలువ కలిగిన ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్ నిలిచింది. ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 15వ స్థానంలో ఉంది. భారత్ వెలుపల 65 యూనికార్న్‌లను భారతీయులు స్థాపించారని నివేదిక తెలిపింది.

వీటిలో పోస్ట్‌మ్యాన్, ఇన్నోవాకర్, ఐసెర్టిస్, మోగ్లిక్స్ లాంటి కంపెనీలున్నాయి. దేశీయంగా బెంగళూరు ఎక్కువ యూనికార్న్ కంపెనీలను కలిగిన నగరంగా నిలిచింది. 1 బిలియన్ కంటే ఎక్కువ విలువైన కంపెనీలను యూనికార్న్‌లుగా పరిగణిస్తారు. భారత్‌లో ఈ ఏడాది మొత్తం 33 కంపెనీలు యూనికార్న్‌లుగా అవతరించాయి. దేశీయంగా కార్యకలాపాలను కలిగిన యూనికార్న్ కంపెనీలు 45 శాతానికి పెరిగాయని, ఇది భారత్‌లో స్టార్టప్‌ల అభివృద్ధికి నిదర్శనమని హురున్ ఇండియా ఎండీ రెహమాన్ జునైద్ అన్నారు. బైజూస్ తర్వాత ఈ జాబితాలో రూ. 90 వేల కోట్లతో ఇన్‌మొబీ కంపెనీ రెండో స్థానంలో నిలిచింది. రూ. 71 వేల కోట్లతో ఆతిథ్య సేవల సంస్థ ఓయో, రూ. 57 వేల కోట్లతో రేజర్‌పే, రూ. 52 వేల కోట్లతో ఓలా, రూ. 38 వేల కోట్లతో ఫామ్ ఈజీ, రూ. 36 వేల కోట్లతో స్విగ్గీ, డ్రీమ్11 కంపెనీలు ఉన్నాయి.

Next Story

Most Viewed