మేజర్ నుండి మిడిల్ పవర్‌కు ఇండియా

by  |
మేజర్ నుండి మిడిల్ పవర్‌కు ఇండియా
X

దిశ, వెబ్ డెస్క్: ఆసియా-పసిఫిక్ రీజియన్‌‌లో అత్యంత ప్రభావాన్ని వేయగల దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. సూపర్ పవర్‌లుగా అగ్రరాజ్యం అమెరికా, రెండో స్థానంలో చైనాలు నిలిచాయి. జపాన్ మేజర్ పవర్‌గా మూడో స్థానంలో ఉన్నది. ఆస్ట్రేలియా సిడ్నీకి చెందిన లోవి ఇన్‌స్టిట్యూట్ ఆసియా పవర్ ఇండెక్స్‌ను విడుదల చేసింది. 2019లో భారత్ 41.0 పాయింట్లతో మేజర్ పవర్ కేటగిరీలో ఉండగా, తాజాగా 39.7పాయింట్లకు మాత్రమే పరిమితమైంది. దీంతో మేజర్ పవర్ కేటగిరీ నుంచి మిడిల్ పవర్‌కు దిగజారింది. మేజర్ పవర్‌ కేటగిరీకి 40 పాయింట్లు అవసరం. కాగా, మేజర్ పవర్ కేటగిరీలో ప్రస్తుతం జపాన్ నిలిచింది.

చైనాకు భారత్ ప్రత్యామ్నాయంగా నిలిచేనా?

ఈ జాబితాలో భారత్ తీవ్రంగా పాయింట్లు నష్టపోయింది. మనదేశం కరోనా కట్టడిలో సమర్థమైన చర్యలు తీసుకోలేకపోవడంతో చాలా వరకు పాయింట్లు నష్టపోయి ఆసియా రీజియన్‌లో ప్రభావాన్ని కోల్పోయిందని లోవి ఇన్‌స్టిట్యూట్ పేర్కొంది. సమీప భవిష్యత్‌లో చైనాకు ప్రత్యామ్నాయంగా నిలిచే సత్తా భారత్‌కు ఉన్నదన్న వాదనలు నీరుగారిపోతున్నాయి. జనాభాలో చైనాతో పోటీగా నిలబడిన భారత్ కరోనా మరణాలు భారీగా చోటుచేసుకోవడంతో అధికారాల్లో వ్యత్యాసాలు కనిపించాయని రిపోర్టు పేర్కొంది. చైనా ఎకనామిక్ ఔట్‌పుట్‌లో 50శాతాన్ని భారత్ సాధించగలదన్న అంచనాలు గతేడాది ఉండగా, ఈ అంచనా 40శాతానికి పడిపోయిందని తెలిపింది. దౌత్య ప్రభావంలో దక్షిణ కొరియా, రష్యాలను భారత్ దాటేసింది. ఆర్థిక సంబంధాలు, డిఫెన్స్ నెట్‌వర్క్‌లో భారత్ బలహీనపడిందని వివరించింది. ఆసియాలో భారత్ సూపర్ పవర్‌గా నిలవడానికి మరికొన్ని దశాబ్దాలు పట్టే అవకాశమున్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కరోనా దెబ్బ

భారత్ మేజర్ పవర్ నుంచి మిడిల్ పవర్‌గా దిగజారడానికి ప్రధాన కారణం కరోనా కట్టడి చర్యలు నీరుగారిపోవడంలో ఉన్నది. అలాగే, చైనా మరింత బలపడటానికి, అమెరికా సమీపానికి చేరడంలోనూ ఈ వైరస్ పాత్ర ఉన్నది. అగ్రరాజ్యం అమెరికాకు, డ్రాగన్ కంట్రీ చైనాకు గతంలో పది పాయింట్ల తేడా ఉండగా, ఇది దాదాపు సగానికి పడిపోయింది. తాజా జాబితాలో అమెరికాకు 81.6పాయింట్లు ఉండగా, చైనాకు 76.1పాయింట్లున్నాయి. ఆసియాలో అమెరికా ప్రాబల్యమూ కరోనా కట్టడిలో విఫలమవడంతో తగ్గిందని రిపోర్టు పేర్కొంది. ఎకనామిక్ రిలేషన్స్, రక్షణ ఖర్చులు, అంతర్గత స్థిరత్వం, ఇన్ఫర్మేషన్ ఫ్లో, ప్రొజెక్టెడ్ రీసోర్సెస్‌ల వంటి 128 సూచీల ఆధారంగా ఈ జాబితాను రూపొందిస్తారు.

Next Story