చైనా కరోనా.. భారత్ ఆర్థిక హైరానా

by  |
చైనా కరోనా.. భారత్ ఆర్థిక హైరానా
X

ప్రపంచీకరణతో లాభాలు ఏ స్థాయిలో ఉంటాయో నష్టాలూ అంతే స్థాయిలో ఉంటాయి. ఇందులో భాగస్వామ్యమైన ఏ దేశానికి జలుబు వచ్చినా.. ఆ దేశంతో వాణిజ్య సంబంధాలు ఉన్న అన్ని దేశాలూ తుమ్మాల్సిందే. ప్రస్తుతం మన దేశం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రస్తుతం చైనాను కొవిడ్-19 (కరోనా వైరస్) భయపెడుతోంది. కానీ, వణుకు మన దేశానికి మొదలైంది. ఆ మహమ్మారి దెబ్బకు డ్రాగన్ దేశంలోని కర్మాగారాలు, పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో మన దేశానికి దిగుమతులు నిలిచిపోయాయి. పెద్ద ఎత్తున దిగుమతులు తగ్గడంతో కీలకమైన ఐదు రంగాలు సంక్షోభాన్ని ఎదుర్కోనున్నాయి.

మన దేశ దిగుమతుల్లో చాలా వరకు చైనా నుంచే వస్తున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రికల్ యంత్రాలు, మెకానికల్, ఆప్టికల్, సర్జికల్ పరికరాలు, యంత్రాల విడిభాగాలు, ఆర్గానిక్ కెమికల్స్‌, ప్లాస్టిక్‌పై ఎక్కువగా ఆ దేశంపైనే ఆధారపడ్డాం. ప్రస్తుతం కెవిడ్-19 కారణంగా భారత దిగుమతులు 28 శాతం ప్రభావితం కానున్నాయి. ఫలితంగా నిర్మాణ, రవాణా రంగాలు, కెమికల్, యంత్ర నిర్మాణ పరిశ్రమలకు ఇబ్బందులు తప్పని పరిస్థితి.

మన దేశం దిగుమతి చేసుకుంటున్న ఆర్గానిక్ కెమికల్స్‌లో 40 శాతం, ఎలక్ట్రిక్ యంత్రాల్లో 57 శాతం చైనా నుంచే వస్తున్నాయి. మెకానికల్, యంత్ర పరికరాలను మూడింట ఒకవంతు డ్రాగన్ దేశం నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. ఆప్టికల్, సర్జికల్ పరికరాల్లో 16 శాతం చైనా నుంచే వస్తున్నాయి. చైనాలో పరిశ్రమల మూసివేత ఇకమీదట కొనసాగితే 30 నుంచి 40 శాతం యంత్ర పరికరాల దిగుమతులు పడిపోతాయి. మరోవైపు మన దేశం నుంచి చైనాకు ఎగుమతులు కూడా నిలిచిపోయాయి. కానీ, ఆ దేశంపై ఆ ప్రభావం చాలా తక్కువనే చెప్పాలి. ఎందుకంటే, మన దేశ ఎగుమతులు చైనా మొత్తం దిగుమతుల్లో కేవలం 5 శాతం కంటే తక్కువ. మన దేశం నుంచి చైనాకు ప్రధానంగా కాటన్, ఆర్గానిక్ కెమికల్ వస్తువులు ఎగుమతి అవుతున్నాయి.

2017-18 ఆర్థిక సంవత్సరంలో భారత దిగుమతుల విలువ 507 బిలియన్ డాలర్లు. ఇందులో చైనా వాటా 73 బిలియన్ డాలర్లు లేదా 14 శాతంగా ఉన్నాయి. ఈ లెక్కల ప్రకారం చైనా భారత్‌కు అతిపెద్ద ఎగుమతిదారుడిగా చెప్పాలి. ఎందుకంటే, మన దేశ మొత్తం దిగుమతుల్లో ఏడొంతుల్లో ఒక్క వంతు అక్కడి నుంచే వస్తున్నాయి. ప్రస్తుతం కొవిడ్-19 వైరస్ విజృంభన కారణంగా చైనా స్తంభించిపోయింది. ఈ నెల 17 వరకు అక్కడ కర్మగారాలు, పరిశ్రమల మూసివేత కొనసాగనుంది. అప్పటివరకు నిస్సాహాయంగా ఎదురు చూడక తప్పని పరిస్థితి.

Next Story

Most Viewed